‘మహా వివక్షపై సుప్రియా ఫైర్‌’

3 Jan, 2020 14:02 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మహారాష్ట్ర శకటాలను తొలగించడంపై పాలక శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ కూటమి నేతలు మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్‌ తర్వాత తిరస్కరణకు గురైన మరో విపక్ష రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. తమ ప్రభుత్వంపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని కూటమి నేతలు ఆరోపించారు. మహారాష్ట్ర పట్ల కేంద్రం పక్షపాత వైఖరిని ప్రదర్శించిందని దీనిపై మోదీ సర్కార్‌ వివరణ ఇవ్వాలని ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ కుమార్తె, ఆ పార్టీ నేత సుప్రియా సూలే డిమాండ్‌ చేశారు.

దేశమంతటా జరిగే ఈ వేడుకలో అన్ని రాష్ట్రాలకూ కేంద్రం ప్రాతినిథ్యం ఇవ్వాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పక్షపాతం చూపుతూ విపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల పట్ల సవతి తల్లి ప్రేమ చూపుతోందని ఆమె దుయ్యబట్టారు. గణతంత్ర  వేడుకల నుంచి మహా శకటాన్ని తిరస్కరిస్తూ కేంద్రం వివక్ష చూపడాన్ని తప్పుపట్టారు. రెండు రాష్ట్రాల ప్రతిపాదనలను మీరు (కేంద్రం) ఎందుకు తిరస్కరించారో వివరణ ఇవ్వాలని, దీనిపై మహారాష్ట్ర సీఎం దర్యాప్తు జరిపించాలని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ కోరారు.

>
మరిన్ని వార్తలు