'నేల' విడిచిన సంస్కరణలు

31 Aug, 2016 01:06 IST|Sakshi
'నేల' విడిచిన సంస్కరణలు

విశ్లేషణ
దేశంలోని 70 శాతం రైతులు వ్యవసాయరంగంలో అదనపు జనాభాగా ఉన్నారని. వీరిని పట్టణ ప్రాంతాలకు తరలించాల్సి ఉందని నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పదేపదే చెబుతూ వచ్చారు. భారత్‌లో అతిపెద్ద సంస్కరణ .. గ్రామీణ జనాభాను పెద్ద ఎత్తున నగరాలకు తరలించడమేనని ఆర్బీఐ గవర్నర్‌ రఘురామ్‌రాజన్‌ సైతం ప్రకటించారు. దేశజనాభాలోని అత్యధిక భాగానికి వ్యవసాయం జీవనోపాధిని కలిగించలేకపోతోందని, అసమానతలకు ఇదే కారణమని ప్రస్తుత ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ కూడా తేల్చేశారు.

ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన పాతికేళ్ల తర్వాత, గ్రామీణ ప్రాంతాల కోసం 2015లో ప్రచురించిన మొట్టమొదటి సామాజిక–ఆర్థిక సర్వే ఒక నిరాశాపూరిత దృశ్యాన్ని చిత్రించింది. భారత్‌లో నివసిస్తున్న 125 కోట్ల మంది జనాభాలో  గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న దాదాపు 70 శాతం మంది ప్రజలకు దారిద్య్రమే జీవన విధానంగా ఉన్నట్లు పేర్కొన్న ఈ సర్వే ఒక నగ్న వాస్తవాన్ని చిత్రించింది. అదేమిటంటే గడచిన కాలం మొత్తంగా చెప్పుకుంటూ వచ్చిన దానికంటే ఎక్కువగా గ్రామీణ భారత్‌ దారిద్య్రంలో గడుపుతోంది. గ్రామీణ ప్రాంతంలోని 75 శాతం ఇళ్లలో సంపాదిస్తున్న కుటుంబ సభ్యుడి అత్యధిక ఆదాయం నెలకు రూ. 5 వేలకంటే మించడం లేదు. పైగా, 51 శాతం గృహాలకు చేతి శ్రమే ప్రధాన ఆదాయ వనరు. ఈ చీకటి కోణాన్ని సామాజిక–ఆర్థిక సర్వే బట్టబయలు చేసింది. గ్రామీణ జనాభాలో అధిక శాతం రైతులేనని తెలుసుకుంటే ఆర్థిక సంస్కరణలు వ్యవసాయంపై ఎంతగా శీతకన్ను వేస్తున్నాయో ఈ సర్వే తేల్చి చెబుతోంది.


దశాబ్దాల నిర్లక్ష్యంలో వ్యవసాయం
నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆర్గనైజేషన్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) 2011-12 కాలానికి ప్రకటించిన వినియోగ వెచ్చింపు డేటా కూడా సరిగ్గా ఇదే విషయాన్ని చెబుతోంది. మీరు గ్రామంలో ఉండి నెలకు రూ. 2,886ల కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారంటే, దేశంలోని 5 శాతం అగ్రశ్రేణి జనాభాలో మీరు ఉన్నట్లే లెక్క. పట్టణ ప్రాంతాల్లో ఈ పరిమితి రూ. 6,383 వరకు ఉంది. అంటే ఇంత ఆదాయం వస్తోందంటే మనం ముఖేశ్‌ అంబానీ, రతన్‌ టాటా, నారాయణ మూర్తి వర్గశ్రేణిలో చేరిపోయామని లెక్క. సమాజంలోని 5 శాతం ఎగువ తరగతి విభాగంలోకి మనం చేరి ఉండవచ్చు కానీ పట్టణ ప్రాంతా ల్లోలాగా ప్రతి నెలా రూ.6,383ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేని 95 శాతం ప్రజల దయనీయ స్థితిని ఒకసారి ఊహించండి.

దేశంలోని 17 రాష్ట్రాల్లో కుటుంబ వినియోగం కోసం వెచ్చిస్తున్న మొత్తంతో పాటు వ్యవసాయం ద్వారా ఒక రైతు పొందుతున్న సగటు ఆదాయం ఏడాదికి రూ. 20,000లు మాత్రమేనని, 2016 ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. మరోమాటలో చెప్పాలంటే ఈ 17 రాష్ట్రాల్లో ఒక్కొక్క రైతు నెలవారీ ఆదాయం కేవలం రూ. 1,666లు మాత్రమే. ఇక జాతీయ స్థాయిలో చూస్తే రైతు పొందుతున్న సగటు నెలసరి ఆదాయం కుటుంబం మొత్తానికి కలిపి రూ.3,000లు మాత్రమేనని ఎన్‌ఎస్‌ ఎస్‌ఓ నివేదిక పేర్కొంది. మన దేశంలో ఇప్పుడు ఒక చప్రాసీకి (నాలుగో తరగతి ఉద్యోగి)కి వస్తున్న ప్రాథమిక ఆదాయం రూ.18,000లను రైతు ఆదాయంతో పోల్చి చూడండి. గడచిన అన్ని సంవత్సరాల్లో వ్యవసాయాన్ని ఎలా నిర్లక్ష్యం చేస్తూ వచ్చారో దీన్ని బట్టే తెలిసిపోతుంది.


మన దేశంలో రైతులు అనుభవిస్తున్న ఈ దీనస్థితి కచ్చితంగా ఆర్థిక సంస్కరణల ఫలితమే. ఆర్థిక సరళీకరణ, ఆర్థిక సంస్కరణలు, మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ.. మీరు ఏ పేరుతోనయినా పిలవండి.. దేశంలోని మెజారిటీ ప్రజలను ఇవి దూరంగా ఉంచడమే కాదు, ఆర్థిక సంస్కరణలు విజయవంతం కావడా నికి ఇదే ముందు షరతుగా ఉంటోందని చెప్పాలి. ఆర్థిక సంస్కరణలు కొనసాగాలంటే ఇతర అసంఘటిత రంగాల్లాగే వ్యవసాయాన్ని కూడా ఉద్దేశ పూర్వకంగా  క్షీణింపజేస్తూ వచ్చారు.


నాటి ఆర్థిక మంత్రి మన్మోహన్‌ సింగ్‌ 1991 జూలైలో చరిత్రాత్మక బడ్జెట్‌ ప్రసంగాన్ని చేశారు. ఆ ప్రసంగమే ఆర్థిక సరళీకరణ కోసం దేశం తలుపులు బార్లా తెరిచేసింది. లైసెన్స్‌ రాజ్‌ నియంత్రణల నుంచి పరిశ్రమలకు పూర్తి విముక్తి కలిగిస్తున్నట్లుగా ఆయన చేసిన ప్రసంగాన్ని ఇప్పుడు మళ్లీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను. ఆ తదుపరి పేజీలోనే ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయా నికి కీలకపాత్ర ఉంటుందని సింగ్‌ పేర్కొనడం గమనార్హం. అయితే వ్యవ సాయం రాష్ట్ర పరిధిలోనిది కాబట్టి వ్యవసాయానికి జవజీవాలు కల్పించే బాధ్యతను ఆర్థికమంత్రి రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేశారు. కానీ పరిశ్రమ కూడా రాష్ట్రాల పరిధిలోనిదే అనే విషయాన్ని మన్మోహన్‌ సింగ్‌ మర్చిపోయారు. రెండింటికి మధ్య ఆయన పాటించిన పక్షపాత దృష్టి స్పష్టమే.


మన రైతులు సమర్థత లేనివారా?
దీన్ని ఆర్థిక సరళీకరణ ప్రక్రియకు సంబంధించిన అనుద్దేశపూర్వకమైన పత నంగా మాత్రమే చెప్పకూడదు. ఎందుకంటే ఇది ముందే రూపొందించిన డిజైన్‌లో భాగం. దాదాపు 16 ఏళ్ల తర్వాత అంటే 1996లో ప్రపంచ బ్యాంకు, వచ్చే 20 ఏళ్లలో గ్రామీణ ప్రాంతాల్లోని 40 కోట్లమంది ప్రజలను పట్టణ ప్రాంతాలకు తరలించాలంటూ భారత్‌ను ఆదేశించింది. సమర్థత లేని ఉత్పత్తి దారుల చేతుల్లో అంటే రైతుల చేతుల్లో అత్యంత విలువైన భూమి చిక్కుబడి ఉందని బ్యాంక్‌ పేర్కొంది. వీరిని పారిశ్రామిక కార్మికులుగా మార్చేందుకు భారత్‌ ఒక శిక్షణా సంస్థల యంత్రాంగాన్ని నెలకొల్పాలని ప్రపంచ బ్యాంకు సూచించింది. 2008 ప్రపంచ అభివృద్ధి నివేదికలో ప్రపంచ బ్యాంకు ఈ సూచన చేసిన సంవత్సరానికి అంటే 2009లో దేశంలో వెయ్యి పారిశ్రామిక శిక్షణా సంస్థలను ఏర్పర్చాలని నాటి ప్రభుత్వం నిర్ణయించింది.


ప్రపంచ బ్యాంకు సూచనను తదనంతర ప్రభుత్వాలు గుడ్డిగా పాటిస్తూ వచ్చాయి. దేశంలోని 70 శాతం రైతులు వ్యవసాయరంగంలో అదనపు జనా భాగా ఉన్నారని, వీరిని పట్టణ ప్రాంతాలకు తరలించాల్సిన అవసరముందని నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌  పదేపదే చెబుతూ వచ్చారు. భారత్‌లో అతి పెద్ద సంస్కరణ  ఏదంటే వ్యవసాయరంగంలోని జనాభాను పెద్ద ఎత్తున నగరాలకు తరలించడమేనని ఆర్బీఐ గవర్నర్‌ రఘురామ్‌రాజన్‌ సైతం బహిరంగంగా ప్రకటించారు. ఇక మన ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ కూడా ఇదే పాట పాడుతూ దేశజనాభాలోని అత్యధిక భాగానికి వ్యవసాయం జీవనో పాధిని కలిగించలేకపోతోందని, అసమానతలకు ఇదే కారణమని తేల్చేశారు. అయితే ప్రభుత్వాలు వరుసగా వ్యవసాయ ఆర్థిక వనరులను క్షీణింప జేస్తూ, వ్యవసాయ జనాభాను అథఃపతనంలోకి నెట్టేశాయన్న వాస్తవాన్ని జైట్లీ చెప్పకుండా దాటేశారు. బడ్జెట్‌ కేటాయింపుల్లో వ్యవసాయానికి తక్కువ ప్రాధాన్యమిస్తూ రావడమే దీనికి తిరుగులేని సాక్ష్యం. 11వ ప్రణాళికలో వ్యవ సాయానికి రూ.1 లక్ష కోట్లను బడ్జెట్‌లో కేటాయించగా, 12వ ప్రణాళికలో రూ.1.50 లక్షల కోట్లను కేటాయించారు. పైగా వరి, గోధుమకు కనీస మద్దతు ధర దాదాపుగా స్తంభించిపోయింది. అదే సమయంలో వ్యవసాయ పంటల ధరలు సగటున 4 శాతం కంటే తక్కువ గానే పెరిగాయి.


వాస్తవానికి ఆర్థిక సంస్కరణలను కొనసాగించడానికే వ్యవసాయాన్ని  ఉద్దేశ పూర్వకంగా క్షీణింప జేస్తూ వస్తున్నారు. గరిష్ట మద్ధతు ధర కింద వ్యవసాయ ఉత్పత్తులకు అధిక ధరలను ప్రకటిస్తే ఆహార ధరలు అధికంగా పెరుగుతాయి కాబట్టి పారిశ్రామిక, వాణిజ్య రంగంలో కార్మికులకు అధిక వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో వ్యవసాయ ఉత్పత్తులకు అధిక ధర కల్పిస్తే అనేక పరిశ్రమలకు ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోతాయి. పైగా, వ్యవసాయ రంగం అధిక ఆదాయాన్ని పొందితే వలస పోవటం తగ్గుముఖం పడుతుంది. దీంతో మౌలిక వసతుల కల్పన, రియల్‌ ఎస్టేట్‌ రంగాలకు తక్కువ వేతనంతో శ్రామిక శక్తి లభ్యత తగ్గిపోతుంది.


ప్రభుత్వమే వ్యవసాయరంగ వ్యతిరేకి
వ్యవసాయ ఉత్పత్తిపై 50 శాతం రాబడిని వ్యవసాయ రంగానికి అందిం చాలంటూ స్వామినాథన్‌ కమిటీ ప్రకటించిన నివేదికను ప్రభుత్వం ఈ కారణంతోనే అమలు చేయడం లేదు. అధిక ధరలను ప్రకటిస్తే మార్కెట్లను అది ధ్వంసం చేస్తుందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు అఫిడవిట్‌ దాఖలు చేసింది కూడా. ఈ కారణం వల్లే కనీస మధ్దతు ధరకు మించి వరి, గోధుమ పంటకు బోనస్‌ను ప్రకటించవద్దని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టంగానే ఆదేశాలు జారీ చేసింది. అంటే ఆర్థిక సంస్కరణ వాస్తవ భారాన్ని గ్రామీణ భారతమే మోస్తోంది. వీరిలో రైతుల జనాభాయే అధికంగా ఉంటోంది. దేశ చరిత్రలో మొట్టమొదటి సామాజిక ఆర్థిక జనగణన సర్వే ఈ వాస్తవాన్నే స్పష్టం చేసింది. మానవాభివృద్ధి సూచిక ప్రకారం భారత్‌ పనితీరు కూడా ఈ అసమానతనే చూపిస్తోంది. ఈ సూచికలో 188 దేశాలలో భారత్‌ 130వ ర్యాంకు సాధించింది. అందుచేత మనం మాట్లాడుకుంటున్న ఆర్థిక సంస్క రణ చాలావరకు సంపన్నులకు అనుకూలంగానే ఉంటోంది.


వ్యవసాయాన్ని క్షీణింపజేస్తూవచ్చిన క్రమంలోనే ఆర్థిక సంస్కరణలు బలపడుతూ వచ్చాయి. ప్రస్తుతం క్వింటాల్‌ వరి ధాన్యానికి రూ. 1,450లుగా ప్రకటించిన మద్దతుధరను ఆదాయ సమతుల్యత ప్రమాణాల ప్రకారం చూస్తే క్వింటాల్‌కు రూ. 5,100లకు పెంచాలి. క్వింటాల్‌ గోధుమ ధరను రూ. 7,600కు పెంచాలి. సమాజంలోని ఇతర సెక్షన్లతో సమానతను పాటించా లంటే ఇది రైతుల న్యాయబద్ధమైన హక్కు. సరిగ్గా ఈ హక్కునే వారికి కల్పిం చకుండా తిరస్కరిస్తున్నారు. ఒక వైపు ప్రభుత్వోద్యోగులకు, కాలేజీ ప్రొఫె సర్లకు, స్కూలు టీచర్లకు జీతాలను పెంచుతున్నప్పుడు అదే ప్రాతిపదికన వ్యవసాయరంగానికి ఆదాయ పెంపుదలను తృణీకరిస్తున్నారు. భారత దేశంలో అతి పెద్ద సంస్కరణ వ్యవసాయరంగంలోనే జరగాలి. న్యాయ బద్ధమైన రాబడిని రైతులకు అందిస్తే దేశీయ డిమాండ్‌ను అది ముందుకు తీసుకుపోవచ్చు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరింపచేయవచ్చు. 7వ పే కమిషన్‌ను ఆర్థిక వ్యవస్థను ఉద్దీపింపచేసే ఉత్ప్రేరకంగా చూస్తు్తన్నట్లయితే అది వినియోగదారీ సరుకులకు మరింత డిమాండ్‌ను సృష్టించాలి. అప్పుడు, వ్యవసాయంలో అధిక రాబడి భారత ఆర్థిక వ్యవస్థకు ఎంత శక్తినిస్తుందో ఎవ రైనా ఊహించవచ్చు. కనీస మద్దతు ధర కింద క్వింటాల్‌ గోధుమకు రూ. 7,600ల ధరను ప్రకటిస్తే గ్రామీణ ప్రాంతాల్లో అది తీసుకువచ్చే ఆర్థిక పురోగతిని ఎవరైనా ఊహించవచ్చు. దురదృష్టవశాత్తూ ఆర్థిక సంస్కరణల ప్రస్తుత దశను కొనసాగించడానికి వ్యవసాయాన్ని తెలిసితెలిసి బలిపెడుతున్నారు. మరొక మాటలో చెప్పాలంటే అన్యాయపు ఆర్థిక సంస్కరణల కోసం 60 కోట్ల మంది రైతులు మూల్యం చెల్లిస్తున్నారు.

దేవిందర్‌శర్మ
వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు-hunger55@gmail.com

మరిన్ని వార్తలు