నాగ్‌పూర్‌ ఎన్‌ఐటీలో విద్యార్థుల ఆందోళన

3 Oct, 2018 22:53 IST|Sakshi

సాక్షి, నాగ్‌పూర్‌: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ ఎన్‌ఐటీలో విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. కళాశాల నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బుధవారం రాత్రి అడ్మినిస్ట్రేటివ్‌ భవనం ముందు బైఠాయించారు. క్యాంపస్‌ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థినులకు రెండురోజుల క్రితం ఫుడ్‌పాయిజన్‌ కావడంతో దాదాపు వంద మందిపైగా ఆస్పత్రిపాలయ్యారు. వీరంతా ఆస్పత్రిలో కోలుకుంటున్నారు.

అయితే ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించకపోవడం, కళాశాల సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బయట తినొచ్చిన వారే ఫుడ్‌పాయిజన్‌ బారిన పడ్డారని కళాశాల సిబ్బంది ఆరోపించడంతో విద్యార్థులు నిరసనకు దిగారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేపట్టారు. మిగతా ఎన్‌ఐటీలతో పోల్చుకుంటే ఫీజులు కూడా ఎక్కువగానే ఉన్నాయని, హాస్టల్‌ వసతులు సరిగా లేవని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఎన్‌ఐటీ యాజమాన్యం దిగొచ్చింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని నిర్వాహకులు హామినిచ్చారు. తమ సమస్యల పరిష్కారానికై యాజమాన్యం సానుకూలంగా స్పందించడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.

మరోవైపు తమ పిల్లలకు ఏమైందోనని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అత్యధిక సంఖ్యలో నాగ్‌పూర్‌ ఎన్‌ఐటీలో విద్యనభ్యసిస్తున్నారు.

మరిన్ని వార్తలు