కష్టాల కడలిలో కాంగ్రెస్ నావ

24 Jun, 2016 02:02 IST|Sakshi
కష్టాల కడలిలో కాంగ్రెస్ నావ

సమకాలీనం

2013 తరువాత కాంగ్రెస్ అధికారంలో ఉన్నచోట బీజేపీ ఆధిపత్యం సాధించి, తేలిగ్గా గెలుస్తోంది. అయితే, బీజేపీ సైతం ఏదైనా ప్రాంతీయ పార్టీ బలంగా ఉంటే ఓడిపోతోంది. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నచోట రెండు జాతీయ పార్టీలకు స్థానం దొరకటం లేదు. అంటే కాంగ్రెస్ స్థానాన్ని బీజేపీ భర్తీ చేస్తూ వస్తోంది, తాను అధికారంలో ఉన్న చోట నిలదొక్కుకుంటోంది. అంతేగానీ ప్రాంతీయ పార్టీలను మాత్రం ఏమీ చేయలేకపోతోంది.
 
స్వల్ప వ్యవధి విశ్రాంతికోసం మళ్లీ అజ్ఞాతంలోకి పోతున్నట్టు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తే... ఆ పార్టీ ఆకతాయి అభిమాని ఒకరు ‘మళ్లీ రానక్కర్లేదు’ అని రీ-ట్వీట్ చేశారు. ‘విశ్రాంతి కోసం వెళ్లిన మొదటి అజ్ఞాతానికి, తాజా అజ్ఞాతానికి మధ్య కూడా విశ్రాంతే కదా!’ అని మరో క్రియాశీల కార్యకర్త వేళాకోళమాడారు. ఇది వేళాకోళం కాదు, అతికష్టం మీద జీర్ణించుకుంటున్న వాస్తవమని కాంగ్రెస్ శ్రేయోభిలాషులు పలువురు వాపోతున్నారు. భారత రాజకీయ యవనికపై ఎన్నడూ ఎరుగని లోలోతు ల్లోకి దిగజారిన కాంగ్రెస్ ఉనికి మిణుకు మిణుకుమంటోంది. పార్టీ మళ్లీ పుంజుకోవాలంటే రాహుల్‌కు పూర్తి బాధ్యతలను అప్పగించాలని ‘వీర విధేయులు’ అక్కడక్కడ గొంతెత్తుతున్నా.... అత్యధికులకు సందేహాలు న్నాయి. పార్టీ అధినేత్రి, రాహుల్ తల్లి సోనియా గాంధీ తన ఆరోగ్యం బాగోలేకపోయినా రాహుల్‌ను పార్టీ అధ్యక్షుణ్ణి చేసి, పగ్గాలను అప్పగించేం దుకు  సాహసించలేకపోతున్నారు.

రాహుల్ సారథ్య  ప్రతిభపై ఈ సొంతింటి సందేహాలకు తోడు ప్రత్యర్థి బీజేపీ, ఆరెస్సెస్ చేస్తున్న విస్తృత, వ్యూహాత్మక ప్రచారం రాహుల్‌ను ‘ఇంకా ఎదగని వాడు‘గా చూపుతోంది. ఆయన చేష్టలూ దానికి ఊతమిస్తున్నాయి. మాటల్లో ఇటీవల కొంత మెరుగుపడ్డా... మాటలకు, చేతలకు పొంతనలేనితనం ఆయన ఎదుగుదలను దెబ్బతీస్తోంది. అను భవరాహిత్యంతో తీసుకుంటున్న కొన్ని సంస్థాగత నిర్ణయాలు వివిధ రాష్ట్రాల్లో పార్టీని బలహీనపరుస్తున్నాయి. విశాల భారతంలో కాంగ్రెస్ ఒక పెద్ద రాష్ట్రం, మరో అరడజను చిన్న రాష్ట్రాలకే పరిమితం కావడానికి రాహుల్ మాత్రమే కారణం కాదు. చాలా ఇతర కారణాలూ ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు అందుకు ఉదాహరణలు. నాయకత్వలోపం, వ్యూహం, కార్యాచరణలేమి, పడిపోతున్న విలువలతో చేజారిపోతున్న ప్రజాప్రతినిధులు, మీడియాపై గట్టి పట్టున్న బీజేపీ ప్రచారం...  వెరసి కాంగ్రెస్ ప్రతిష్టను దిగజార్చాయి.

పూర్వవైభవ సాధనకు మల్లగుల్లాలు
కాంగ్రెస్ 1977లో, 1989లో ఓటమి పాలైనా ఇంతటి దయనీయ స్థితి ఏర్పడ లేదు. కాంగ్రెస్ రోజురోజుకూ ప్రజాదరణ కోల్పోవడానికి ప్రధాన కారణం పార్టీ అంతర్గత పరిస్థితేనని విశ్లేషకుల మాట. దేశంలోని ఏ ఎన్నికల్లోనైనా నేడు యువతదే కీలకపాత్ర. జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలేప్రధాన ఆధారంగా కాంగ్రెస్ నిలబడుతూ వచ్చింది. వారి పేరు, ప్రఖ్యాతులు గానీ, కాంగ్రెస్ అధినాయకత్వం పెంచి పోషిస్తున్న ‘కోటరీ’ నాయకులు గానీ యువతను ప్రత్యక్షంగా ఉత్తేజపరచే వాతావరణం నేడు లేదు. మోదీ గుజరాత్‌లో బాగా పని చేశారనే నమ్మకంతో, దేశానికి ఆయన సేవలు అవసరమని నమ్మి యువత బీజేపీకి పట్టం కట్టింది. ప్రాంతీయంగా కూడా నాయకుల సేవల్ని ప్రత్యక్షంగా చూసే వారికి పట్టం కడుతున్నారు. బాగా పనిచేస్తేనో, ప్రభావం చూపేలా ప్రచారం చేయగలిగితేనో మరోసారి అధికారం ఇస్తున్నారు. 2014 ఎన్నికల ఓటమి దేశవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణుల్లో నమ్మకాన్ని సడలించింది. పలు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల ఫిరాయింపులు ఆ పార్టీని మరింత బలహీన పరిచాయి.

2013 నుంచి కాంగ్రెస్ క్రమంగాఅన్ని రాష్ట్రాల్లోనూ అధికారం కోల్పోతూ... కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాలు నాలుగిటిలోనే సొంతంగా అధికారంలో ఉంది. బిహార్, మిజోరాం, మేఘాలయ, పుదుచ్చేరీల్లో ఇతర పార్టీలతో కలసి అధికారం పంచుకుంటోంది. 2013లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోగా 2014 తరువాత మహారాష్ట్ర, హరియాణా, అరుణాచల్‌ప్రదేశ్, అసోం, కేరళ రాష్ట్రాల్లో ఓటమి పాలయింది. వివిధ ఎన్నికల్లో ఓటమికన్నా ప్రధానమైంది కాంగ్రెస్ ఓటింగ్ శాతాలు పడిపోతుండటం. దశాబ్దాలుగా ఓటు బ్యాంకు లుగా ఉన్న వర్గాలు క్రమంగా పార్టీకి దూరమవుతున్నాయి. సీఎస్‌డీఎస్ అధ్యయనం ప్రకారం, కాంగ్రెస్‌కు సాంప్రదాయకంగా అండగా ఉండే అల్పసంఖ్యాకవర్గాలు ప్రాంతీయ పార్టీల వైపు, పేద, దళిత వర్గాలు బీజేపీ వైపు మొగ్గుతున్నాయి.   

సర్వత్రా నాయకత్వ లోపం
కాంగ్రెస్ అధ్యక్షునిగా రాహుల్ పగ్గాలు చేపట్టాలన్న నినాదాన్ని పలువురు నేతలు మరోసారి తెరపైకి తెస్తున్నారు. 2013 జైపూర్ ‘చింతన్ శిబిర్’లో రాహుల్‌ను ఉపాధ్యక్షుడ్ని చేసినా, 2014లో కాంగ్రెస్ ప్రచార సారథ్య బాధ్య తలు అప్పగించినా పార్టీ బలపడ్డ దాఖలాలు లేవు. త్వరలోనే ఏఐసీసీ సదస్సు జరిపి ఆయనకు నాయకత్వ పగ్గాలు అప్పగిస్తారని వినవచ్చింది. పార్టీ ప్రధాన కార్యదర్శులు, పీసీసీ నేతల రాజీనామాలను ఇప్పటికే తీసుకు న్నారు. పార్టీ ముఖ్యనేతగా రాహుల్ నిర్వహించిన పాత్ర ఏం లేదుగానీ ఆయన నేతృత్వంలోనే కేరళ, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో ఎదురు దెబ్బలు తగిలాయి. నేర్చుకుంటే, పార్టీకి అసోం ఓ పెద్ద గుణపాఠం. 2014లో మల్లికార్జున్ ఖర్గే పార్టీ ప్రతినిధిగా అసోం వెళ్లగా 78లో 51మంది ఎమ్మెల్యేలు నాయకత్వ మార్పును కోరారు. కానీ వీర విధేయతకే పెద్దపీఠం వేసిన నాయకత్వం వారి డిమాండ్‌ను పెడచెవిన పెట్టింది. తరుణ్ గొగోయ్‌పై పెరుగుతున్న వ్యతిరేకతను పట్టించుకోలేదు. సీఎం కుమారుడు గౌరవ్ గొగోయ్ రాహుల్ ‘బుల్లి కోటరీ’లో ముఖ్యుడు.

అసోం పరిస్థితి బాగోలేదని 2014 లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లోనే స్పష్టమైనా సరిదిద్దుకునే చర్యలు చేపట్టక హేమంత్ బిశ్వశర్మ వంటి కీలక నాయకుడ్ని పోగొట్టుకుంది. బీజేపీకి ఆయనే పెద్ద వరం అయ్యారు. 2009లో అసోంలో 7 లోక్‌సభ స్థానాలున్న కాంగ్రెస్ 2014లో 3కు పడిపోగా, అప్పటివరకు 3 స్థానాలున్న బీజేపీ కూటమి బలం 7కు పెరిగింది. అయినా ముప్పును గ్రహించలేని కాంగ్రెస్ గుడ్డి వైఖరివల్ల తాజా ఎన్నికల్లో బీజేపీ 126లో 86 స్థానాలు గెలిచింది. ‘ఓ కీలక భేటీలో సీఎం, పీసీసీ నేత సమక్షంలో పార్టీ జీవన్మరణ సమస్యపై చర్చ జరుగుతుంటే... రాహుల్, సమావేశంలోకి తన పెంపుడు కుక్కకిచ్చిన ప్రాధాన్యతను ఆ చర్చకివ్వలేద’ని బిశ్వశర్మ విమర్శించారు. రాజ కీయ నాయకుల్నిగాక, రిటైర్డ్ అధికారుల సలహాలను పాటించడం వల్లనే రాహుల్ సరైన అంచనాకు రాలేకపోతున్నారనే అభిప్రాయముంది.

అవినీతి కొంత, అసమర్థ నిర్వహణ ఇంకొంత
హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇటీవలి వరకు కేరళ ముఖ్యమంత్రిగా ఉన్న ఉమెన్ చాందీపైనా అవినీతి ఆరోపణలొచ్చాయి. కాంగ్రెస్‌లోని బలమైన నేతలంతా ఆ పార్టీతో పొసగక ఎప్పుడో ఒకప్పుడు సొంత పార్టీలు పెట్టుకుని, బలమైన ప్రాంతీయ నేతలుగా ఎదిగారు. శరద్‌పవార్, మమతాబెనర్జీ, వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి వంటి నేతలకు సరితూగేలా ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ తమ నేతలను తయారు చేసుకోలేకపోయింది. నితీష్‌కుమార్, జయలలిత, ములాయంసింగ్, నవీన్ పట్నాయక్ తరహా నేతలనూ తయారు చేసుకోలేక పోయింది.  బీజేపీ ఐదేళ్లు, పదేళ్లు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు ప్రజాదరణ పొందిన బలమైన నేతలుగా ఎదిగారు (ఛత్తీస్ గఢ్‌లో రమణ్‌సింగ్, మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్ చౌహాన్, రాజస్తాన్‌లో వసుంధర రాజే).

ఇప్పుడున్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఏ ఒక్కరూ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వారు కాకపోవడమూ ప్రతికూలాం శమే! ఒక్క కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు అంతో ఇంతో ప్రజా దరణ ఉంది. కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్రాల్లోనూ నాయకుల మధ్య ఐక్యత లేదు. తెలంగాణలో ఎన్నికల ముందే కాదు తర్వాత కూడా ఎప్పు డెప్పుడు ముఖ్యమంత్రి అవుదామా? అని ఆలోచించే చాలామంది ఉంటారు. శాసనసభలో పార్టీకి ప్రాతినిధ్యమే లేకుండాపోయిన ఏపీలోనూ హైకమాండ్ అసమ్మతి పొగ పెడు తున్నట్టు  వినవస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో అజిత్‌జోగీయే గాక, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో మూకుమ్మడిగా పార్టీ శాసన సభ్యులు పార్టీ మారడానికి కాంగ్రెస్ నాయకత్వ వైఖరే కారణం.

ప్రాంతీయ శక్తులు అంగీకరించేనా?
2013 తరువాత దేశ రాజకీయాల్లో కనిపిస్తున్న స్పష్టమైన పరిణామాలు రెండు. ఒకటి, కాంగ్రెస్ అధికారంలో ఉన్నచోట బీజేపీ ఆదిపత్యం సాధించి, తేలిగ్గా గెలుస్తోంది. అది గమనించే కావచ్చు ‘కాంగ్రెస్ రహిత భారత్’ అనే తమ నినాదాన్ని దేశ ప్రజలు ఎజెండాగా స్వీకరించారని, ఇక అదే లక్ష్యంతో పని చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గం తీర్మానించింది. అయితే, బీజేపీ సైతం ఏదైనా ప్రాంతీయ పార్టీ బలంగా ఉంటే ఓడిపోతోంది. రెండు, ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నచోట కాంగ్రెస్‌కు గానీ, బీజేపీకి గానీ స్థానం దొరకటం లేదు. ఢిల్లీ, బిహార్,బెంగాల్, తమిళనాడు అందుకు ఉదాహర ణలు. కాంగ్రెస్ తప్ప మరే  పార్టీ బలంగా లేని మధ్యప్రదేశ్, రాజస్థాన్, అసోం, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్‌పై బీజేపీ అవలీలగా నెగ్గింది. అంటే కాంగ్రెస్ స్థానాన్ని బీజేపీ భర్తీ చేస్తూ వస్తోంది, తాను అధికారంలో ఉన్న చోట నిలదొక్కు కుంటోందే గానీ ప్రాంతీయ పార్టీలను మాత్రం ఏమీ చేయలేకపోతోంది. భవిష్యత్తులో ఇదే సమీకరణం తలకిందులై బీజేపీ స్థానాన్ని కాంగ్రెస్ భర్తీ చేసినా చేయొచ్చు.
అయితే కాంగ్రెస్ పడి లేచే కెర టంగా మారుతుందా? అంటే ఏమో...! కాదని చెప్పలేకపోయినా, అవునన గల ధీమా లేదు.. 2014 ఎన్నికలకు ఒక ఏడాది ముందువరకు బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని అంతా భావించారు. కానీ, అకస్మాత్తుగా నరేంద్ర మోదీ తెరపైకి వచ్చారు. ఆ తదుపరి ఎన్నికల్లో ఎక్కడ కాంగ్రెస్ ఉంటే అక్కడ బీజేపీ గెలుస్తుండటాన్ని ప్రాంతీయ పార్టీలు నిశితంగా గమనిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తమకు మంచి అవకాశాలను కల్పించే రాజకీయ శూన్యత ఉందని అవి భావిస్తున్నాయి. 2019 ఎన్నికల కోసం వారంతా జట్టు కట్టే ఆస్కారం ఉంది. ఎన్డీఏకు వ్యతిరేక ఓట్లు చీలొద్దనుకుంటే అవి కాంగ్రెస్ వైపు చూడాల్సి రావచ్చు. కానీ, బలహీనపడుతున్న కాంగ్రెస్‌తో జట్టు కట్టడానికి అవి అంగీ కరిస్తాయా? అన్నది పెద్ద ప్రశ్న. లేకపోతే అవి కాంగ్రెస్ రహిత ప్రత్యామ్నాయ (మూడో) శక్తిగా ఆవిర్భవిస్తాయేమో వేచి చూడాల్సిందే.

గత కొన్ని దశాబ్దాలుగా దేశ రాజకీయాల్లో వ్యతిరేక ఓటు ప్రభావం విపరీతంగా ఉంది. విధానాల్లో పెద్ద వ్యత్యాసం ఉండట్లేదు. విపక్షాలు నచ్చడం కన్నా, పాలకపక్షాల పట్ల వ్యతిరేకతే నిర్ణాయకంగా మారుతోంది. గాల్లో దీపంలా మినుకు మినుకుమంటున్న కాంగ్రెస్, అటువంటి ఆశావహ దృక్పథంతోనే ముందుకు సాగుతుందా? నిజంగానే పార్టీ పరిస్థితిని మెరుగు పరచుకోగలదా? అన్నది కాలమే తేల్చాలి.
 

దిలీప్ రెడ్డి
 ఈమెయిల్: dileepreddy@sakshi.com

మరిన్ని వార్తలు