మర్యాదగా పీవోకేని అప్పగించండి: కేంద్రమంత్రి

14 Sep, 2019 08:42 IST|Sakshi

న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు, రాష్ట్ర విభజన తర్వాత లోయలో పూర్తి శాంతియుత వాతావరణం నెలకొందని కేంద్ర సామాజిక న్యాయ సాధికారికత సహాయ మంత్రి రాందాస్‌ అథవాలే అన్నారు. కశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వ పథకాలు, చట్టాలు అమలు చేయడం ద్వారా పెట్టబడులు పెరిగి అభివృద్ధి పరుగులు తీస్తుందని పేర్కొన్నారు. అదే విధంగా ఇతర రాష్ట్రాల వలె కశ్మీర్‌లో పూర్తి సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత కేంద్ర పాలిత ప్రాంత హోదా తొలగిపోయి.. తిరిగి రాష్ట్ర హోదా దక్కించుకుంటుందని వ్యాఖ్యానించారు. అంతేగాకుండా కశ్మీర్‌ కేంద్రపాలిత హోదా తాత్కాలికమేనని స్పష్టం చేశారు.

శుక్రవారం రాందాస్‌ విలేకరులతో మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ దమ్మున్న ప్రధాని అని.. ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ మోదీ సర్కారు చారిత్రక నిర్ణయం తీసుకుందని ప్రశంసలు కురిపించారు. కశ్మీర్‌ విషయంలో భారత్‌ తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్‌కు మింగుడుపడటం లేదని.. అందుకే అంతర్జాతీయ వేదికలపై అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. కశ్మీర్‌ జోలికి వస్తే ఊరుకునేది లేదని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను హెచ్చరించిన అథవాలే...‘ మా సైన్యం ఎంతో దుర్భేద్యమైనది. కార్గిల్‌ యుద్ధంలో భారత ఆర్మీ చేతిలో చిత్తయిన సంగతి గుర్తుండే ఉంటుంది. నిజంగా మీరు యుద్ధం కోరుకోన్నట్లయితే.. మర్యాదగా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌కు అప్పగించండి. పీవోకేలో పౌరులు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారు. కాబట్టి పీవోకేను భారత్‌కు అప్పగిస్తే..అక్కడ పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి కల్పిస్తాం. అంతేకాదు పాకిస్తాన్‌కు కూడా వాణిజ్య వ్యాపారాల్లో సహకరించి...పేదరికాన్ని, నిరుద్యోగితను నిర్మూలించేందుకు కావాల్సిన సహాయం అందిస్తాం’  అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు