కర్ణాటక అభ్యంతరాలను తోసిపుచ్చిన ట్రిబ్యునల్

7 Apr, 2016 04:18 IST|Sakshi
కర్ణాటక అభ్యంతరాలను తోసిపుచ్చిన ట్రిబ్యునల్

♦ సభ్యుడిగా జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి కొనసాగింపు
♦ కృష్ణా నదీ జలాల వివాదంపై విచారణ ప్రారంభం
♦ ఉమ్మడి వాటాలోనే తెలంగాణ, ఏపీ పంచుకోవాలన్న కర్ణాటక
♦ నేడు వాదనలు వినిపించనున్న ఏపీ    
 
 సాక్షి, న్యూఢిల్లీ: తమ రాష్ట్రానికి చెందిన న్యాయమూర్తి జస్టిస్ రామ్మోహన్‌రెడ్డిని కృష్ణా నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్‌లో సభ్యుడిగా నియమించడంపై భవిష్యత్తులో ఇతర భాగస్వామ్య రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వస్తాయేమోనన్న కర్ణాటక ఫిర్యాదును ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి స్థానంలో నదీ జలాల భాగస్వామ్యం లేని ఇతర రాష్ట్రాల నుంచి న్యాయమూర్తిని నియమించాలని కేంద్రానికి కర్ణాటక జనవరిలో లేఖ రాసి ఏప్రిల్ 5న ట్రిబ్యునల్ దృష్టికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగిలిన భాగస్వామ్య రాష్ట్రాలు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల అభిప్రాయాన్ని మంగళ, బుధవారాల్లో ట్రిబ్యునల్ తెలుసుకుంది. జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి సభ్యుడిగా ఉండడంపై తమకు అభ్యంతరం లేదని తెలంగాణ, మహారాష్ట్ర నివేదించాయి. ఏపీ మాత్రం ట్రిబ్యునలే తగిన మార్గదర్శనం చేయాలని కోరింది. ఇక కేంద్రం తరపు సీనియర్ న్యాయవాది ఖాద్రీ కర్ణాటక అభ్యంతరాలను తోసిపుచ్చారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రం అభిప్రాయం విన్న తరువాత కర్ణాటక అభ్యంతరాలను తోసిపుచ్చుతూ ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేష్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.

 విచారణ ప్రారంభం..: ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం కృష్ణా జలాల పంపిణీపై నెలకొన్న సందిగ్ధతను తేల్చేందుకు జస్టిస్ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ గడువును పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం విచారణ ప్రారంభమైంది. ముందుగా కర్ణాటక తరపున సీనియర్ న్యాయవాది అనిల్ దివాన్ వాదనలు ప్రారంభించారు. ‘ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 ఉద్దేశం, లక్ష్యం రెండు కొత్త రాష్ట్రాల మధ్య నీటిని పంచుకోవడమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన మొత్తం నుంచే పంచుకోవాల్సి ఉంటుంది. కానీ తెలంగాణ మొత్తం తిరగదోడాలంటోంది. ఇది సరికాదు.

పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 84, సెక్షన్ 85 చెబుతున్నది కూడా ఇదే’ అని వివరించారు. ఈ క్రమంలో విచారణను గురువారానికి వాయిదావేస్తూ ట్రిబ్యునల్ చైర్మన్ ఉత్తర్వులు జారీచేశారు. కాగా తమ వాదనల్లో మరికొంత భాగాన్ని కర్ణాటక గురువారం వినిపించనుంది. మిగిలిన రోజంతా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ వాదనలు వినిపించనున్నారు. బుధవారం విచారణకు ఆంధ్రప్రదేశ్ తరపున అదపు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసరావు, ప్రభుత్వ న్యాయవాది గుంటూరు ప్రభాకర్, తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాదులు వైద్యనాథన్, రామచంద్రరావు, రవీందర్‌రావు, విద్యాసాగర్‌రావు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు