యూఏపీఏ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

2 Aug, 2019 14:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చట్ట వ్యతిరేక కార్యకలపాల (నిరోధక) సవరణ బిల్లు (యూఏపీఏ)కు శుక్రవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో అనుకూలంగా 147 మంది ఎంపీలు, వ్యతిరేకంగా 42 మంది ఎంపీలు ఓటు చేశారు. వ్యక్తులనూ ఉగ్రవాదులుగా ప్రకటించేందుకు వెసులుబాటు కల్పించే ఈ బిల్లు ప్రస్తుత పరిస్థితుల్లో కీలకమైనదని హోంమంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. ఉగ్ర సంస్థలపై నిషేధం విధిస్తున్న సందర్భాల్లో వ్యక్తులు మరో కొత్త సంస్థలను ఉనికిలోకి తెస్తున్నారని ఆయన అన్నారు. పెద్దలో సభలో బిల్లు ఆమోదానికి ముందు బిల్లుపై వాడివేడి చర్చ సాగింది.

ఉగ్రవాదానికి మతం లేదని, కాలానుగుణంగా చట్టాలను సవరించాల్సిన అవసరం ఉందని చర్చను ప్రారంభిస్తూ అమిత్‌ షా అన్నారు. గతంలో ఈ తరహా కేసులను రాజకీయ కక్ష సాధింపు కోసం ఉపయోగించారని, యూఏపీఏ బిల్లును ఓ మతాన్ని టార్గెట్‌ చేస్తుందనే దుష్ర్పచారం సాగిందని చెప్పారు. బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్‌ సభ్యులను ఉద్దేశిస్తూ ఎమర్జెన్సీ సమయంలో మీడియాను నిషేధించి, విపక్ష నేతలందరినీ జైలు పాలు చేసిన మీకు చట్టాలను దుర్వినియోగం చేస్తున్నామని మమ్మల్ని ఆరోపించే అర్హత లేదని మండిపడ్డారు.

యూఏపీఏ బిల్లు రెండు విభిన్న అంశాలతో కూడిఉందని చర్చలో పాల్గొన్న కాంగ్రెస్‌ సభ్యులు, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం చెప్పుకొచ్చారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు, ఉగ్రవాదం రెండు భిన్న అంశాలను ఒకే బిల్లులో ఎలా పొందుపరుస్తారని ప్రశ్నించారు. వ్యక్తులను శిక్షించే అధికారం ప్రస్తుత చట్టంలో ఉండగా సవరణ బిల్లు అవసరం ఏముందని ప్రశ్నించారు. ఉగ్రవాదులో కూడిన ఉగ్ర సంస్ధలను నిషేధిస్తే తిరిగి వ్యక్తులను ఉగ్రవాదులుగా ప్రకటించడం ఎందుకని నిలదీశారు. వివాదాస్పద అంశాలతో కూడిన బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపాలని చిదంబరం కోరారు.

మరిన్ని వార్తలు