ధూమ్ ధామ్‌గా.. | Sakshi
Sakshi News home page

ధూమ్ ధామ్‌గా..

Published Mon, May 25 2015 11:43 PM

ధూమ్ ధామ్‌గా.. - Sakshi

అదిరిపోయేలా అవతరణ వారోత్సవాలు
వాడవాడలా జెండా పండుగ
ఆవిర్భావ వేడుకకు శాశ్వత వేదికగా సరూర్‌నగర్ స్టేడియం
వీఎం హోమ్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ ఫుడ్‌ఫెస్టివల్
వికారాబాద్‌లో ఉత్సవాల ముగింపు
విశిష్ట వ్యక్తులకు పురస్కారాలు
‘సాక్షి’తో కలెక్టర్ రఘునందన్‌రావు

‘‘వాడవాడలా జెండాల రెపరెపలు... విద్యుద్దీపాల కాంతులు... తారాజువ్వల సందడి.. నోరూరించే సంప్రదాయ వంటకాలు.. సాంస్కృతిక, కళా సౌరభాల సంబరాలతో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఆవిర్భావ వేడుకలకు రంగం సిద్ధం చేశాం. ఈ వారోత్సవాలను ధూమ్‌ధామ్‌గా నిర్వహిస్తాం’’ అని కలెక్టర్ రఘునందన్‌రావు తెలిపారు. సోమవారం ‘సాక్షి’ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు సంబంధించిన వివరాలు ఆయన మాటల్లోనే..
 
ఊరూరా జాతీయ పతాకాల ఆవిష్కరణ
అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం. ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ విద్యుద్దీపాలతో అలంకరిస్తాం. గ్రామ పంచాయతీ మొదలు జిల్లాస్థాయి వరకు ప్రతి కార్యాలయంపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తాం. జిల్లాస్థాయి వేడుకలకు సరూర్‌నగర్ స్టేడియాన్ని శాశ్వత వేదికగా నిర్ణయించాం. పోలీసుల కవాతు.. సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశాం. శకటాల ప్రదర్శనపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
 
విక్టోరియా హోమ్‌లో ఘుమఘుమలు
జూన్ రెండో తేదీ సాయంత్రం ఉత్సవాలను కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్ గ్రౌండ్‌లో నిర్వహించనున్నాం. అమరుల త్యాగాలను మననం చేసుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ రుచులు మేళవించేలా ఫుడ్ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేస్తున్నాం. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వంటకాల ప్రదర్శన ఉంటుంది. ‘తెలంగాణ ఆట- పాట కళావైభవం’ చాటి చెప్పేలా అ ర్ధరాత్రి వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆ తర్వాత ఉత్సవాలు అంబరాన్ని తాకేలా తారాజువ్వలు... టపాసులు కాలుస్తూ సంబరాలను తారస్థాయికి తీసుకెళతాం.
 
వికారాబాద్‌లో ముగింపు ఉత్సవాలు
తెలంగాణ ఉత్సవాలు వెల్లివిరిసేలా జూన్ 3, 4, 5వ తేదీల్లో జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలను న్విహిస్తాం. కళలు ఉట్టిపడేలా.. సంప్రదాయం పరిఢవిల్లేలా మండల, డివిజన్ స్థాయిల్లో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశాం. ఇక ముగింపు ఉత్సవాలకు వికారాబాద్‌ను ఎంచుకున్నాం. గ్రామీణ ప్రాంతంలో కూడా పండగ సందడిని తలపించేలా 5, 6 లేదా 6, 7వ తేదీల్లో వికారాబాద్‌లో ధూమ్‌ధామ్‌గా నిర్వహిస్తాం. విశిష్ట సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారులతో శోభాయాత్ర చేస్తాం.
 
‘సేవ’కులకు సన్మానం
అమరుల త్యాగాలను జ్ఞాపకం చేసుకునేలా సాంస్కృతిక, సంగీత, సాహిత్య రంగాల్లో ప్రతిభా పాటవాలను ప్రదర్శించిన కళాకారులను గౌరవించనున్నాం. జ్ఞాపికలు, ప్రోత్సాహక నగదుతో పాటు పురస్కారాలను అందజేయనున్నాం. మండల స్థాయిలో 11 మంది, మున్సిపల్  పరిధిలో 10 మంది, జిల్లా స్థాయిలో 17 మందిని సత్కరించనున్నాం. అవార్డుల ప్రదానం, ఉత్సవాల నిర్వహణకు జిల్లావ్యాప్తంగా రూ.85 లక్షలు ఖర్చు చేస్తున్నాం.
- సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి

Advertisement
Advertisement