ప్రభుత్వ బ్యాంకులకు మరింత మూలధనం అవసరం

31 Aug, 2016 01:10 IST|Sakshi
ప్రభుత్వ బ్యాంకులకు మరింత మూలధనం అవసరం

ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ విశ్వనాథన్
న్యూఢిల్లీ: మొండిబకాయిల సమస్యను ఎదుర్కొనే విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరింత మూలధనం అవసరమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్ ఎన్‌ఎస్ విశ్వనాథన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ బ్యాంకింగ్ ప్రమాణాలకు సంబంధించి 2019 మార్చి 31 నుంచీ అమలు పరచాల్సిఉన్న  బాసెల్-3 నిబంధనల ఒత్తిడిని తట్టుకునేందుకూ బ్యాంకులకు మరింత మూలధనాన్ని సమకూర్చాల్సి ఉంటుందని వివరించారు.

అయితే ఈ విషయలో ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందుతుందన్న విశ్వాసమూ ఉందని అన్నారు. అసోచామ్ నిర్వహించిన ఒక సమావేశంలో విశ్వనాథన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా రుణ  నాణ్యతా నిర్వహణపై ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఆర్‌కే గుప్తా, అసోచామ్ మాజీ ప్రెసిడెంట్ ఆర్‌ఎన్ ధూత్, క్యాపిటల్ ఫస్ట్ చైర్మన్ వీ వైద్యనాథన్ పాల్గొన్నారు.

 రిటైల్ రుణాల్లోనూ ఇబ్బందులు ఉన్నాయ్
కాగా  రిటైల్ రుణాల విషయంలో అంతా సవ్యంగా జరిగిపోతోందని చెప్పడానికి వీలు లేదనీ  విశ్వనాథన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రుణాల వసూలు, పర్యవేక్షణ వంటి విషయాల్లో మరింత జాగరూకత అవసరమని అన్నారు. ఈ విభాగంలో రుణాలు ఇచ్చే ముందు రిస్క్ గురించి అత్యంత జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుందని సూచిం చారు.  ఇదిలావుండగా... వార్షికంగా  గృహ రుణ వ్యయాలతో పోల్చితే... కార్పొరేట్ రుణ వ్యయాలు గణనీయంగా తగ్గినట్లు ఆర్‌బీఐ 2015-16 వార్షిక నివేదిక తెలిపింది.

మరిన్ని వార్తలు