ఎట్టకేలకు ఆ న్యాయమూర్తి అరెస్ట్‌

20 Jun, 2017 19:55 IST|Sakshi
కోయంబత్తూరులో జస్టిస్‌ కర్ణన్‌ అరెస్ట్‌

కోయంబత్తూరు : గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న జస్టిస్‌ సీఎస్‌ కర్ణన్‌ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. మంగళవారం ఆయనను తమిళనాడులోని కోయంబత్తూరులో అరెస్ట్‌ చేసినట్లు కర్ణన్‌ తరఫు లాయర్లు వెల్లడించారు. కర్ణన్‌ను పోలీసులు కోల్‌కతా తరలిస్తున్నారు. కాగా అరెస్టును ఎదుర్కొంటూ అజ్ఞాతంలో ఉండి పదవీ విమరణ చేసిన తొలి న్యాయమూర్తిగా దేశ న్యాయచరిత్రలో కర్ణన్‌ నిలిచిపోయారు.

పదవిలో ఉండగా అరెస్టును ఎదుర్కొన్న న్యాయమూర్తిగా ఇప్పటికే పేరుపొందిన ఆయన.. కోర్టు ధిక్కారం నేరంపై సుప్రీంకోర్టు విధించిన జైలు శిక్ష నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. మే9న సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఖేహర్‌ నేతృత్వంలోని ధర్మాసనం కర్ణన్‌ను అరెస్టు చేయాలని ఆదేశించినప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు.

జైలు శిక్షపై స్టే కోసం సుప్రీం సెలవుకాల ధర్మాసనానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఊరట లభించలేదు.  కోర్టు ధిక్కారనేరంపై తనను శిక్షించడం కుదరదని, తీర్పును రద్దు చేయాలని, తదుపరి విచారణపై స్టే విధించాలని మే 12న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం తీర్పుపై జోక్యం చేసుకోవాలని కర్ణన్‌ తరఫు న్యాయవాదులు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. కాగా జస్టిస్‌ కర్ణన్‌ అరెస్టుకు సహకరించాలని కోరుతూ తమిళనాడు డీజీపీ రాజేంద్రన్‌కు పశ్చిమ బెంగాల్‌ డీజీపీ గత సోమవారం లేఖ రాసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు