ట్రంప్‌ దంపతులకు రాష్ట్రపతి భవన్‌లో భారీ విందు

25 Feb, 2020 21:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గౌరవార్ధం మంగళవారం రాత్రి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతి భవన్‌లో విందు ఏర్పాటు చేశారు. ట్రంప్‌ దంపతులతో పాటు ఈ విందులో ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, సీనియర్‌ కేంద్ర మంత్రులు, తెలంగాణా సీఎం కేసీఆర్‌తో సహా ఆరు రాష్ట్రాల సీఎంలు, భారత్‌-అమెరికాకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంతకుముందు రాష్ట్రపతి భవన్‌కు వచ్చిన ట్రంప్‌ దంపతులకు రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు రాష్ట్రపతి భవన్‌ విశేషాలను స్వయంగా వివరించారు.

విందుకు విచ్చేసిన అతిథులను వారికి పరిచయం చేశారు. ఆపై విందులో ట్రంప్‌ అభిరుచికి తగ్గట్టుగా ఘుమఘుమలాడే వంటకాలను వడ్డించారు. కాగా ఆరెంజ్‌తో తయారు చేసిన అమ్యూజ్‌ బౌజ్‌ సర్వ్‌ చేసిన తర్వాత.. సాలమన్‌ ఫిష్‌ టిక్కాతో ఈ గ్రాండ్‌ డిన్నర్‌ ప్రారంభమైంది. వెజిటేరియన్‌ ఫుడ్‌లో భాగంగా... రకారకాల సూపులు ఆలూ టిక్కీ, స్పినాచ్‌ చాట్‌ తదితర వంటకాలను వడ్డించారు. రాష్ట్రపతి భవన్‌ సిగ్నేచర్‌ డిష్‌ దాల్‌ రైసీనాతో పాటు.. మటన్‌ బిర్యానీ, మటన్‌ ర్యాన్‌, గుచ్చీ మటార్‌(మష్రూమ్‌ డిష్‌) కూడా అమెరికా అధ్యక్షుడి మోనూలో భాగమైంది. డిన్నర్‌ అనంతరం డిజర్ట్‌లో భాగంగా... హాజల్‌నట్‌ ఆపిల్‌తో పాటుగా వెనీలా ఐస్‌క్రీం, మాల్పువా విత్‌ రాబ్డీలను అతిధులు ఆరగించారు.

చదవండి : ఇండియాలో టారిఫ్‌లు ఎక్కువ: ట్రంప్‌

మరిన్ని వార్తలు