ఏకకాలంలో ఎన్నికలు!

20 Jan, 2018 00:36 IST|Sakshi

పార్లమెంటు, అసెంబ్లీలకు పండుగలా ఎన్నికలు జరగాలి

ఒక్కరోజుతో ఆ క్రతువు ముగిసిపోవాలి

విమర్శలను పట్టించుకుంటే ముందుకెళ్లలేం

దేశంలో నెలకొన్న కుల రాజకీయాలు ప్రమాదకరం

జీ న్యూస్‌ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: పార్లమెంట్, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలన్న ప్రతిపాదనను ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి గట్టిగా సమర్ధించారు. దేశవ్యాప్తంగా కొంతకాలంగా నెలకొన్న కుల రాజకీయాలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

శుక్రవారం జీ న్యూస్‌ చానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో.. తనపై వస్తున్న విమర్శలు, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుతీరుపైనా తన అభిప్రాయా న్ని కుండబద్దలు కొట్టారు. పలు అంశాల్లో తనపై వచ్చిన విమర్శలకు ఎప్పుడూ భయపడలేదన్నారు. ‘2019 ఎన్నికల గురించి ఆలోచించి సమయం వృథా చేసుకోను. 125 కోట్ల మంది ప్రజల గురించే నేను ఆలోచి స్తాను’ అన్నారు. జీఎస్టీ, నోట్ల రద్దుతోపాటు తమ ప్రభుత్వం ఎన్నో ప్రజోపయోగ పథకాలను అమలుచేస్తోందన్నారు.

హోళీ పండగలా..
‘ఎన్నికలు పండుగలా ఉండాలి. ఉదాహరణకు హోళీ పండుగ రోజు చల్లుకున్నట్లు రంగులు చల్లుకోవాలి. అవసరమైతే బురద కూడా చల్లుకోవాలి. అది ఆ ఒక్క రోజు వరకే. ఆ తర్వాత వచ్చే ఏడాది వరకూ ఆ విషయం మరిచిపోతాం. ప్రస్తుతం దానికి భిన్నంగా.. దేశంలో ఎప్పుడూ ఎన్నికల వాతావరణమే కనిపిస్తోంది. ఒక ఎన్నిక పూర్తవగానే మరొకటి మొదలవుతోంది.

ప్రతీ ఐదేళ్లకోసారి ఒకేసారి పార్లమెంటు, అసెంబ్లీ, మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్ని ఒక నెల లేదా కొంత వ్యవధిలో పూర్తి చేస్తే భారీగా డబ్బు, వనరులు, శ్రమను ఆదా చేయగలం’ అని మోదీ చెప్పారు. విమర్శలకే సమయమంతా వృథా అవుతోందన్నారు.

యంత్రాంగమంతా ఎన్నికల్లోనే
ప్రస్తుత ఎన్నికల విధానంలో ప్రతీ ఏడాది 100, 150, 200 రోజులపాటు భారీ ఎత్తున భద్రత బలగాలు, అధికారులు, రాజకీయ యంత్రాగం ఎన్నికలకే అంకితమవుతున్నారని ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మనం ఎన్నికల్ని ఒకేసారి నిర్వహిస్తే అతి పెద్ద భారం నుంచి దేశానికి విముక్తి లభిస్తుంది’ అని అభిప్రాయపడ్డారు. ‘ఇది ఒక పార్టీకో, ఒక వ్యక్తికో సంబంధించింది కాదు. దేశ ప్రయోజనాల కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలి’ అని పేర్కొన్నారు.

విమర్శలను పట్టించుకోను.. కానీ!
జీడీపీ తగ్గినపుడు తనపై వచ్చిన విమర్శలను అసలు పట్టించుకోలేదని మోదీ తెలిపారు. ‘విమర్శలకు ఎప్పుడూ భయపడొద్దు. అదే ప్రజాస్వామ్య బలం. ప్రతి అంశాన్నీ విశ్లేషించుకోవాలి. మంచి పని చేసినపుడు ప్రశంసించాలి. లోపాలు కనిపించినపుడు విమర్శించాలి. కానీ కొన్ని సార్లు విమర్శలు పరిధి దాటిపోతున్నాయి. ఆరోపణలు ఎక్కువవుతున్నాయి. దేశం ఇంకా జీడీపీ, వ్యవసాయాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి, స్టాక్‌ మార్కెట్‌ గురించి చర్చించటం గొప్ప విషయం’ అని మోదీ పేర్కొన్నారు. కుల రాజకీయాలు ఎంతో ప్రమాదకరమని, ఇది  దేశాన్ని పీడించటం దురదృష్టకరమన్నారు.

నోట్లరద్దు, జీఎస్టీలు మాత్రమే కాదు..
నోట్లరద్దు, జీఎస్టీ మాత్రమే కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు కాదని.. ఆర్థిక ఏకీకరణ, మరుగుదొడ్ల నిర్మాణం, పేదలకు వంటగ్యాస్‌ కనెక్షన్లు, ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ, గ్రామీణ విద్యుదీకరణ, యూరియా సరఫరా, పేదలకు ఉచిత బీమా.. ఇలాంటి చాలా అంశాల్లో తమ ప్రభుత్వం పురోగతి సాధించిందని తెలిపారు. ఉద్యోగ కల్పనపై మాట్లాడుతూ.. ‘70 లక్షల మంది పీఎఫ్‌కోసం దరఖాస్తు చేసుకున్నారు. 10 కోట్ల మంది యువత ముద్ర యోజన కింద రుణాలు తీసుకుని సొంత వ్యాపారాలు మొదలుపెట్టారు. మిగిలిన చోట్ల కూడా ఉద్యోగ కల్పన జరుగుతోంది’ అని మోదీ వెల్లడించారు.

ఎప్పుడైనా ఒకే తీరు
వచ్చే ఏడాది ఎన్నికల సందర్భంగా ప్రజలను ఊరించే బడ్జెట్‌ ఉంటుందన్న వార్తలపై స్పందిస్తూ.. ‘అభివృద్ధి ఒక్కటే మా ప్రభుత్వ లక్ష్యం. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్‌ మా మంత్రం. అది మొదటి బడ్జెట్‌ అయినా ఐదో బడ్జెట్‌ అయినా.. ఎన్నికలున్నా, లేకున్నా ఒకే విధం గా వ్యవహరిస్తాం’ అని పేర్కొన్నారు.


సామాన్యుడిని.. అదే నా బలం
అంతర్జాతీయస్థాయి నేతలకు స్వాగతం పలుకుతూ ఆలింగనం చేసుకోవటాన్ని ప్రధాని సమర్థించుకున్నారు. చేతులు కలుపుకుని కుడి, ఎడమలు చూసుకోవాలనే ప్రొటోకాల్‌ తెలియని, దాపరికం తెలియని సామాన్యుడినని ఆయన పేర్కొన్నారు. ఇదే తన బలంగా మారిందన్నారు.

‘నా స్నేహశీలత, నిష్కపటత్వమే ప్రపంచ దేశాల అధినేతలకు నచ్చింది. ప్రతికూలతను అవకాశంగా మార్చుకోవటమే నా మనస్తత్వం. నేను ప్రధానిగా ఎన్నికవగానే.. చాలా మంది నాకు గుజరాత్‌ బయట ఏముందో తెలియదని విమర్శించారు. ఏమీ తెలియకపోవటమే నాకు బలంగా మారింది. ప్రపంచదేశాల సరసన నిలబడినపుడు నేను నరేంద్ర మోదీ అనే విషయం మరిచిపోతాను. 125 కోట్ల ప్రజల ప్రతినిధిగానే భావించుకుంటాను’ అని మోదీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు