మన బ్రహ్మపుత్రను చైనా చంపేస్తోందా?

20 Dec, 2017 10:01 IST|Sakshi

సాక్షి, గువాహటి : అసోం ఆశాదీపం ఆరిపోయే ప్రమాదం ఏర్పడిందా? పేరు వినగానే ఒళ్లంతా పులకరించేట్లు ఉండే బ్రహ్మపుత్ర నది బతుకు ఆరిపోయే పరిస్థితి తలెత్తిందా? అంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం అవుననే తెలుస్తోంది. అది కూడా చైనా కారణంగానే బ్రహ్మపుత్ర నదికి ప్రమాదం తలెత్తింది. ప్రస్తుతం ఆ నది మొత్తం కూడా నల్లగా మారుతుండటంతోపాటు, బురదమయం అవుతోంది. దీనికి కారణం చైనాలోని సియాంగ్‌ నది. టిబెటన్‌ పీఠభూమిలో పుట్టి మంచుకొండల్లో నుంచి వచ్చి చైనాకు సరిహద్దు రాష్ట్రంగా ఉన్న అసోంలోని బ్రహ్మపుత్ర నదిలో అది కలవడమే ఇంత దారుణ పరిస్థితికి కారణమవుతోంది. గత పది రోజుల కిందట జరిపిన పరీక్షల్లో బ్రహ్మపుత్ర నది ఇక మానవ వినియోగానికి పనికిరానిదిగా మారుతోందనే ప్రమాద ఘంటికలు వినిపించాయి.

విపరీతమై కాలుష్యం బ్రహ్మపుత్ర నదిలో వచ్చి పడుతోంది. చైనాలోని సియాంగ్‌ నదిలో పారుతున్న కాలుష్యమంతా వచ్చి బ్రహ్మపుత్రలో పడుతోంది. దీంతో సుజలాలు కాస్త వ్యర్ధజలాలుగా మారిపోతున్న పరిస్థితి తలెత్తింది. ఇటీవల సియాంగ్‌ నదిలోని నీటిని తీసుకొచ్చి దానిని పరీక్షించగా అందులో 1249 నెపిలోమెట్రిక్‌ టర్బిడిటీ యూనిట్‌(ఎన్టీయూ) ఉన్నట్లు తెలిసింది. సాధారణంగా నది జలాల్లో ఎన్టీయూ 5 వరకు ఉంటేనే సురక్షితం. దీని ప్రకారం సియాంగ్‌ నదిలో ఎన్‌టీయూ 250 రెట్లు అధికంగా ఉందన్నమాట.

ఈ నీటిని పరిశీలించిన గువాహటిలోని ప్రతిష్టాత్మక ఐఐటీ ఫలితాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నీటి వాడకం అత్యంత ప్రమాదకరం అని హెచ్చరించారు. 'బ్రహ్మపుత్ర నదిలోని నీటిలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. గడిచిన నెల రోజుల్లో అవి విషపూరితంగా బురదమయంగా మారాయి. ఎన్నో జల ప్రాణులు ఇటీవల చనిపోయాయని గుర్తించాం. ఇది ఇలాగే కొనసాగితే బ్రహ్మపుత్ర లోయలోని పౌర సమాజం మొత్తం కూడా ప్రమాదంలోకి వెళ్లినట్లే' అని వారు చెప్పారు. ఇప్పటికే ఈ విషయాన్ని అసోం ఎంపీలు పార్లమెంటులో చెప్పడంతోపాటు చైనా బ్రహ్మపుత్ర నదిని చంపేస్తోందంటూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా