ఆస్పత్రులకు బదులు కబేళాలు ఇచ్చారు!

6 Apr, 2017 10:44 IST|Sakshi
ఆస్పత్రులకు బదులు కబేళాలు ఇచ్చారు!

ఉత్తరప్రదేశ్‌లోని గత సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా మండిపడ్డారు. ఇంతకు ముందున్న ప్రభుత్వం ప్రజలకు ఆస్పత్రులు కట్టించి వైద్యులను ఇవ్వాల్సి ఉంటే, ఆ పని మానేసి కబేళాలు కట్టించిందని విమర్శించారు. లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యనివర్సిటీ (కేజేఎంయూ)లో కొత్త వెంటిలేటర్‌ను ప్రారంభిస్తున్న సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో త్వరలోనే ఆరు కొత్త ఎయిమ్స్‌ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం భావిస్తోందన్నారు. వైద్యులు మరింత సహనంతో ఉండాలని, ప్రైవేటు క్లినిక్‌లు నడపకూడదని సూచించారు. గత ప్రభుత్వం మంచి వైద్యులు అందరినీ సైఫై, కనౌజ్‌లకు బదిలీ చేసిందని, గోరఖ్‌పూర్‌లో మాత్రం మంచి వైద్యులకు బదులు కబేళాలు ఇచ్చిందని అన్నారు. అవసరం ఉన్న చిట్ట చివరి వ్యక్తికి కూడా మంచి వైద్యసేవలు అందించాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు.

యూపీలో కనీసం 5 లక్షల మంది వైద్యులు అవసరమని, ఈ మధ్య కొందరు వైద్యులు తప్పులు చేస్తున్నట్లు వినిపిస్తోందని అన్నారు. జూనియర్ డాక్టర్లతో పేషెంట్ల మీద దాడులు చేయిస్తున్నారని, అలా కాకుండా వైద్యులు గౌరవప్రదంగా మెలగాలని సీఎం యోగి సూచించారు. వైద్యులు స్వయంగా పల్లెలకు వెళ్లి అక్కడి ప్రజలకు వైద్యసేవలు అందించాలని తెలిపారు. కానీ వాళ్లు పల్లెలకు వెళ్లకుండా పట్టణాలు, నగరాల్లో ప్రైవేటు ప్రాక్టీసు చేసుకుంటున్నారన్నారు. అవినీతి, అనవసర ఖర్చుల వల్లే పేదలకు చాలా కష్టాలు వస్తున్నాయని ఆయన చెప్పారు. గోరఖ్‌పూర్‌లో తాను ఒక చిన్న క్లినిక్ తెరిచానని, మామూలుగా ఆస్పత్రులలో సీటీ స్కాన్‌కు రూ. 1800-4000 వరకు తీసుకుంటుంటే తాము కేవలం రూ. 400-600కే చేస్తున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు