మైసూరు మహారాజుగా యదువీర్‌కు పట్టాభిషేకం

29 May, 2015 02:26 IST|Sakshi
మైసూరు మహారాజుగా యదువీర్‌కు పట్టాభిషేకం

మైసూరు(కర్ణాటక): ఘనమైన చరిత్ర కలిగిన మైసూరు రాజకుటుంబం వారసునిగా యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ పట్టాభిషేకం వైభవోపేతంగా జరిగింది. రాజ సంప్రదాయాన్ని అనుసరించి ఈ పట్టాభిషేకం కార్యక్రమాన్ని గురువారం ఉదయం ఇక్కడి అంబా ప్యాలెస్‌లోని కల్యాణ మండపంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఘనంగా నిర్వహించారు. 23 ఏళ్ల యదువీర్, రజతసింహాసనం ‘భద్రాసనా’న్ని అధిరోహించారు. వడయార్ రాజకుటుంబంలో 27వ రాజు అయిన యదువీర్ దసరా ఉత్సవాల సందర్భంగా ‘ఖాసా(ప్రైవేటు) దర్బారు’ను నిర్వహిస్తారు.

అప్పుడాయన స్వర్ణ సింహాసనాన్ని అధిరోహిస్తారు. మహారాజు శ్రీకంఠదత్త నరసింహరాజ వడయార్ 2013లో మరణించడం తెలిసిందే. దీంతో ఆయన సతీమణి ప్రమోదాదేవి వడయార్.. యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్‌ను దత్తత తీసుకున్నారు. యదువీర్ అమెరికాలో డిగ్రీ విద్య(బీఏ)ను పూర్తి చేశారు. పట్టాభిషేకం అనంతరం యదువీర్ మాట్లాడుతూ.. రాజకుటుంబ సంప్రదాయాలను తు.చ. తప్పక కొనసాగిస్తానని పేర్కొన్నారు. ఈ పట్టాభిషేక మహోత్సవానికి హాజరైన ప్రముఖుల్లో మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ, కర్ణాటక రాష్ట్ర మంత్రులు కె.జె.జార్జి, ఆర్.వి.దేశ్‌పాండే, డి.కె.శివకుమార్, శ్రీనివాస ప్రసాద్, రోహన్ బేగ్, లోకాయుక్త వై.భాస్కరరావు ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి యదువీర్ కాబోయే సతీమణి త్రిషికా కుమారి(రాజస్థాన్‌కు చెందిన ఓ రాజకుటుంబానికి చెందినవారు) హాజరయ్యారు. వీరి వివాహం ఈ ఏడాది చివరిలోగా జరిగే అవకాశముంది.
 
ఇదీ చరిత్ర..

 
వడయార్ రాజకుటుంబం మైసూరు రాజ్యాన్ని 1399 నుంచి 1947 వరకు పాలించింది. చివరి రాజు జయచామరాజేంద్ర వడయార్ 1940 నుంచి 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చేవరకు పాలించారు. అనంతరం మైసూరు రాజ్యాన్ని భారత్‌లో కలిపేందుకు అంగీకరించారు. అయితే 1950లో భారత్ రిపబ్లిక్‌గా మారేవరకు ఆయన మహారాజుగా కొనసాగారు. ఆ తరువాత మాజీ రాజకుటుంబం వారసునిగా శ్రీకంఠదత్త నరసింహరాజ వడయార్ కొనసాగారు. దాదాపు 41 ఏళ్ల క్రితం ఆయన పట్టాభిషేకం జరిగింది. 2013లో ఆయన మరణం నేపథ్యంలో వారసునిగా యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ ఎంపికయ్యారు.
 

మరిన్ని వార్తలు