మృతదేహాన్ని ప్లాస్టిక్ బ్యాగ్‌లో చుట్టి..

28 Sep, 2016 12:08 IST|Sakshi
మృతదేహాన్ని ప్లాస్టిక్ బ్యాగ్‌లో చుట్టి..

మృతదేహాన్ని తరలించడానికి కనీసం ఒక అంబులెన్సు ఇప్పించమని కోరినా ఆస్పత్రి పట్టించుకోలేదు. దాంతో తప్పనిసరి పరిస్థితులలో మృతుడి బంధువులు అతడి మృతదేహాన్ని ఒక ప్లాస్టిక్ బ్యాగ్‌లో చుట్టి, చేతులతోనే మోసుకుని తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ దారుణ ఘటన బిహార్‌లో మళ్లీ కలకలం రేపింది. సింటు కుమార్ అనే వ్యక్తి దాదాపు రెండు వారాల క్రితం గంగానదిలో పడి చనిపోయాడు. ఈనెల 25న అతడి మృతదేహాన్ని బయటకు తీశారు గానీ, అప్పటికే అది బాగా కుళ్లిపోయింది. దాన్ని అతడి బంధువులు పోస్టుమార్టం కోసం కతియార్‌లోని ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. కానీ ప్రభుత్వ వైద్యులు అక్కడి నుంచి 86 కిలోమీటర్ల దూరంలో ఉన్న భాగల్పూర్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. అంతదూరం వెళ్లేందుకు తమవద్ద డబ్బు లేదని, ఒక అంబులెన్సు ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదు. దాంతో ఏమీ చేయలేని పరిస్థితులలో కుమార్ బంధువులు అతడి మృతదేహాన్ని ఒక ప్లాస్టిక్ బ్యాగ్‌లో చుట్టి, చేతులతో మోసుకుంటూ తీసుకెల్లారు.

మృతదేహం అప్పటికే బాగా కుళ్లిపోవడం వల్లే పోస్టుమార్టం కోసం భాగల్పూర్‌కు రిఫర్ చేశామని కతియార్ ఆస్పత్రి సివిల్ సర్జన్ ఎస్‌సీ ఝా తెలిపారు. తమ వద్ద శవాలను తీసుకెళ్లే వాహనం లేదన్నారు. పైగా మృతదేహాన్ని భాగల్పూర్ పంపాల్సిన బాధ్యత పోలీసులది తప్ప తమది కాదని ఆయన అన్నారు.

బిహార్‌లోని వైశాలి జిల్లాలో ఇలాగే కుళ్లిపోయిన ఓ మృతదేహాన్ని బయటకు తీయడానికి పోలీసులు తాళ్లు కట్టి బయటకు లాగడంతో అది పెద్ద వివాదం అయింది. దానికి సంబంధించిన వీడియోను స్థానిక యువకులు సెల్‌ఫోన్‌లో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ దృశ్యాలు విపరీతంగా ప్రచారం అయ్యాయి. ఇప్పుడు మళ్లీ అలాంటి ఘటనే చోటుచేసుకుంది.

మరిన్ని వార్తలు