ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లకు ఓకే

6 Jun, 2018 01:50 IST|Sakshi

చట్ట ప్రకారం కేంద్రం ముందుకు వెళ్లవచ్చు: సుప్రీంకోర్టు

ప్రస్తుత ఉత్తర్వులు తుదితీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టీకరణ

న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రభుత్వోద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంలో చట్టానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లవచ్చని పేర్కొంది. పదోన్నతుల్లో రిజర్వేషన్లపై వేర్వేరు హైకోర్టు తీర్పులతో పాటు, 2015లో సుప్రీంకోర్టు జారీచేసిన ‘స్టేటస్‌ కో’ ఉత్తర్వుల వల్ల మొత్తం ప్రమోషన్ల ప్రక్రియ నిలిచిపోయిందని, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ముందుకెళ్లేందుకు అనుమతించాలని మంగళవారం సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

దానిని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్‌ ఏకే గోయల్, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ల వెకేషన్‌ బెంచ్‌ ఈ అంశంపై స్పష్టతనిస్తూ.. ‘చట్ట ప్రకారం పదోన్నతులు కల్పించకుండా కేంద్రాన్ని అడ్డుకోలేరు, ఈ అంశంలో కేంద్రం ముందుకెళ్లవచ్చు. అయితే తదుపరి ఉత్తర్వులకు ప్రస్తుత తీర్పు లోబడి ఉంటుంది’ అని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లను పొడిగిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్ని కొట్టేస్తూ ఢిల్లీ హైకోర్టు గతేడాది ఇచ్చిన తీర్పును కేంద్ర ప్రభుత్వం సుప్రీంలో సవాలు చేసిన సంగతి తెలిసిందే.

ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌(ఏఎస్జీ) మణిందర్‌ సింగ్‌ వాదిస్తూ.. ‘ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఢిల్లీ, బాంబే, పంజాబ్, హరియాణా హైకోర్టులు వేర్వేరు తీర్పులిచ్చాయి. ఆ తీర్పులపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అత్యున్నత ధర్మాసనం కూడా వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది’ అని చెప్పారు. రాజ్యాంగ ధర్మాసనం వెలిబుచ్చిన అభిప్రాయంతో పాటు సుప్రీంకోర్టులోని వేర్వేరు ధర్మసనాల తీర్పుల్ని ఆయన ప్రస్తావించారు.

‘ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లకు సంబంధించి ‘స్టేటస్‌ కో’ కొనసాగుతుందని ఒక ధర్మాసనం స్పష్టం చేసింది. ఇదే అంశంపై మే 17న జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరిస్తూ.. ప్రమోషన్ల అంశంలో ప్రభుత్వం తీసుకునే చర్యలకు పెండింగ్‌ పిటిషన్‌ అడ్డంకి కాకూడదని పేర్కొంది’ అని సుప్రీంకు సింగ్‌ తెలిపారు. అలాగే పదోన్నతుల్లో రిజర్వేషన్లకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు తీర్పుల్ని ఏఎస్జీ ప్రస్తావించారు.

ప్రస్తుత పరిస్థితులకు 2006 నాటి ఎం.నాగరాజ్‌ కేసులో సుప్రీం వెలువరించిన తీర్పును అమలుచేయవచ్చని సూచించారు. ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లకు క్రీమీలేయర్‌ వర్తించదని ఎం.నాగరాజ్‌ తీర్పులో సుప్రీం స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రమోషన్ల పక్రియను ఎలా కొనసాగిస్తున్నారని ఏఎస్జీని ధర్మాసనం ప్రశ్నించగా.. ‘పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది. రాజ్యాంగం కల్పించిన అధికారం మేరకు ప్రమోషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటుంది.

మే 17న సుప్రీం ఇచ్చిన తీర్పు లాంటిదే కేంద్రం కోరుకుంటుంది’ అని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించే అధికారాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 16 (4ఏ) కేంద్రానికి కట్టబెట్టిందని ఏఎస్జీ సింగ్‌ వాదించారు. ‘ఆ అధికరణం ప్రకారం కేంద్రానికి అధికారం ఉంది. దానికి అనుగుణంగా ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ముందుకెళ్లవచ్చు’ అని జస్టిస్‌ గోయల్, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ల ధర్మాసనం కేంద్రానికి సూచించింది.  

మరిన్ని వార్తలు