సమ్మె బాట!

16 Aug, 2014 00:39 IST|Sakshi

రామేశ్వరం జాలర్ల బాటలో పుదుకోట్టై జాలర్లు నడిచేందుకు నిర్ణయించారు. శుక్ర వారం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. పడవలను తిరిగి తమకు అప్పగించాలని కోట్టై పట్నం, జగదాపట్నం జాలర్లు డిమాండ్ చేశారు. శ్రీలంక చెర నుంచి విడుదలైన జాలర్లు శనివారం రాష్ట్రానికి చేరుకోనున్నారు.
 
సాక్షి, చెన్నై: కడలిలో తమిళ జాలర్లపై శ్రీలంక జులుం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సరిహద్దులు దాటుతున్నారన్న నెపంతో జాలర్లను పట్టుకెళ్లడం, వారాల తరబడి చెరలో బంధించడం పరిపాటిగా మారింది. జాలర్ల ఆం దోళనలు, రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి, కేంద్రం హెచ్చరికతో చివరకు వారిని చెర నుంచి శ్రీలంక సర్కారు విడుదల చేస్తోంది. అయితే, పడవలను మాత్రం తిరిగి అప్పగించడం లేదు. ఇది జాలర్ల కుటుంబాలను తీవ్ర అప్పుల్లోకి నెడుతోంది. ఇప్పటికే తమ పడవల్ని తిరిగి అప్పగించాలన్న నినాదంతో రామేశ్వరం జాలర్లు సమ్మె సైరన్ మోగించారు. కచ్చదీవుల్లో వేటకు అనుమతి, తమకు భద్రత లక్ష్యంగా నిరసనలు కొనసాగిస్తున్నారు.
 
కచ్చదీవుల్లో శరణు కోరడమే    
లక్ష్యంగా చేపట్టిన నిరసనను కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ హామీ మేరకు విరమించిన జాలర్లు కేంద్రంతో సంప్రదింపులకు రెడీ అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో రామేశ్వరం జాలర్లకు మద్దతుగా పుదుకోట్టై జాలర్లు సమ్మెకు సిద్ధం అయ్యారు.
 
పడవలు అప్పగించండి:
శ్రీలంక ఆధీనంలో రాష్ట్ర జాలర్లకు చెందిన పడవలు సుమారు వంద వరకు ఉన్నారుు. ఒక్కో పడవ విలువ లక్షల్లో  ఉంటుంది. పడవల్ని తిరిగి అప్పగించని దృష్ట్యా, జాలర్లు బతుకు లాగించడం కష్టతరంగా మారింది. తమ పడవలను తమకు అప్పగించాలన్న నినాదంతో శుక్రవారం నుంచి పుదుకోట్టై జాలర్లు సమ్మెకు దిగారు. పడవలను ఒడ్డుకు పరిమితం చేశారు. చిన్న పడవలు కూడా కడలిలోకి వెళ్లలేదు. దీంతో చేపల వేటకు బ్రేక్ పడింది. తమ పడవలను తిరిగి అప్పగించే వరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని జగదాపట్నం, కోట్టై పట్నం పరిసర గ్రామాల జాలర్లు స్పష్టం చేశారు. రామేశ్వరం, పుదుకోట్టై జాలర్లు సమ్మె బాట పట్టిన దృష్ట్యా, తదుపరి నాగపట్నం జిల్లా జాలర్లు వారి బాటలో నడిచే అవకాశం కన్పిస్తున్నాయి.
 
నేడు రాష్ట్రానికి : రామేశ్వరానికి చెందిన 20 మంది, కోట్టై పట్నం, జగదాపట్నానికి చెందిన 23 మంది, నంబుదాల్, అక్కరై పేట్టై పరిసరాలకు చెందిన 51 మంది జాలర్లను గత వారం శ్రీలంక నావికాదళం పట్టుకెళ్లిన విషయం తెలిసిందే. భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వీరిని విడుదల చేస్తూ శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే గురువారం ఆదేశాలు ఇచ్చారు.
 
దీంతో అనురాధపురం చెరలో ఉన్న రామేశ్వరం జాలర్లను, యాల్పానం చెరలో ఉన్న జగదా పట్నం, కోట్టై పట్నం జాలర్లను, కొడియకరై చెరలో ఉన్న ఇతర జాలర్ల విడుదలకు శ్రీలంక నావికాదళం చర్యలు తీసుకుంది. మొత్తం 94 మంది జాలర్లను అక్కడి కోర్టుల్లో హాజరు పరిచారు. వీరందర్నీ విడుదల చేస్తూ కోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో శుక్రవారం శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయ అధికారులకు జాలర్లను అప్పగించారు. వీరిని సరిహద్దుల్లో భారత కోస్టుగార్డుకు అప్పగించనున్నారు. శనివారం మధ్యాహ్నం లేదా సాయంత్ర ంలోపు వీరంతా వారి వారి ప్రాంతాలకు చేరుకోనున్నారు.

మరిన్ని వార్తలు