'చనిపోయిన నా భర్త స్పెర్మ్ కావాలి'

11 Jul, 2016 09:48 IST|Sakshi
'చనిపోయిన నా భర్త స్పెర్మ్ కావాలి'

న్యూఢిల్లీ: చనిపోయిన తన భర్త వీర్యం కావాలని ఓ భార్య వైద్యులకు విజ్ఞప్తి చేసింది. తాను సంతానం పొందేందుకు తన భర్త మృతదేహం నుంచి శుక్రకణాలు వేరు చేసి ఇవ్వాలని వైద్యులను బ్రతిమాలుకుంది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యులకు ఈ అనుభవం ఎదురైంది. కొన్నేళ్లకిందట పెళ్లి చేసుకున్న ఆ ఇద్దరికి సంతానం లేదని, యువకుడైన తన భర్త నుంచి సంతానం కోసం వీర్యాన్ని వేరు చేసి ఇవ్వాలని ఆమె కోరిందని, అత్తమామలు కూడా ఆమె విజ్ఞప్తికి మద్దతిచ్చారని ఎయిమ్స్ వైద్యులు చెప్పారు. అయితే, ఆమె విజ్ఞప్తిని తాము తిరస్కరించినట్లు చెప్పారు.

మన దేశంలో చనిపోయిన వ్యక్తి నుంచి వీర్య కణాలు వేరు చేసే ప్రక్రియ(పోస్ట్ మార్టం స్పెర్మ్ రిట్రైవల్)కు సంబంధించి ఎలాంటి మార్గ దర్శకాలు లేనందున తాము ఆ పనిచేయలేదని అన్నారు. తాజాగా వచ్చిన ఈ విజ్ఞప్తి ప్రకారం దేశంలో ఆ మేరకు మార్గదర్శకాలు రూపొందించాల్సిన సమయం వచ్చిందని అనిపిస్తుందని చెప్పారు. దీనికి సంబంధించి ఎయిమ్స్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సుధీర్ గుప్తా మాట్లాడుతూ ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత అతడి మృతదేహంలో 24గంటలపాటు శుక్రకణాలు బతికి ఉంటాయని చెప్పారు. వాటిని వేరు చేసి భద్రపరచడం అనేది చాలా తేలికైన ప్రక్రియ అని, అయితే, దానికి కొన్ని నైతిక పరమైన, మరికొన్ని చట్టపరమైన అంశాలు ఇమిడి ఉన్నాయని వైద్యులు తెలిపారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు