రేషన్ మాఫియాపై సీఎం యోగి కన్నెర్ర

27 Mar, 2017 12:48 IST|Sakshi
రేషన్ మాఫియాపై సీఎం యోగి కన్నెర్ర

అధికారం చేపట్టినప్పటి నుంచి వరుసగా ఒక్కో విషయంపై తనదైన మార్కు చూపిస్తున్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. తాజాగా రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపారు. రాష్ట్రంలో మూతపడిన చక్కెర కర్మాగారాలపై తనకు ఓ నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పేదలకు తప్పనిసరిగా రేషన్ కార్డులు ఇవ్వాలని, అదేసమయంలో ఆహార ధాన్యాలు, రేషన్ సరుకులను నల్లబజారుకు తరలిస్తున్న మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ విషయాలపై తగిన ప్రచారం చేయడంతో పాటు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కఠినంగా వ్యవహరించాలని గోరఖ్‌పూర్, బస్తీ డివిజన్ల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సూచించారు. ప్రభుత్వ పథకాలు అసవరంలో ఉన్నవాళ్లకు అందేలా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లదేనని ఆయన స్పష్టం చేశారు. మైనింగ్, అటవీ, పశువుల మాఫియా విషయంలో కూడా గట్టిగా ఉండాలని చెప్పారు.

చెరుకు రైతుల బకాయిలను 15 రోజుల్లోగా చెల్లించాలని అధికారులను సీఎం యోగి ఆదేశించారు. తదుపరి చెరుకు సీజన్‌కు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. డీనోటిఫైడ్ గిరిజన తెగలను గుర్తించాలని, అలాగే గిరిజనులు ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుంటున్నారో లేదో తేల్చేందుకు ఓ సర్వే చేయాలని సూచించారు. సర్వే తర్వాత వన్ తంగియా, ముసాహర్ తెగలవాళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాలను రెవెన్యూ గ్రామాలుగా ప్రకటించి అక్కడ విద్య, ఆరోగ్యం, తాగునీరు, రోడ్లు, ఇళ్లు, విద్యుత్ సదుపాయాలు కల్పించి ప్రభుత్వ రేషన్ దుకాణాలను తెరవాలని చెప్పారు. నేరచరిత్ర లేనివారికి మాత్రమే నిర్మాణ పనుల కాంట్రాక్టులు ఇవ్వాలని సీఎం గట్టిగా స్పష్టం చేశారు. నేరస్తులు ఏవైనా ఒత్తిళ్లు తెస్తే, ఆ విషయాన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీల దృష్టికి తెచ్చి వాళ్లపై ఎఫ్ఐఆర్‌లు దాఖలు చేయాలన్నారు.

మరిన్ని వార్తలు