ఖచ్చితంగా ఎవరో ఒకరు అబద్ధం చెప్తున్నారు

3 Jul, 2020 15:31 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. ప్రధాన మంత్రి లద్దాఖ్‌ పర్యటనపై స్పందించారు. ఈ క్రమంలో ఓ వీడియోను షేర్‌ చేస్తూ ‘లద్దాఖ్‌ ప్రజలు చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకుంది అంటున్నారు.. ప్రధాని నరేంద్ర మోదీ మన నేలను ఎవరు తీసుకోలేరు అంటున్నారు. ఖచ్చితంగా ఎవరో ఒకరు అబద్ధం చెప్తున్నారు’ అంటూ రాహుల్‌ ట్వీట్‌ చేశారు. ఈ వీడియోలో కొందరు లడాఖీలు ఈ ప్రాంతంలో చైనా దూకుడును వివరించగా.. మరి కొందరు వారు(చైనా) చట్టవిరుద్ధంగా మన భూమిని ఆక్రమించుకున్నారని చెప్పడం వీడియోలో చూడవచ్చు. అయితే కేంద్రం, ప్రధాన మంత్రి మాత్రం భారత భూభాగంలోకి చైనా ఎలాంటి ఆక్రమణలు చేయలేదని తెలిపారు.(లద్దాఖ్‌లో మోదీ ఆకస్మిక పర్యటన)

అయితే రాహుల్‌ గాంధీ కేంద్రంపై ఇలాంటి విమర్శలు చేయడం ఇదే ప్రథమం కాదు. గల్వాన్‌ వ్యాలీ ఘర్షణ జరిగిన నాటి నుంచి రాహుల్‌, కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. భారత్‌-చైనా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లద్దాఖ్‌లో ఆకస్మికంగా పర్యటించారు. శుక్రవారం ఉదయం సీడీఎస్‌ చీఫ్‌ బిపిన్‌ రావత్‌తో కలిసి లేహ్‌కు చేరుకున్నారు. పర్యటన సందర్భంగా సరిహద్దు ప్రతిష్టంభనపై సైనికాధికారులతో మోదీ సమీక్ష నిర్వహించారు.  వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి తాజా పరిస్థితుల గురించి సైనికులను అడిగి తెలుసుకున్నారు. 

మరిన్ని వార్తలు