-

Constitution Day: కోర్టులను ఆశ్రయించడానికి సంకోచం వద్దు

27 Nov, 2023 03:47 IST|Sakshi

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ 

సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం  

సాక్షి, న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టు గత ఏడు దశాబ్దాలుగా ప్రజా న్యాయస్థానంగా వ్యవహరిస్తోందని భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ చెప్పారు. ఎంతో విశ్వాసంతో వచి్చన వేలాది మంది పౌరులు సుప్రీంకోర్టు ద్వారా న్యాయం పొందారని పేర్కొన్నారు. న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించడానికి భయపడాల్సిన పని లేదని ప్రజలకు సూచించారు. నిస్సంకోచంగా కోర్టులకు రావొచ్చని చెప్పారు.

ఆదివారం సుప్రీంకోర్టు ప్రాంగణంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో సీజేఐ మాట్లాడారు. వ్యవస్థీకృత ప్రజాస్వామ్య సంస్థలు, ప్రక్రియల ద్వారా రాజకీయ విభేదాలను పరిష్కరించుకోవడానికి రాజ్యాంగం మనకు వీలు కల్పిస్తుందని వివరించారు. ఎన్నో రకాల సమస్యల పరిష్కారానికి న్యాయస్థానాల వ్యవస్థ ఉపయోగపడుతుందని వెల్లడించారు. దేశంలోని ప్రతి కోర్టులో ప్రతి కేసు రాజ్యాంగబద్ధమైన పాలనకు పొడిగింపేనని అన్నారు.

ప్రజలకు సత్వర న్యాయం అందించడానికి ఎన్నో విప్లవాత్మక చర్యలు చేపట్టామని గుర్తుచేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నామని ఉద్ఘాటింటారు. కోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాలు సైతం ప్రారంభించామని తెలిపారు. దేశ పౌరుల ఆకాంక్షలను నెరవేర్చడానికి తమ వంతు కృషి చేస్తున్నామని సీజేఐ స్పష్టం చేశారు. న్యాయం పొందడానికి కోర్టులను చివరి మజిలీగా భావించాలన్నారు.

2023 నవంబర్‌ 25 నాటికి సుప్రీంకోర్టు 36,068 తీర్పులను ఆంగ్ల భాషలో వెలువరించిందని చెప్పారు. ఈ తీర్పులను  ప్రాంతీయ భాషల్లోకి అనువాదించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ మాట్లాడుతూ... రాజ్యాంగాన్ని సవరించుకొనే వెసులుబాటు ఉందని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే సామర్థ్యం రాజ్యాంగానికి ఉందని తెలియజేశారు.   
 

ఆలిండియా జ్యుడీషియల్‌ సర్వీసు ఏర్పాటు చేయాలి: రాష్ట్రపతి  
నైపుణ్యం కలిగిన యువతను న్యాయ వ్యవస్థలోకి తీసుకురావడానికి,  వారి ప్రతిభకు సాన పెట్టడానికి అఖిల భారత జ్యుడీషియల్‌ సరీ్వసు ఏర్పాటు చేయాలని రాష్ట్రపతి  ముర్ము సూచించారు. ఆదివారం సుప్రీంకోర్టులో రాజ్యాంగ దినోత్సవంలో ఆమె ప్రసంగించారు. న్యాయం పొందే విషయంలో పౌరులకు ఖర్చు, భాష అనే అవరోధాలు ఎదురవుతున్నాయని చెప్పారు. ఇలాంటి పరిమితులను తొలగించాలన్నారు. న్యాయాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని,  ప్రజలే కేంద్రంగా న్యాయ వ్వవస్థను తీర్చిదిద్దాలని అభిప్రాయపడ్డారు. యువత న్యాయ వ్యవస్థలోకి ప్రవేశించడానికి మరిన్ని అవకాశాలివ్వాలన్నారు.

పార్లమెంట్‌ అభేద్యమైనది: ఉపరాష్ట్రపతి
ప్రజాస్వామ్యానికి ఆత్మ పార్లమెంట్‌ అని ఉప రాష్ట్రపతి ధన్‌ఖడ్‌ చెప్పారు. ఆదివారం ఢిల్లీలో రాజ్యాంగ దినోత్సవంలో మాట్లాడారు. పార్లమెంట్‌ ఔన్నత్యాన్ని కార్యనిర్వాహక వ్యవస్థ గానీ, న్యాయ వ్యవస్థ గానీ తగ్గించలేవని పేర్కొన్నారు.  పార్లమెంట్‌ అభేద్యమైనదని స్పష్టం చేశారు. పార్లమెంట్‌ అధికారాల్లో జోక్యం రాజ్యాంగ ఉల్లంఘన, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని చెప్పారు.    

అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం సుప్రీంకోర్టు ప్రాంగణంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్, కేంద్ర న్యాయ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్, న్యాయవాదులు పాల్గొన్నారు. అంబేడ్కర్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. ఏడడుగుల ఈ అంబేడ్కర్‌ విగ్రహాన్ని శిల్పి నరేష్‌ కుమావత్‌ రూపొందించారు.  

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆదివారం సుప్రీంకోర్టు ఆవరణలో మొక్కలు నాటుతున్న
రాష్ట్రపతి ముర్ము, సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌. చిత్రంలో కేంద్ర న్యాయ మంత్రి అర్జున్‌రామ్‌  మేఘ్వాల్‌

మరిన్ని వార్తలు