మోదీని ఇబ్బంది పెట్టేందుకే!

11 Mar, 2016 00:28 IST|Sakshi
మోదీని ఇబ్బంది పెట్టేందుకే!

న్యూఢిల్లీ: ఇషత్ర జహాన్ ఎన్‌కౌంటర్ విషయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం వాస్తవాలను మాయం చేసి.. అప్పటి గుజరాత్ సీఎం నరేంద్రమోదీని ఇబ్బందులు పెట్టేందుకే ప్రయత్నించిందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం పార్లమెంటులో తెలిపారు. ఇషత్ లష్కరే తోయిబా ఉగ్రవాది అనివిచారణలో వెల్లడైనా.. మోదీని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే వాస్తవాలను పక్కన పెట్టారని ఆరోపించారు. ఇషత్ర కేసుపై సావధాన తీర్మానంపై లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా యూపీఏ ప్రభుత్వం వాస్తవాలను మరుగున పడేసిందని రాజ్‌నాథ్ వెల్లడించారు.

ఓ పక్క విపక్ష సభ్యులు ఆందోళన చేస్తున్నా.. చిదంబరంపై దాడిని కొనసాగించారు. ‘ఉగ్రవాదానికి రంగు, మతం, జాతి ఉండవు. కానీ సెక్యులర్ అని చెప్పుకునే వాళ్లు ఉగ్రవాదానికి రంగు పూస్తారు.’ అని రాజ్‌నాథ్ తెలిపారు. ముంబై కోర్టు ముందు డేవిడ్ హెడ్లీ ఇచ్చిన వాంగ్మూలం, యూపీఏ సర్కారు ఆగస్టు6, 2009న గుజరాత్ హైకోర్టు ముందు దాఖలు చేసిన తొలి అఫిడవిట్ వంటి వాటిని రాజ్‌నాథ్ ప్రస్తావించారు.

‘హెడ్లీ వెల్లడించింది.. ఇషత్ర లష్కరే ఉగ్రవాదని తేల్చి చెప్పిన రెండో ఆధారం. మొదటిది.. యూపీఏ తొలి అఫిడవిట్లోనే స్పష్టమైంది’ అని అన్నారు. అప్పటి అటార్నీ జనరల్ జీఈ వాహనవతికి.. మాజీ హోం సెక్రటరీ జీకే పిళ్లై రాసిన లేఖ, ఈ కేసుకు సంబంధించిన ఇతర కీలక డాక్యుమెంట్లను కాంగ్రెస్ మాయం చేసిందన్నారు. దీనిపై తమ శాఖలో అంతర్గత విచారణకు ఆదేశించామని.. బాధ్యులపై సరైన చర్యలు తప్పవని హోం మంత్రి హెచ్చరించారు.

మరిన్ని వార్తలు