నాటి మాటలు మరిచిన రాష్ట్రపతి కోవింద్‌

18 Jul, 2018 20:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రాజ్యాంగపరంగా తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించి నలుగురు సభ్యులను రాజ్యసభకు నామినేట్‌ చేసిన విషయం తెల్సిందే. వారు వరుసగా రామ్‌ షాకల్, రాకేష్‌ సిన్హా, రఘునాథ్‌ మహాపాత్ర, సోనాల్‌ మాన్‌సింగ్‌లు. వారిలో రామ్‌ షాకల్‌ను ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రజా ప్రతినిథి అని, ప్రముఖుడని పేర్కొన్నారు. ఆయన యూపీలోని రోబర్ట్స్‌ గంజ్‌ నుంచి మూడుసార్లు పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం కూడా వహించారు.

రాజ్యాంగంలోని 80వ అధికరంణంలోని మూడవ క్లాజ్‌ ప్రకారం సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, కళలు, సామాజిక సేవా రంగాలకు చెందిన ప్రముఖులను మాత్రమే రాష్ట్రపతి నేరుగా రాజ్యసభకు నామినేట్‌ చేయవచ్చు. ఈ రంగాలకు చెందిన ప్రముఖులు రాజకీయాల్లోకి రావడానికి గానీ, ఎన్నికల్లో పోటీ చేయడానికిగానీ ఇష్టపడరని, అలాంటి రంగాలకు చెందిన ప్రముఖుల సేవలను కూడా పార్లమెంట్‌ ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో నాడు రాజ్యాంగంలో ఈ నిబంధన తీసుకొచ్చారు. అయితే మన రాష్ట్రపతి కోవింద్‌ యూపీకి చెందిన రాజకీయ నాయకుడినే రాజ్యసభకు నామినేట్‌ చేశారు. రాష్ట్రపతి ఇలా రాజ్యాంగం అధికరణంకు విరుద్ధంగా రాజ్యసభకు నామినేట్‌ చేయడం ఇదే మొదటి సారి కాదు.

2016, ఏప్రిల్‌ నెలలో బీజేపీ నాయకులు సుబ్రమణియన్‌ స్వామి, నవజోత్‌ సింగ్‌ సిద్ధూ (ప్రస్తుతం కాంగ్రెస్‌) ఇలాగే నియమితులయ్యారు. గతంలో జగ్‌మోహన్‌ సింగ్, భూపిందర్‌ సింగ్‌ మాన్, ప్రకాష్‌ అంబేడ్కర్, గులాం రసూల్‌ ఖాన్‌లు ఇలాగే దొంగదారిన రాజ్యసభలో ప్రవేశించారు. ఇక్కడ విచిత్రమేమిటంటే 2009లో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం హయాంలో రాజ్యసభకు కాంగ్రెస్‌ నాయకుడు మణిశంకర్‌ అయ్యర్‌ నామినేషన్‌ను అప్పుడు బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న రామ్‌నాథ్‌ కోవింద్‌ స్వయంగా వ్యతిరేకించారు. మణిశంకర్‌ అయ్యర్‌ సాహిత్యం రంగం పరిధిలోకి వచ్చినప్పటికీ ‘ఓ కాంగ్రెస్‌ నాయకుడిని ఇలా నామినేట్‌ చేయడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం. అన్ని రాజకీయ సంప్రదాయాలను కాలరాయడమే. ఇది కాంగ్రెస్‌ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తన అధికారాలను పూర్తిగా దుర్వినియోగం చేయడమే’ అని కోవింద్‌ ఘాటుగా విమర్శించారు. మరి ఇప్పుడు తాను చేసిందేమిటీ? ఒకరు చేస్తే తప్పు, తాను చేస్తే తప్పుకాదా? ద్వంద్వ రాజకీయాలంటే ఇదే కదా!

మరిన్ని వార్తలు