మద్యనిషేధం అమలులో ఆదినుంచీ వంచనే...!

10 Apr, 2016 03:32 IST|Sakshi
మద్యనిషేధం అమలులో ఆదినుంచీ వంచనే...!

అవలోకనం
గోవధ నిషేధం మాదిరిగా మద్య నిషేధం కూడా వాస్తవానికి ఒక సంస్కృతీకరణ చర్య అని సుప్రసిద్ధ సామాజిక శాస్త్రవేత్త ఎంఎన్ శ్రీనివాస్ పేర్కొన్నారు. దీనికి ఎలాంటి సమర్థన చేసినా సరే.. నిషేధం, నిరోధాజ్ఞ అనేవి బ్రాహ్మణిక, అగ్రకుల స్పర్శ నుంచే వచ్చాయన్నది ఆయన ఉద్దేశం. అందుకే గోమాంస నిషేధం, మద్య నిషేధం అనే రెండు అంశాలపై భారత రాజ్యాంగ నిర్మాతలు 1948 నవంబర్ 24న అంటే ఒకే రోజునే చర్చించారంటే ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.

భారత్‌లోని మరొక రాష్ట్రం బిహార్ తాజాగా మద్యంపై నిషేధాన్ని అమలు చేస్తోంది కాబట్టే నేనిది రాస్తున్నాను. గుజరాత్, ఈశాన్య భారత్‌లోని కొన్ని రాష్ట్రాల సరసన నిలబడుతూ కేరళ రాష్ట్రం కూడా ఇప్పటికే ఈ మార్గంలోనే వెళుతోంది. బిహార్‌ను ప్రస్తుతం నితీష్ కుమార్ పాలిస్తున్నారు. లోహియావాదమే తన భావజాలమని ఆయన ప్రకటించారు. అంటే రామ్‌మనోహర్ లోహియా తీసుకువచ్చిన భావజాల మన్నమాట. నావద్ద లోహియా సంకలిత రచనలకు సంబంధించిన 9 సంపుటాలు ఉన్నాయి. వీటిలో సాధారణ ప్రస్తావనలుగా తప్ప మద్య నిషేధం గురించి పెద్దగా పేర్కొన్నట్లు లేదు.

అయితే గాంధీలాగా మద్యపానం ఎంత భయానకమైంది అనే అంశంపై లోహియా లెక్చర్లు దంచలేదు. తన రచనల్లో ఒక చోట మాత్రమే (6వ సంపుటి), భారత రాష్ట్రపతి కలకత్తా క్లబ్ పోషకుడిగా ఉంటున్నందుకు ఆయనపై తీవ్రంగా విమర్శించారు. ఈ క్లబ్ ముఖ్యమైన పని ద్రాక్ష సారాను సేవించడంపైనే ఉంటోందని లోహియా రాశారు. అయితే ఆయన లేవనెత్తిన అంశం కపటత్వంపైనే కానీ నైతికవాదంపై కాదు. మద్య నిషేధ గణతంత్ర దేశానికి రాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి మద్యాన్ని సేవించే క్లబ్ పోషకుడిగా ఉండటం అనేది వంచన, విశ్వాస ఘాతుకం కిందికే వస్తుందని లోహియా అన్నారు.

దేశవ్యాప్తంగా అగ్రకులాలు మద్యాన్ని సేవిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. బహుశా లోహియాకు ప్రపంచంలో ఎక్కడా మద్యపాన నిషేధం విజయ వంతం కాలేదని తెలిసి ఉండవచ్చు. మద్య నిషేధం మూడు ప్రాథమిక ఫలితా లను అందిస్తుంది. అవి.. ఆల్కహాల్ ఆర్థికవ్యవస్థను అజ్ఞాతంలోకి పంపడం (అంటే ప్రభుత్వానికి ఆదాయం లేకుండా చేస్తుంది), మామూలుగా తాగేవారిని నేరస్తులను చేయడం. పోలీసులను కూడా నేర చర్యల్లోకి దింపడం.

అమెరికాలో 1920లలో అమలు చేసిన మద్యనిషేధం అల్ కపోనే వంటి బడా మాఫియా ముఠా నేతలను సృష్టించింది. ఇతడు చికాగో వంటి నగరాల్లో పోలీసు యంత్రాంగాన్నే అవినీతి ఊబిలోకి నెట్టేశాడు. ఇక మద్యనిషేధాన్ని దశాబ్దాలుగా అమలు చేస్తున్న గుజరాత్‌లో మద్యం ఎక్కడ చూసినా అందుబాటులో ఉంటోంది. కారణం.. దాని అమలుకు సంబంధించిన ప్రతి స్థాయిలోనూ పోలీసులు రాజీపడి పోయారు. సంపూర్ణ మద్యనిషేధం అసాధ్యం కాబట్టే ప్రభుత్వం ఉద్దేశపూర్వ కంగానే మినహాయింపులను కల్పించింది. ఇక గుజరాత్ మధ్యతరగతి ప్రజలు మద్యపాన అనుమతులు తెచ్చుకుంటున్నారు. అంటే ఆరోగ్య కారణాలతో మద్యం సేవించడానికి వీరికి అనుమతిస్తారు. ఇదంతా వంచనతో కూడుకున్నదే. పాకిస్తాన్‌లోని కరాచీ నగరంలో ప్రభుత్వం లెసైన్సుతో నిర్వహిస్తున్న  లిక్కర్ షాపులను చూసి నేను ఆశ్చర్యపోయాను. ఈరోజు ఒక భారతీయ పర్యాటకుడు పాకిస్తాన్‌లో చట్టబద్ధంగా మద్యం సేవించగలడు కాని గుజరాత్‌లో అది చెల్లదు. ఇది గమనించాల్సిన విషయంగా నాకు అనిపించింది.

మద్య నిషేధం విఫలమవుతున్నప్పుడు, మరింత మెరుగైన నైతిక సమా జాన్ని సృష్టిస్తామనే విశ్వాసంపై ఆధారపడి ప్రభుత్వాలు మద్య నిషేధాన్ని సాధి స్తామని పదే పదే ఎందుకు చెబుతూ వస్తున్నట్లు? ఇది కూడా బూటకపు వాదనే. మద్యనిషేధమన్నదే లేని యూరప్ దేశాలకేసి, అలాగే పలుదేశాల్లో మద్యనిషేధం అమల్లో ఉన్న అరబ్ ప్రపంచంకేసీ చూడండి. వీటిలో ఏవి మరింత నీతివంతమైన, మెరుగైన సమాజాలు? వీటిలో ఏ ప్రపంచాన్ని భారత్ అనుసరించదలుస్తోంది?

గోమాంస భక్షణకు వ్యతిరేకంగా వాదించడం అనేది 1948లో రెండు ముఖా లను కలిగి ఉండేది. మొదటిది. ఆర్థిక కారణాలతో గోవధను నిషేధించాలని ప్రొఫెసర్ షిబ్బాన్ లాల్ సక్సేనా వంటి సభ్యులు ఆనాడు ఒత్తిడి పెట్టేవారు. (అది ఇప్పుడు తప్పు అభిప్రాయంగా రుజువైందనుకోండి). ఆనాడు పశువులు ఒక సంవదగా ఉండేవి. ఆవు పాలకు, ఎద్దు నేల దున్నడానికి ఉపయోగపడే సంపదగా ఉండేవి. కానీ యాంత్రికీకరణ, ట్రాక్టర్లు ఈ వాదనను అసంగతమైనవిగా తోసిపడే శాయి. నేడు కొద్దిమంది రైతులు మాత్రమే ఎద్దులతో భూమిని దున్నుతున్నారు.

సెంట్రల్ ప్రావిన్స్, బీరర్‌కు చెందిన డాక్టర్ రఘువీర దీనికి సంబంధించి వాస్తవ వాదనను అందించారు. దీనంతటికీ మూలం హిందూ ధర్మలో ఉందని, దాని ప్రకారం బ్రహ్మహత్య, గోహత్య అనేవి సమానమైనవని ఆయన చెప్పారు. ఒక విజ్ఞుడిని, శాస్త్ర పండితుడిని (అంటే బ్రాహ్మణుడు అన్నమాట) చంపడమనేది ఒక గోవును చంపడంతో సమానమైన శిక్షకు పాత్రమైనది అని దీని అర్థం.
 రాజ్యాంగ పరిషత్తులో నాటి ఆ చర్చను మద్యనిషేధంపై కూడా కొనసాగిం చాలని ఇప్పుడు హిందుత్వ ప్రయత్నిస్తోంది. మద్యపానం మన స్మృతులు పేర్కొన్న ఐదు భయంకర పాపకార్యాల్లో ఒకటని బాంబేకి చెందిన బీజీ ఖేర్ చెప్పారు. కానీ అవే స్మృతులు గుజరాత్‌లోని పటేళ్లను చదవడం, రాయడం నుంచి నిషేధించేశాయి. మనం దాన్ని కూడా అంగీకరిద్దామా? ఇలాంటి ముతక ఆలోచ నలు ఉన్నప్పటికీ, మనం ఒక మంచి రాజ్యాంగాన్ని పొందిన అదృష్టవంతులమని ఆమోదించాల్సి ఉంటుంది.

ఇద్దరు అద్వితీయ వక్తలు మద్యనిషేధాన్ని వ్యతిరేకించారు. కొల్హాపూర్‌కి చెందిన బీహెచ్ ఖర్డేకర్ తన తొలి ప్రసంగం చేస్తూ, అన్ని సామాజిక వర్గాలూ మద్య నిషేధాన్ని కోరుకుంటున్నాయన్న వాదన సమాజంలో  ఉందని గుర్తు చేశారు. ఆ జాబితాలో పార్సీలు, క్రైస్తవులు కూడా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అయ్యా! పార్సీలు, క్రైస్తవుల గురించి నాకూ కొంతమేరకు తెలుసు. ఖచ్చితంగా వీరు మద్యనిషేధానికి అనుకూలురు కారని నేనుకుంటున్నాను.

అలాగే బిహార్‌కు చెందిన జస్పాల్ సింగ్ కూడా మద్యనిషేధాన్ని వ్యతిరేకిం చారు. సాంప్రదాయికంగా మద్యం తయారు చేస్తూ మద్యాన్ని సేవిస్తున్న ఆదివా సులకు అనుకూలంగా ఆయన మాట్లాడారు. మరికొన్ని అంశాలను కూడా ఆయన పేర్కొన్నారు. కానీ, అయ్యా! ఈ దేశంలోనే అత్యంత పురాతన వాసుల మతప రమైన హక్కుల్లో మనం జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని మాత్రమే నేనిక్కడ చెప్పదలుచుకుంటున్నాను. అదే సమయంలో శైవ మతాన్ని అనుసరిస్తూ గంజాయిని భంగుగా, చరస్‌గా సేవిస్తున్న హిందువులకు కూడా ఇదే వర్తిస్తుందని నేను చెప్పదలిచాను. సంస్కృతీకరణ ప్రవృత్తి కారణంగా గంజాయి సేవనం కూడా నేడు నేరమయంగా మారిపోయింది.

గుజరాత్‌లో విఫలమైనట్లుగానే బిహార్‌లో కూడా మద్యనిషేధం అంతిమంగా విఫలమై తీరుతుంది. అది ఒక చట్టంలా మిగిలే ఉంటుంది. కానీ మద్యపానప్రి యులు ఆ చట్టాన్ని పక్కదోవలు పట్టించే మార్గాన్ని కనుగొంటారు, పోలీసులు నేరమయ చర్యల్లోకి దిగజారిపోతారు. ఇక ప్రభుత్వం తన వంతుగా ఆదాయాన్ని కోల్పోతుంది. ప్రతి ఒక్కరూ తమ వంతును కోల్పోతారు. కానీ తాము మాత్రం సరైన పని చేయడానికే ప్రయత్నిస్తున్నామని లోహియావాదులు భావిస్తుండవచ్చు.
 

వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ఆకార్ పటేల్
 aakar.patel@icloud.com

మరిన్ని వార్తలు