అక్కడ కేవలం ఇద్దరు యాచకులే!

21 Mar, 2018 13:15 IST|Sakshi

కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి థావర్‌ చంద్‌ గెహ్లాట్‌ దేశంలోని యాచకులకు సంబంధించి ఒక నివేదికను విడుదల చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో మొత్తం 4 లక్షల మంది యాచకులు, సంచార యాచకులు ఉన్నారు. 81వేల మంది యాచకులతో పశ్చిమ బెంగాల్‌ ప్రథమ స్థానంలో ఉండగా కేవలం ఇద్దరు యాచకులతో లక్షద్వీప్‌ చివరి స్థానంలో ఉంది. గెహ్లాట్‌ లోక్‌సభకు రాసిన లిఖితపూర్వక సమాధానంలో 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 4,13,670 మంది యాచకులు ఉండగా వారిలో 2,21,673మంది పురుషులు కాగా, 1,91,997మంది స్త్రీలు ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌ 65,835మంది యాచకులతో రెండో స్థానంలో ఉండగా 30,218 మందితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో ఉంది.

కేంద్ర పాలిత ప్రాంతాల్లో యాచకుల సంఖ్య తక్కువగా ఉంది. 2,187మంది యాచకులతో దేశ రాజధాని ఢిల్లీ  ప్రథమ స్థానంలో ఉండగా, కేవలం ఇద్దరు యాచకులతో లక్షద్వీప్‌ చివరి స్థానంలో ఉంది. దాద్రా నగర్‌ హవేలీలో 19మంది, డామన్‌ డయ్యూలో 22మంది, అండమాన్‌ నికోబార్‌లో 56మంది యాచకులు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. వెనకబడిన తరగతులకు చెందిన ఒక సంస్థ జాతీయ వెనకబడిన తరగతుల కమిషన్‌ను సంచార జాతులు, యాచకులు, ఆశ్రిత కులాల వారిని, వృత్తి పనులను చేసుకునే వారిని గుర్తించి వారందరినీ ఒబీసీల్లో ఉపకులాలుగా చేర్చాలని కోరింది.

గత అక్టోబరులో ప్రధాని మోదీ ఒబీసీల వర్గీకరణ కోసం ఒక కమిషన్‌ను ఏర్పాటుచేశారు. ఆ కమిషన్‌ ప్రధాన విధి ఒబీసీల వర్గీకరణ. ఫలితంగా ఎక్కువ వెనకబడిన కులాలకు రిజర్వేషన్లను వర్తింపచేయడం. వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య జాతీయ వెనకబడిన  కులాల కమిషన్‌కు ఒక లేఖ రాశారు.దానిలో ఆయన  సంచార జాతులను, యాచకులను, ఆశ్రిత కులాల వారిని, వృత్తి పనులను చేసుకునే వారిని ఓబీసీలోని ‘ఏ’ కేటగిరీలో ఉప కులాలుగా చేర్చాలని కోరారు. చేతివృత్తులు చేసుకునేవారిని, విద్య, ఉపాధి రంగాల్లో 50శాతం కన్నా తక్కువ ఉన్నవారిని ‘బీ’ కేటగిరీలో, 50శాతం కన్నా ఎక్కువ ఉన్నవారిని ‘సీ’ కేటగిరీలో ఉపకులాలుగా చేర్చాలని కోరారు. వ్యవసాయం, ఇతర వృత్తులను చేసుకునేవారిని డీ కేటగిరీలో, దళితులు, ముస్లింలు, క్రైస్తవులను ఈ కేటగిరీలో చేర్చాలని లేఖలో వివరించారు. జనాభావారీగా విభజించిన తర్వాత రిజర్వేషన్‌ను నిర్ణయించాలని కోరారు.

మరిన్ని వార్తలు