క్యాబ్‌లో వెళితే బతికుండేదేమో!

26 Dec, 2016 13:58 IST|Sakshi
క్యాబ్‌లో వెళితే బతికుండేదేమో!

పుణె: ఆమె ఎప్పుడూ కంపెనీ క్యాబ్‌లో వెళుతుండేది.. దురదృష్టం కొద్ది ఆరోజు క్యాబ్‌లో కాకుండా వేరే విధంగా వెళదామనుకుంది. పొంచి ఉన్న ప్రమాదం పసిగట్టలేకపోయింది. తాను పని చేస్తున్న కంపెనీ నుంచి బయటకు వచ్చిన కొద్ది సేపటికే భయంతో పరుగులు పెట్టడం ప్రారంభించింది. కానీ హత్యకు కుట్ర చేసిన వ్యక్తి నుంచి బయటపడలేకపోయింది. వేగంగా ఆమెను అందుకొని కత్తితో పొడిచాడు. అప్పటికీ వదిలించుకొని గాయంతోనే పరుగెత్తే ప్రయత్నం చేసినా మరోసారి అందుకొని వరుస కత్తిపోట్లు పొడిచాడు. దీంతో ఆమె కుప్పకూలిపోయింది. ఈ ఘటన పుణెలో మహిళా టెకీపై జరిగిన హత్య తీరు.

ఈ సంఘటను స్వయంగా బైక్‌పై వెళుతున్న వ్యక్తి చూశాడు. ఆమెకు సహాయం చేసేందుకు అతడు వేగంగా వెళ్లేలోగానే హంతకుడు కత్తిపోట్లు పొడిచి పరారయ్యాడు. దీంతో ఆమె వద్దకు వెళ్లిన ఆ బైకిస్టు నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె చనిపోయినట్లు పోలీసులు చెప్పారు. శుక్రవారం సాయంత్రం పుణెలోని క్యాప్‌జెమిని అనే కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ గా పనిచేస్తున్న కోల్‌కతాకు చెందిన అంతార దాస్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించి పలు వివరాలు తెలిశాయి. హంతకుడు బ్లూ, బ్లాక్‌ డ్రెస్సులో ఉన్నాడని బైకిస్టు చెప్పాడు. తాను పట్టుకునే లోగానే పారిపోయాడని చెప్పాడు.

మరోపక్క, అంతారా తండ్రి దేబానందదాస్‌ స్పందిస్తూ తన కూతురు హత్య విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపాడు. గత కొద్ది నెలలుగా తన కూతురుని వెంబడిస్తున్న వ్యక్తే ఈ హత్య చేశాడని, అతడి వివరాలు కూడా పోలీసులకు చెప్పినట్లు తెలిపారు. తన కూతురు బెంగళూరులో శిక్షణ తీసుకునే సమయంలో ఓ యువకుడు వెంటపడ్డాడని, అతడే పుణెకు వెళ్లి ఈ దారుణానికి దిగాడని అన్నారు. అయితే, ఎప్పుడూ క్యాబ్‌లో వెళ్లే ఆమె ఆరోజు ఎందుకు క్యాబ్‌లో వెళ్లలేదనే విషయం తెలిస్తే కొన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు.

మరిన్ని వార్తలు