మూత పెడితేనే మటాష్‌!

18 Jun, 2020 07:10 IST|Sakshi

కరోనా.. తుమ్మితే వస్తుంది.. దగ్గితే వస్తుంది. రోగి ముట్టుకున్నవి ముట్టుకుంటే వస్తుంది.. ఇవన్నీ మనకు తెలిసినవే.. అందుకే మాస్కులు, శానిటైజర్లు వాడుతున్నాం.. అయితే.. షేర్డ్, పబ్లిక్‌ టాయిలెట్ల వినియోగంలో సరైన జాగ్రత్తలు పాటించకున్నా వస్తుందా? వస్తుందనే అంటున్నారు చైనాలోని యాంగ్‌జౌ వర్సిటీ పరిశోధకులు.. అలా రాకుండా ఉండాలంటే.. టాయిలెట్‌(వెస్ట్రన్‌) మూత పెట్టాకే.. ఫ్లష్‌ చేయాలని సూచిస్తున్నారు.

ఇంతకీ విషయమేమిటంటే.. ఓసారి కోవిడ్‌ వచ్చి.. చికిత్స అనంతరం నెగెటివ్‌ వచ్చినవారి మలంలో 4, 5 వారాల వరకూ వైరస్‌ తాలూకు అవశేషాలు ఉంటాయట. దీనికి సంబంధించి గత నెల్లో ‘లాన్సెట్‌’ జర్నల్‌లో ఓ పరిశోధన కూడా ప్రచురితమైంది.. ఈ నేపథ్యంలో ముఖ్యంగా షేర్డ్, పబ్లిక్‌ టాయిలెట్లను ఉపయోగించేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. మూత పెట్టకుండా ఫ్లష్‌ చేయడం వల్ల.. ఒకేసారి వేగంగా నీళ్లు వచ్చి.. సుడిగుండంలా ఏర్పడుతుంది.. ఆ సమయంలో వైరస్‌ మేఘంలాంటిది నీటిపైన 3 అడుగుల దూరం వరకూ ఏర్పడుతుందని సదరు వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.

‘ఇది గాల్లో ఒక నిమిషం పాటు ఉంటుంది. తర్వాత చుట్టుపక్కల పరుచుకుంటుంది. తద్వారా వైరస్‌ వేరొకరికి వ్యాప్తి చెందే అవకాశముంటుంది. దీన్ని నివారించాలంటే మూత పెట్టాకే ఫ్లష్‌ చేయాలి.. దీని వల్ల వైరస్‌ బయటకు రాదు. ఆరోగ్యవంతులైనవారు టాయిలెట్‌ ఉపయోగిస్తే.. సమస్యే లేదు.. కోవిడ్‌ రోగులు లేదా కరోనా వచ్చి తగ్గినవాళ్లు ఉపయోగించినప్పుడు మాత్రమే ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది’ అని వర్సిటీ పరిశోధకులు తెలిపారు. పైగా.. సామాన్య జనానికి ఈ మార్గంలోనూ వైరస్‌ వస్తుందన్న విషయం పెద్దగా తెలీదని.. వారికి అవగాహన పెంచాల్సిన అవసరముందని చెప్పారు. ఇకపై కరోనా రోగిలో వైరస్‌ పూర్తిగా పోయిందా లేదా అన్నది తెలుసుకునేందుకు మల పరీక్షలు కూడా చేస్తే మంచిదని వారు సూచిస్తున్నారు.  సో.. ఇకపై షేర్డ్, పబ్లిక్‌ టాయిలెట్లను ఉపయోగించేటట్లయితే.. జాగ్రత్తలు పాటించడం మరువద్దు సుమా.. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు