-

రామజన్మభూమి యాజమాన్య పత్రాలు పోయాయ్‌

7 Aug, 2019 15:01 IST|Sakshi

1982నాటి బందిపోటు దాడిలో వాటిని పొగొట్టుకున్నాం

సుప్రీంకోర్టులో రెండోరోజు కొనసాగిన విచారణ

న్యూఢిల్లీ: అయోధ్యలో రామజన్మభూమి వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రోజువారీ వాదనల్లో భాగంగా బుధవారం రెండోరోజు వాదనలను సుప్రీంకోర్టు కొనసాగించింది. ఈ కేసులో ఒక వాదిగా ఉన్న నిర్మోహి అఖారా వాదనలు వినిపిస్తూ.. రామజన్మభూమి యాజమాన్యానికి సంబంధించి తమ వద్ద ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది.

రామజన్మభూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి పూర్వం మీ అధీనంలో ఉందని చెప్పడానికి మీ వద్ద మౌకిక లేదా పత్ర సంబంధమైన ఆధారాలు, రెవెన్యూ రికార్డులు ఏమైనా ఉన్నాయా? అని సుప్రీంకోర్టు నిర్మోహి అఖారా తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. 1982లో జరిగిన బందిపోటు దాడిలో రామజన్మభూమి యాజమాన్య పత్రాలను తాము కోల్పోయామని, తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని అఖారా న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు.

రామజన్మభూమి-బాబ్రి మసీదు కేసులో ఆగస్టు ఆరో తేదీ నుంచి ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం రోజువారీ వాదనలు వింటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన మధ్యవర్తిత్వ కమిటీ ఓ పరిష్కారం చూపడంలో విఫలమవ్వడంతో ధర్మాసనం రోజువారీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో వాద, ప్రతివాదులుగా ఉన్న హిందూ-ముస్లిం సంఘాలు ఒక రాజీ పరిష్కారానికి రాకపోవడంతో మధ్యవర్తిత్వ కమిటీ నాలుగు నెలల పాటు జరిపిన సంప్రదింపుల ప్రక్రియ విఫలమైన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు