స్పెయిన్‌లో యువ శాస్త్రవేత్త దుర్మరణం

7 Mar, 2019 07:45 IST|Sakshi
షణ్ముఖ్‌నాయుడు(ఫైల్‌)

మూడు రోజుల క్రితం రైలు నుంచి జారిపడినట్లు కళాశాల నుంచి వర్తమానం

వేపగుంట సమీపంలోని దుర్గానగర్‌లో విషాదం

విశాఖపట్నం, పెందుర్తి: పెందుర్తి పోలీస్‌స్టేషన్‌ పరిధి వేపగుంట నాయుడుతోట సమీపంలోని దుర్గానగర్‌కు చెందిన యువ శాస్త్రవేత్త మజ్జి షణ్ముఖ్‌నాయుడు(25) స్పెయిన్‌లో జరిగిన రైలు ప్రమాదంలో మరణించినట్లు ఆ దేశం నుంచి కుటుంబ సభ్యులకు బుధవారం సమాచారం అందింది. దీంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. దుర్గానగర్‌లో నివాసం ఉంటున్న విశ్రాంత నేవీ ఉద్యోగి మజ్జి చిన్నంనాయుడు, మణి దంపతులకు కుమార్తెలు డాక్టర్‌ హారిక, నీలిమ, కుమారుడు షణ్ముఖ్‌నాయుడు సంతానం. చిన్ననాటి నుంచి చదువులో చురుగ్గా ఉండే షణ్ముఖ్‌(పాస్‌పోర్టు నెంబర్‌: జెడ్‌3407688) తన ప్రతిభతో స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఉన్న ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫోటోనిక్‌ సైన్సెస్‌ రీసోర్స్‌లో యువ శాస్త్రవేత్తగా అభ్యసనం చేస్తున్నారు.

అయితే గత సోమవారం నుంచి షణ్ముఖ్‌ కళాశాలకు వెళ్లలేదు. ఈ క్రమంలో బుధవారం(భారతకాలమానం ప్రకారం) కళాశాలకు భారత్‌కు చెందిన షణ్ముఖ్‌నాయుడు అనే వ్యక్తి కళాశాలకు సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్‌పై మరణించి ఉన్నాడు అని అక్కడి పోలీసులు సమాచారం ఇచ్చారు. దీనిపై కళాశాల ప్రతినిధులు ఆ సమాచారాన్ని దుర్గానగర్‌లో నివాసం ఉంటున్న తల్లిదండ్రులకు చేరవేశారు. మరణించిన సమయంలో వాకింగ్‌ ట్రాక్, టీషర్ట్‌తో షణ్ముఖ్‌ ఉన్నట్లు కళాశాల ప్రతినిధులు తెలిపారు. అయితే షణ్ముఖ్‌ ప్రమాదవశాత్తు మరణించాడా...? ఆత్మహత్యకు పాల్పడ్డాడా..? లేక మరేదైనా కారణంతో మరణించాడా...? అన్నది మిస్టరీగా మారింది. ఆదివారమే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. షణ్ముఖ్‌ మరణంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. భారత ప్రభుత్వం త్వరగా స్పందించి షణ్ముఖ్‌ మృతదేహాన్ని విశాఖకు రప్పించాలని అతని బంధువులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు