ఐపీఎస్‌ అధికారి వెంటపడుతున్న యువతి!

20 Jun, 2018 14:29 IST|Sakshi

ఉజ్జయిని: సినిమా స్టార్లు, క్రికెటర్లకు ఎంతోమంది అభిమానులు ఉంటారు. తమకు ఇష్టమైన వారిని కలుసుకునేందుకు అభిమానులు ఎంత దూరమైనా వెళ్తుంటారు. అయితే పంజాబ్‌లోని హోషియార్పూర్ కు చెందిన ఓ యువతి మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ ఐపీఎస్‌ ఆఫీసర్‌ను చూసి ఫిదా అయింది. ఇక అంతే.. ఆ ఆఫీసర్‌ను కలుసుకోవాలని సదరు యువతి నానాతంటాలు పడుతోంది.

వివరాల్లోకి వెళితే.. ఐపీఎస్ సచిన్ అతుల్కర్(34).. మధ్య ప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఐపీఎస్‌ ఫొటోలను సోషల్ మీడియాలో చూసిన 27 ఏళ్ల యువతి ఆయనపై మనసు పారేసుకుంది. అంతే ఆయనను ఎలాగైనా కలవాలనుకుని మూడు రోజుల క్రితం ఉజ్జయిని వచ్చింది. అప్పటి నుంచి సచిన్‌ను చూడాలని ఎస్పీ కార్యాలయం ఎదుట పడిగాపులు కాస్తోంది. ఈ విషయం తెలుసుకున్న మహిళా పోలీసు స్టేషన్ ఇంచార్జి రేఖా వర్మ యువతిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చే పనిలో పడ్డారు. అయితే తనకు అతుల్కర్‌ అంటే అభిమానమని, ఆయనను కలవాల్సిందేనని యువతి స్పష్టం చేయడంతో పోలీసులకు ఏం చేయాలో పాలుపోలేదు.

చివరకు ఆమె తల్లిదండ్రులను ఉజ్జయినికి పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించినా.. యువతి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఇక చేసేదిమి లేక పంజాబ్‌కు పంపించేందుకు నగ్డా రైల్వేస్టేషన్‌కు పోలీసులు తీసుకెళ్లారు. తనను రైలు ఎక్కిస్తే దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో.. చేసేదేమి లేక పోలీసులు ఆమెను వెనక్కు తీసుకువచ్చారు. ఆమె పిజ్జాలు సహా తనకు నచ్చిన ఆహారాన్ని డిమాండ్ చేస్తోందని, తాము ఓపికగా వాటిని అందిస్తున్నామని రేఖా వర్మ వెల్లడించారు. యువతి సైకాలజీలో పిజీ చేస్తున్నట్టు తెలిపారు.

కాగా, ఈ విషయంపై సచిన్ అతుల్కర్‌ స్పందించారు. ఓ అధికారిగా తాను ఎవరితోనైనా కలిసేందుకు సిద్ధమని, వ్యక్తిగత విషయాల్లో మాత్రం తన ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా నడుచుకోబోనని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం బ్రహ్మచారిగా ఉన్న అతుల్కర్, ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధను చూపుతారు. రోజుకు 70 నిమిషాలు జిమ్ లో గడిపే ఆయన గతంలో పలు ఫిట్‌నెస్ అవార్డులనూ సొంతం చేసుకున్నారు.
 

>
మరిన్ని వార్తలు