‘పాక్‌ ప్రచ్ఛన్న యుద్ధం చేస్తోంది’

26 Jul, 2019 19:27 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత్‌తో యుద్ధం చేసే స్థాయి పాకిస్తాన్‌కు ఏమాత్రం లేదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. శుక్రవారం కార్గిల్‌ 20వ విజయ్‌ దివస్‌ను పురస్కరించుకుని యుద్ధ వీరులకు పార్లమెంటు నివాళులు అర్పించింది. ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా సభలోనే ఉన్నారు. స్పీకర్‌ ఓం బిర్లా సహా ఎంపీలంతా యుద్ధంలో అసువులు బాసిన సైనికులకు శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ...‘ భారత్‌తో పూర్తి స్థాయి యుద్ధం చేసేంత సీన్‌ దాయాది దేశానికి లేదు. ప్రచ్ఛన్న యుద్ధాన్ని ప్రోత్సహిస్తూ, వాళ్లు అక్కడికే పరిమితమవుతారు అని పేర్కొన్నారు. కాగా కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా కార్గిల్‌ యుద్ధం గురించి చర్చ జరగాల్సిందిగా కాంగ్రెస్‌ లోక్‌సభా పక్షనేత అధీర్‌ రంజన్‌ చౌదరి కోరారు. మరోవైపు రాజ్యసభ చైర్మన్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు భారత సైనికుల సేవలను కొనియాడారు. దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన వీరులను జాతి ఎన్నటికీ మరవదని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు