అంతా మోదమే

25 May, 2015 23:49 IST|Sakshi
అంతా మోదమే

దారిద్య్ర నిర్మూలనపైనే దృష్టి సగానికి తగ్గిన ద్రవ్యోల్బణం నీతి ఆయోగ్ ఆవిర్భావం స్వచ్ఛ భారత్ మహాయజ్ఞం
ముద్రా బ్యాంకు ఏర్పాటు జన్‌ధన్ యోజనకు శ్రీకారం స్మార్ట్ నగరాలకు పచ్చజెండా పెరిగిన విద్యుదుత్పాదన  ఇనుమడించిన దేశ ప్రతిష్ట రోడ్ల నిర్మాణం వేగవంతం

 
 దేశంలో ఉన్న 60 శాతం పేదరికాన్ని, 30 శాతానికి తగ్గించడానికి ఏడు దశాబ్దాలు పట్టింది. మిగిలిన సగాన్ని నిర్మూలించడానికి మరో డెబ్బయ్ సంవత్సరాలు కావాలా? ఇది మోదీ వేసుకున్న చరిత్రాత్మకమైన ప్రశ్న.
 
ఆరెస్సెస్ పేరు వింటేనే చాలా వర్గాల నుంచి విమర్శల నిప్పులు కురు స్తాయి. అలాంటి సంస్థలో ఆయన పూర్తిస్థాయి కార్యకర్త. భారత ముస్లింలు సరే, అసలు ఉపఖండ ముస్లింల ఆలోచనలలో మార్పునకు మార్గంవేసినదిగా పేర్గాంచిన అయోధ్య రథికులలో ఆయన ఒకరు. ప్రపంచస్థాయిలో హక్కుల పరిరక్షణ సంస్థల నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కొన్న గోధ్రా రైలు దగ్ధం ఘటన ఆయన పాలనలోనే చోటు చేసుకుంది. ఆయన నరేంద్రభాయ్ దామో దర్ మోదీ. అయినా ఆయన భారత ప్రధాని కావడం దేశ రాజకీయాలలో పెను మలుపు. ప్రపంచానికి ఆయన విజయం ఓ అద్భుతమన్నా అతిశయోక్తి కాదు. మోదీ ఈ సంవత్సరానికిగాను సీఎన్‌ఎన్-ఐబీఎన్ ఎంపిక చేసిన ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’ కావచ్చు. కానీ ఆయనను విమర్శించడానికి వచ్చే ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోని మీడియా ఇక్కడే ఉంది. కాబట్టి ఆయన ఏడాది పాలనపై మదింపునకు అవకాశం వచ్చినపుడు విమర్శలు వెల్లువెత్త కుండా ఉంటే, అది వింతల్లో వింత. ఎవరి మీదనైనా విమర్శలనూ, ఆరోపణ లనూ కప్పిపుచ్చనక్కరలేదు. అది ప్రజాస్వామ్యానికి ద్రోహం చేయడమే. అలాగే మూడు దశాబ్దాల తరువాత ప్రజల నుంచి పూర్తి మెజారిటీ సాధించిన దేశాధినేత సాధించినదేమైనా ఉంటే, దానిని గుర్తించడానికే నిరాకరించడం అంతకుమించిన ప్రజాస్వామ్యద్రోహం. దేశాభివృద్ధి అంటే ప్రధానమంత్రి ఇంటి కార్యమన్నట్టూ, ఇంకా చెప్పాలంటే వందలమంది అధికారుల, విమ ర్శలకు అతీతులైన ఇతర నేతల సమష్టి కృషి అన్న వాస్తవాన్ని విస్మరించేటట్టూ వ్యవహరించడం కూడా అప్రజాస్వామికమే. ఏ పార్టీ, ఏ నేత సాధించినప్ప టికీ అభివృద్ధి అనేది ప్రజాధనంతో, రాజ్యాంగ పరిధిలో జరిగిన యజ్ఞం. ఆ దృష్టితో నరేంద్ర మోదీ ఏడాది పాలనలో దేశం సాధించిన పురోగతిని అవలో కించాలి. మంచి ఉంటే చెప్పాలి. అభ్యంతరాలు వెల్లడించాలి.
 ఈ దారిలో

►  పన్నెండు మాసాలలో ప్రధాని మోదీ 18 దేశాలలో పర్యటించారు. దీనితో ప్రపంచ దేశాలతో భారత్ సంబంధాలు పటిష్టమైనాయని పార్టీ, నిపుణులు ప్రకటించారు.

► సమాఖ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికే నీతి ఆయోగ్‌ను ప్రవేశపెట్టినట్టు ప్రభుత్వం చెప్పింది. బొగ్గు వేలం ద్వారా లభించే ఆదాయం రాష్ట్రాలకు వెళ్లాలని ఆశిస్తోంది. అదే సమయంలో 14వ ఆర్థిక సంఘం సిఫారసులను కూడా ఆమోదించింది. దీనితో రాష్ట్రాల ఆర్థిక స్వయం ప్రతిపత్తి పెరుగుతుంది.

►   దర్యాప్తు సంస్థల దుర్వినియోగం ఇక గతం. నల్లధనం వెలికితీతకు భవి ష్యత్తులో మరిన్ని చట్టాలు రూపొందించాలని ఎన్‌డీఏ-2 భావిస్తోంది.

► సుపరిపాలన మీద దృష్టి. వ్యవసాయంలో ముఖ్యంగా, నీటి పారుదల రంగం మీద; గ్రామీణ మౌలిక వసతుల కల్పన రంగంలోను ప్రభుత్వ పెట్టుబడులను విస్తరించాలని మోదీ ఆలోచన.
 
పాలనా రంగం మీద కొత్త దృష్టి

 ‘కాంగ్రెస్ ముక్తి భారత్’ వంటి నినాదంతో, పూర్తి ఆధునిక సాంకేతిక పరి జ్ఞానంతో ఎన్నికల రణం చేసి అధికారంలోకి వచ్చారు మోదీ. ఇప్పుడు రాజ్య మేలుతున్న రాజకీయ సంస్కృతి పూర్తిగా మారాలన్న దృక్పథం దేశవాసులలో పుష్కలంగా ఉన్న కాలంలో ఈ పరిణామం జరిగింది. ఢిల్లీలో ఆప్ రాజకీ యాలూ, వాటికి లభించిన స్పందన ఇందుకు అద్దం పట్టాయి. అవినీతి, బంధుప్రీతి, జవాబుదారీతనం లోపించడం, పేదరికాన్ని రాజకీయానికి పెట్టు బడిగా మార్చుకునే నీచత్వం, కుహనా లౌకికవాదంతో జరుగుతున్న దగా, జాతీయ సమగ్రతనూ, భద్రతనూ గాలికి వదిలేసే నిర్లక్ష్యం దేశాన్ని అతలా కుతలం చేస్తున్న కాలంలో ప్రజలు మోదీకి ఓటు వేశారు. బీజేపీ సంగ తేమో కానీ, దేశ ప్రజలు మోదీలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయాన్ని చూశారు.

వివాదా స్పదుడే అయినా, అవినీతి మచ్చ లేకపోవడం మోదీకి కలసివచ్చిన అంశం. కాంగ్రెస్‌లో అనేకమంది వివాదాస్పదులు. మచ్చలేనివారు మిగల లేదు. అందుకే మోదీ మేలని అనిపించారు. పైగా జీరో రాజకీయ అవినీతి మీద పట్టుదల ఉన్నవాడు. ఇంతవరకు అది రుజువు చేసుకున్నారు కూడా. 21వ శతాబ్దం గురించి పదే పదే చెప్పినా, దేశానికి అలాంటి రూపును ఇవ్వడంలో రాజీవ్‌గాంధీ దారుణంగా విఫలమయ్యారు. నిజానికి అలాంటి రూపు కొంత వరకు పీవీ నరసింహారావు ద్వారా సాధ్యమైంది. కానీ కాంగ్రెస్ అవినీతి ఆయన విజయాలను, ఫలితాలను అచిరకాలంలోనే కాలగర్భంలోకి నెట్టి వేసింది. కాబట్టే మోదీలో కొత్త ‘రాజకీయ ముఖాన్ని’ దేశ ప్రజలు చూశారు. తొలినాటి ప్రధానులూ, ప్రణాళికా నేతలూ, రాష్ట్రపతులూ ప్రవేశ పెట్టిన పథ కాలను, పంథాలను ఏళ్ల తరబడి అరమోడ్పు కళ్లతో భక్తిగా కొనసాగించడం కాదు, కాలపరీక్షకు నిలబడని వ్యవస్థలను సగౌరవంగా తప్పించేందుకు మోదీ చేసిన సాహసమే మేధావులను ఆయన వైపు మొగ్గేటట్టు చేసింది.

► పన్నెండు మాసాల మోదీ పాలనలో ద్రవ్యోల్బణం సగానికి తగ్గింది. వృద్ధిరేటు ఏడు శాతానికి పురోగమిస్తున్నది.
►  17,830 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యాన్ని అధిగమించి, 22,566 మెగావాట్లను సాధించారు.
► కాంగ్రెస్ నత్తనడక పాలన పుణ్యాన ఇటీవల వరకు రోడ్డు నిర్మాణం రోజుకు రెండు కిలోమీటర్లకు పరిమితం కాగా, ఇప్పుడు అది పది కిలో మీటర్లకు పుంజుకుంది.
► మోదీ పార్లమెంటులో ఇచ్చిన తొలి ఉపన్యాసంలో పేర్కొన్న దారిద్య్ర నిర్మూలనకు ఆయన కట్టుబడి ఉన్నట్టు ఈ చర్యలతో భావించవచ్చు. స్వాతంత్య్రం తెచ్చుకున్న నాటికి దేశంలో ఉన్న 60 శాతం పేదరికాన్ని, 30 శాతానికి తగ్గించడానికి ఏడు దశాబ్దాలు పట్టింది. మిగిలిన సగాన్ని నిర్మూలించడానికి మరో డెబ్బయ్ సంవత్సరాలు కావాలా? ఇది మోదీ వేసుకున్న చరిత్రాత్మకమైన ప్రశ్న. వాస్తవానికి ఈ ప్రశ్నకే భవిష్యత్తు సరైన సమాధానం కోరుతోంది. ఇది సాధిస్తేనే మోదీ విజయం నిజంగా చరిత్రా త్మకం అవుతుంది.  
► జన్‌ధన్ యోజన ద్వారా 15 కోట్లకు పైగా ప్రజలకు బ్యాంకు సేవలను అందుబాటులోకి తెచ్చారు. పింఛన్ తదితర సౌకర్యాలు కల్పిస్తూ పది కోట్ల రూపే కార్డులను మోదీ ప్రభుత్వం ఇచ్చింది.
► రూ. 20,000 కోట్ల మూలధనంతో ముద్రా బ్యాంకు ఏర్పాటయింది. రూ. 50,000 మొదలు పది లక్షల పెట్టుబడులతో వ్యాపారాలు చేయదలచిన వారికి ఈ బ్యాంకు రుణాలు ఇస్తుంది. 5.7 కోట్ల మంది చిన్న వ్యాపారు లకు సాయం అందించడమే దీని లక్ష్యం. అటల్ పెన్షన్ ఆయోజన వంటి సామాజిక భద్రత పథకాల ఏర్పాటు.
► స్వచ్ఛభారత్ మిషన్ కింద 2019 నాటి దేశంలో సంపూర్ణ పారిశుధ్యాన్ని సాధించడానికి కార్పొరేట్ రంగం హామీ ఇచ్చింది.  
► వంట గ్యాస్ పంపిణీని డెరైక్ట్ క్యాష్ బెనిఫిట్ పథకం కిందకు తెచ్చారు. దీనితో సంవత్సరానికి ఐదు బిలియన్ డాలర్ల మేర రాయితీలు తగ్గాయి.
► రక్షణ, బీమా, రైల్వే మౌలిక వ్యవస్థలోకి 49 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబ డులకు అవకాశం కల్పించడం మేలేనని నిపుణుల అంచనా. హైస్పీడ్ రైళ్లను ప్రవేశ పెట్టడంతో సహా ఐదేళ్ల కాలంలో రైల్వేల మీద 130 బిలి యన్ డాలర్లు ఖర్చు చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది.
► వంద స్మార్ట్ నగరాల నిర్మాణానికి మంత్రి మం డలి ఆమోదించింది.
► కొత్త చట్టాలను ఆమోదింపచేయడం ద్వారా గనుల రంగంలో ఏర్పడిన ప్రతిష్టంభనను నిరోధించింది. బొగ్గుగనుల, మొబైల్ టెలిఫోనీకి చెందిన టెలికం స్పెక్ట్రమ్ వేలాలను మోదీ సర్కారు దిగ్విజయంగా పూర్తి చేసింది.
► ఉక్కు, బొగ్గు, విద్యుత్ రంగాల పథకాలకు అనుమతుల కోసం ఏకగవాక్ష విధానాన్ని ప్రవేశపెట్టారు. త్వరితగతిన నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా మంత్రుల బృందాల విధానాన్ని మోదీ రద్దు చేశారు.
► వ్యవసాయ సాధనాల ధరల స్థిరీకరణకూ, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికీ నిధి.
 
సవాళ్లూ ఎక్కువే


మోదీ అధిగమించవలసిన సవాళ్లు కూడా తక్కువేమీ కాదు. ఎన్‌డీఏ-1లో పెట్టుబడుల ఉపసంహరణ మంత్రిత్వ శాఖను నిర్వహించిన అరుణ్‌శౌరి ఇటీవలనే మోదీ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలే చేశారు. ఈ ప్రభుత్వానికి దిశానిర్దేశం ఏదీ లేదని ఆయన ఆరోపణ. అలాగే బీజేపీ సిద్ధాంతకర్త గోవిం దాచార్య యూపీఏకూ, ఎన్‌డీఏకూ భేదం లేదని విమర్శించారు. ఇక అత్యంత దారుణమైన విమర్శలు ఎదుర్కొంటున్న అంశం- భూసేకరణ బిల్లు. రాజ్యసభలో బలం లేని మోదీ సర్కారు ఈ బిల్లును ఎలా ఆమోదింప చేస్తుందో, ఎలా గట్టెక్కుతుందో చూడాలి. ఇందుకు బీజేపీ అనుబంధ రైతు సంఘం కిసాన్ మోర్చా కూడా వ్యతిరేకమే మరి.
 
కల్హణ
 
 

మరిన్ని వార్తలు