‘సిట్‌’ పిటిషన్‌కు సుప్రీం ఓకే

26 Oct, 2018 03:18 IST|Sakshi
ప్రశాంత్‌ భూషణ్‌

దాఖలుచేసిన ప్రశాంత్‌ భూషణ్‌

సాక్షి, న్యూఢిల్లీ: సీబీఐ ఉన్నతాధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణల్ని విచారించేందుకు కోర్టు పర్యవేక్షణలో సిట్‌ ఏర్పాటు కోరుతూ దాఖలైన పిల్‌ను అత్యవసరంగా విచారణ చేపట్టే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. కామన్‌కాజ్‌ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున ప్రముఖ లాయర్‌ ప్రశాంత్‌ భూషణ్‌ ఈ పిల్‌ వేశారు. సీబీఐని ప్రభావితం చేస్తున్న విస్తృత అవినీతికి సంబంధించిన అంశాలు ఇందులో ఉన్నాయని, వెంటనే విచారణకు చేపట్టాలన్న ఆయన విజ్ఞప్తికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ ఎస్కే కౌల్, జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ల బెంచ్‌ అంగీకరించింది. పూర్తి వివరాలు సమర్పించాలని, పిటిషన్‌ను అత్యవసరంగా విచారించే అంశాన్ని పరిశీలిస్తామని భూషణ్‌కు తెలిపింది.

అలోక్‌ వర్మను సెలవుపై పంపుతూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను రద్దుచేయాలని భూషణ్‌ కోర్టును కోరారు. కేబినెట్‌ సెక్రటరీ, సీవీసీ, రాకేశ్‌ అస్థానా, అలోక్‌ వర్మ, నాగేశ్వరరావులను ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చారు. ‘ప్రతివాదులు దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ స్వతంత్రతను దెబ్బతీయాలని చూశారు. సీబీఐ డైరెక్టర్‌ పదవీకాలం రెండేళ్లు ఉన్నప్పటికీ ఆ నిబంధనను పక్కనబెడుతూ ఆయన్ని సెలవులోకి పంపి తాత్కాలిక డైరెక్టర్‌ను నియమిస్తూ చట్టబద్ధమైన నియామక ప్రక్రియను ఉల్లంఘించారు. ఒకవేళ సీబీఐ డైరెక్టర్‌పై ఫిర్యాదులు వస్తే సీవీసీ నేరుగా తొలగించకూడదు. ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐలతో కూడిన హైపవర్డ్‌ కమిటీ నిర్ణయం తీసుకోవాలి’ అని అన్నారు.

దురుద్దేశపూర్వకం..
సీబీఐ డైరెక్టర్, స్పెషల్‌ డైరెక్టర్లను విధుల నుంచి తప్పిస్తూ సీవీసీ, ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు దురుద్దేశపూర్వకమని ప్రశాంత్‌ భూషణ్‌ ఆరోపించారు. ‘రాకేష్‌ అస్థానాపై చర్యలు తీసుకున్నందుకే సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మను బాధితుడిగా చేసినట్లు తెలుస్తోంది. రాకేష్‌ అస్థానాను స్పెషల్‌ డైరెక్టర్‌గా నియమించినప్పుడే అలోక్‌ వర్మ అభ్యంతరాలు వ్యక్తంచేశారు. అస్థానాపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని అలోక్‌ 2017 అక్టోబరు 21న కేబినెట్‌ కన్సల్టేషన్‌ కమిటీకి లేఖ రాశారు. సంబంధిత ఆరోపణలు ఉన్న కేసులను సీబీఐ దర్యాప్తు చేస్తోందని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు.

సీనియర్‌ ఐటీ అధికారులు ముగ్గురు గుజరాత్‌కు చెందిన స్టెర్లింగ్‌ బయోటెక్, సందేసర గ్రూప్‌ కంపెనీల నుంచి లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలపై సీబీఐ ఢిల్లీ యూనిట్‌ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఆ కేసులో అస్థానా పాత్ర కూడా ఉంది. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. సతీష్‌ బాబు సానా అస్థానాకు లంచం ఇచ్చారన్న మరో కేసు కూడా దర్యాప్తులో ఉంది. దీనిపై అవినీతి నిరోధక చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఈ కేసు నమోదవగానే అస్థానా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. అదే రోజు రాత్రి కేంద్రం, సీవీసీలు..డైరెక్టర్, స్పెషల్‌ డైరెక్టర్లను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చాయి’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు