బాలికను బలిగొన్న శౌచాలయం

20 Dec, 2018 10:50 IST|Sakshi
ముక్కలైన మరుగుదొడి (ఇన్‌సెట్‌),జ్యోత్స్న (ఫైల్‌)

కుప్పకూలి.. విద్యార్థిని మృతి  

కోలారు జిల్లా ముళబాగిలు  మొరార్జీ పాఠశాలలో ఘోరం  

ఏడాది కిందటే నాసిరకంగా నిర్మాణం  

కర్ణాటక, ముళబాగిలు: అధికారుల నిర్లక్ష్యం, నాసిరకం నిర్మాణానికి ఒక నిండు ప్రాణం బలైంది. ఉజ్వల భవిత శిథిలాల కింద నలిగిపోయింది. తరగతి పాఠశాల శౌచాలయానికి వెళ్లిన సమయంలో అది కుప్పకూలి జ్యోత్స్న (13) అనే 7వ తరగతి విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది.  ఈ దుర్ఘటన కోలారు జిల్లా ముళబాగిలు పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ మొరార్జీ దేశాయి వసతి పాఠశాలలో జరిగింది. జ్యోత్స్న తాలూకాలోని ఎన్‌ బిసనహళ్లి గ్రామానికి చెందిన రైతు శంకరప్ప, విజయమ్మ దంపతుల కుమార్తె.  బుధవారం ఉదయం పాఠశాలలో ప్రార్థనచేసిన అనంతరం జ్యోత్స్న శౌచాలయానికి వెళ్లింది. ఈ సమయంలో కట్టడం ఉన్నపలంగా కుప్పకూలడంతో శిథిలాల కింద చిక్కి చిన్నారి ఊపిరి వదిలింది. ఘటనతో ఒక్కసారిగా కలకలం నెలకొంది. ఉపాధ్యాయులు, స్థానికులు బాలిక మృతదేహాన్ని కోలారు ఆర్‌ ఎల్‌ జాలప్ప ఆస్పత్రికి తరలించారు. గత సంవత్సరమే దేవరాయ సముద్రలో ఉన్న వసతి పాఠశాలను ఇక్కడి ప్రైవేటు కట్టడంలోకి మార్చడం జరిగింది. ఈ సమయంలో శౌచాలయాలను పక్కన ఉన్న రాజకాలువ వద్ద నాసిరకంగా నిర్మించడంతోనే కుప్పకూలిందని ఆరోపణలున్నాయి. 

కలెక్టర్‌ పరిశీలన  
విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్‌ జె మంజునాథ్, జడ్పీ సీఈఓ సి జగదీష్‌లు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన జరిపారు. పాఠశాలను దేవరాయ సముద్రం నుంచి ఈ కట్టడంలోకి మార్చడానికి కారణమైన ప్రిన్సిపాల్‌ తదితరులపైన,  కట్టడం యజమానిపైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కీలుహొళలి గ్రామం వద్ద నూతన భవన నిర్మాణం 90 శాతం పూర్తయింది, అంతా అయ్యాక అక్కడికి మారుస్తామని కలెక్టర్‌ తెలిపారు. 

ఘటనను ఖండించి ప్రతిఘటన
కట్టడం కూలి విద్యార్థిని మరణించడంతో ఇది జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం వల్లనే జరిగిందని ఆరోపించి ఎస్‌ఎఫ్‌ఐ, రైతు సంఘం తదితర సంఘాల కార్యకర్తలు తహశీల్దార్‌ కార్యాలయం ముందు ప్రతిఘటన నిర్వహించారు. ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు