రాజీనామా చేయను

18 Jun, 2014 22:42 IST|Sakshi
రాజీనామా చేయను

స్పష్టంచేసిన గవర్నర్
 
సాక్షి, ముంబై: తన పదవికి రాజీనామా చేసేందుకు మహారాష్ట్ర గవర్నర్ కె. శంకర్‌నారాయణన్ నిరాకరించారు. పదవికి రాజీనామ చేయాలంటూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి నుంచి ఫోన్ వచ్చిందని, రాష్ట్రపతి కోరేదాకా తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆయన బుధవారం స్పష్టం చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యూపీఏ హయాంలో నియమితులైన ఏడుగురు గవర్నర్‌లను రాజీనామ చేయించాలని కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హోంశాఖ కార్యదర్శి ద్వారా నేరుగా గవర్నర్లకు రాజీనామ చేయాలంటూ పంపుతున్నారు. వీటిపై స్పందించిన ఉత్తరప్రదేశ్ గవర్నర్ బి.ఎల్.జోషి వెంటనే రాజీనామ చేసిన విషయం తెలిసిందే.
 
మిగిలినవారిలో కొందరు రాజీనామ బాటలో ఉండగా మరికొందరు గవర్నర్లు తమ పదవులకు రాజీనామ చేయడానికి సిద్ధంగా లేమని ప్రకటించారు. దీంతో మోడీ ప్రభుత్వం, గవర్నర్ల మధ్య వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలాఉండగా తాను రాజీనామ చేయాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి నుంచి ఫోన్ వచ్చిన విషయాన్ని శంకర్‌నారాయణన్ ధ్రువీకరించారు. గవర్నర్ పదవి రాజ్యాంగబద్ధమైనదని, ఆ అధికారమున్న వ్యక్తి(రాష్ట్రపతి) చెబితే తప్ప తాను రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు.
 
తన పదవి కాలం 2017 మే ఏడో తేదీ వరకు ఉందని, అంతవరకు కొనసాగుతానన్నారు. పంజాబ్ గవర్నర్ శివ్‌రాజ్ పాటిల్, కేరళ గవర్నర్ షీలాదీక్షిత్ కూడా శంకర్‌నారాయణన్ బాటలోనేనడుస్తున్నారు. వారు కూడా రాజీనామా చేసేందుకు సిద్ధంగా లేరు. అయితే రాజీనామ చేయాలని డిమాండ్ చేస్తూ తమకు ఇంతవరకు ఫోన్ ఎవరి నుంచి రాలేదని వారు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు