‘రేషన్’లో అక్రమాలు

25 May, 2015 23:54 IST|Sakshi
‘రేషన్’లో అక్రమాలు

సాక్షి, రంగారెడ్డి జిల్లా : ప్రజా పంపిణీ వ్యవస్థలో క్షేత్రస్థాయి అక్రమాలకు కళ్లెం వేసేందుకు సర్కారు చర్యలకు ఉపక్రమించింది. సరుకుల పంపిణీలో కీలకమైన రేషన్ డీలర్ల మాయాజాలానికి తెరవేసేందుకు ఆకస్మిక తనిఖీలకు నడుంబిగించింది. జాయింట్ కలెక్టర్ మొదలు.. జిల్లా పౌరసరఫరాల అధికారి, సహాయ పౌరససరఫరాల అధికారి, సివిల్ సప్లై ఇన్‌స్పెక్టర్లంతా కలిసి ఇరవై బృందాలుగా ఏర్పడి సోమవారం మూకుమ్మడిగా తనిఖీలు చేపట్టారు. మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని 75 దుకాణాలను పరిశీలించారు.

ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో అక్రమంగా కొనసాగుతున్న డీలర్లు.. ప్రజలకు పంపిణీ చేసే సరుకులు బొక్కేసిన నిర్వాహకుల బాగోతాలు వెలుగుచూశాయి. రేషన్ దుకాణాల్లో బినామీలు పాతుకుపోయినట్లు యంత్రాంగం గుర్తించింది. సోమవారం మల్కాజిగిరి డివిజన్లో 75 దుకాణాలను తనిఖీ చేయగా అందులో పది శాతం బినామీలే ఉన్నట్లు అధికారులు తేల్చారు. వీరిపై పౌరసరఫరాల చట్టం ప్రకారం సెక్షన్7, 407 కింద క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు. అదేవిధంగా మరికొన్ని దుకాణాల్లో సరుకుల పంపిణీ తర్వాత మిగులు సరుకుల కోటాలోనూ భారీ వ్యత్యాసాన్ని గుర్తించారు. వారిపైనా కఠిన చర్యలు తీసుకోనున్నట్లు జాయింట్ కలెక్టర్ కాట ఆమ్రపాలి ‘సాక్షి’తో పేర్కొన్నారు.
 
ఇకనుంచి తనిఖీలే  తనిఖీలు..
రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాల గుట్టు తేల్చేందుకు జిల్లా వ్యాప్తంగా వరుసగా వారం రోజుల పాటు తనిఖీల ప్రక్రియ కొనసాగించాలని యంత్రాంగం నిర్ణయించింది. అదేవిధంగా వచ్చే నెల నుంచి క్రమం తప్పకుండా తనిఖీలు చేపట్టి దుకాణాల్లో సరుకుల పంపిణీపై పకడ్బందీ నిఘా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో పట్టణ ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి 8వరకు తనిఖీలు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి 11వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు తనిఖీ చేస్తారు.

>
మరిన్ని వార్తలు