పాతవాహనాలను రోడ్లపైకి రానీయొద్దు

27 Nov, 2014 23:50 IST|Sakshi
పాతవాహనాలను రోడ్లపైకి రానీయొద్దు

జాతీయ హరిత ధర్మాసనం ఆదేశం
- 15 ఏళ్లు దాటితే రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించొద్దు
- ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు కూడా జారీ చేయొద్దు
- ఎన్జీటీ ఆదేశాలతో మాయం కానున్న పది లక్షల వాహనాలు
- పార్కింగ్ సమస్యనుంచి స్వల్ప ఉపశమనం

సాక్షి, న్యూఢిల్లీ: 15 ఏళ్లు దాటిన వాహనాలను నగర రహదారులపైకి రానీయొద్దని జాతీయ హరిత ధర్మాసనం (ఎన్జీటీ) ఆదేశించింది. నగరంలో వాయు కాలుష్యం నానాటికీ పెరుగుతుండడం, వాయు నాణ్యత తగ్గిపోతుండడాన్ని దృష్టిలో పెట్టుకుని పై విధంగా ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఆదేశాల కారణంగా 10 లక్షల వాహనాలు నగర రహదారులపైనుంచి మాయం కానున్నాయి. ఇందువల్ల నగరంలో పార్కింగ్ సమస్యకు కూడా కొంతమేర పరిష్కారం లభించనుంది. జాతీయ రాజధానిలో వాయుకాలుష్యంపై వర్థమాన్ కౌశిక్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ స్వతంత్రకుమార్ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించిన అనంతరం మొత్తం 14 ఆదేశాలు జారీచేసింది.

15 సంవత్సరాలు దాటిన  అన్ని రకాల  వాహనాలపై నిషేధం వాటిలో ఒకటి, ఇటువంటి వాహనాలను గుర్తించినప్పుడు సంబంధిత అధికారులు వాటిని మోటారు వాహన చట్టం  నిబంధనల కింద స్వాధీనం చేసుకోవడంతో పాటు చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవాలని ఎన్జీటీ ఆదేశించింది. ఇటువంటి వాహనాలను బహిరంగ ప్రదేశాలలో నిలిపిఉంచినప్పుడు చలాన్ విధింపు, జప్తు చేసే అధికారం సంబంధిత అధికారులకు ఉంటుంది. 15 సంవత్సరాలు దాటిన వాహనాల రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించకూడదని, వాటికి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కూడా జారీ చేయరాదని ఆదేశించింది.
 
ఈ ఆదేశాల కారణంగా పాత వాహనాలు రహదారులపై ఇకమీదట కనుమరుగు కానున్నాయి. ఇందువల్ల కొత్తవాటికి డిమాండ్ పెరగనుంది. బహిరంగప్రదేశాలలో ప్లాస్టిక్, చెట్ల ఆకుల వంటివాటిని తగులబెట్టడాన్ని అనుమతించరాదని, అటువంటి చర్యలకు పాల్పడేవారిపై చట్టరీత్యా తగిన చర్య తీసుకోవాలని కూడా ఎన్జీటీ ఆదేశించింది.

>
మరిన్ని వార్తలు