22 రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు!

8 Sep, 2018 08:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే 24 గంటల్లో దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్‌డీఎంఏ) శుక్రవారం హెచ్చరించింది. వానలతోపాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం, త్రిపుర, పశ్చిమబెంగాల్, సిక్కిం, జార్ఖండ్, యూపీ, ఉత్తరాఖండ్, హరియాణా, ఛండీగఢ్, ఢిల్లీ, హిమాచల్, రాజస్థాన్, తెలంగాణ, గోవా రాష్ట్రాలతోపాటు కొంకణ్, విదర్భ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంటూ భారత వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్‌ను ఎన్‌డీఎంఏ ఉటంకించింది. 

ప్రాథమిక చికిత్స కిట్లు, టార్చిలైట్‌, మంచినీళ్ల సీసాలు, నిల్వవుండే ఆహార పదార్థాలు సిద్ధంగా ఉంచుకోవాలని ప్రజలను ఎన్‌డీఎంఏ కోరింది. వరదలు వచ్చే అవకాశమున్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిల్లలను చెరువులు, కాల్వల్లోకి వెళ్లనీయకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఇటీవల కేరళ సహా పది రాష్ట్రాల్లో భారీ వర్షాలకు 1400 మందిపైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.

మరిన్ని వార్తలు