ఏకవీరునికి చెప్పక తప్పని నిజం

22 Aug, 2015 00:23 IST|Sakshi
ఏకవీరునికి చెప్పక తప్పని నిజం

మోదీలో ఎన్ని సుగుణాలున్నా ఆయన ప్రభుత్వం పనితీరు అస్తవ్యస్తంగా ఉందెందుకు? వివాదాస్పదమైనవి కాని గంగానది శుద్ధి, స్వచ్ఛభారత్‌ల నుంచి మేక్ ఇన్ ఇండియా వరకు ఆయన గొప్ప ఆలోచనలన్నీ ఎందుకు కొట్టుకుపోతున్నాయి? ఆర్థిక వృద్ధి ఎందుకు పుంజుకోవడం లేదు? ఓ ఆర్డినెన్స్‌తో కొత్త భూసేకరణ చట్టాన్ని తేవాలని ప్రయత్నించడం వంటి ఘోర వ్యూహాత్మక తప్పిదం ఆయన ఎలా చేశారు? యాకూబ్ మెమన్ ఉరిశిక్షపై చానళ్లకు నోటీసులను పంపి వార్తా మాధ్యమంపైనే ఆయన ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందన్నట్టు ఎందుకు కనిపిస్తోంది?
 
 మన దేశంలో ఇందిరాగాంధీ తర్వాత అత్యంత శక్తివంతమైన సుప్రసిద్ధ రాజకీయవేత్త నరేంద్ర మోదీనే. అయితే మీ శోధనను మరింత కుదించి చూసేట్టయితే, సంపూర్ణాధికారాన్ని చలాయించే సహజానుసార వర్తనుడైన నాయకుడు ఆయన మాత్రమేనని మీరు వాదించవచ్చు. మార్గరేట్ థాచర్ విషయంలో సహజానుసార నాయకత్వానికి చెప్పిన నిర్వచనమే మోదీ విష యంలోనూ వర్తిస్తుందని నా నమ్మకం. ఈ విషయంలో ఏకాభిప్రాయం గురిం చి చింతించాల్సిన అవసరమేమీ లేదు. నేను నా నమ్మకాన్నే అనుసరిస్తాను. ఆ విషయాన్ని అలా ఉంచితే, మోదీ మనకున్న అతి శక్తివంతమైన బహిరంగ ఉపన్యాసకుడు.

తనదైన స్వంత విలక్షణ శైలిగల ప్రభావశీలియైన వక్త. ఆయ న పార్లమెంటులో ఎక్కువగా మాట్లాడరని లేదా సూటిగా సంధించే ప్రశ్నలను ఎదుర్కోలేరని మీరు అభ్యంతర పెట్టవచ్చు. అయితే, పూర్తిగా తన నియం త్రణలో ఉంచుకో గల వాతావరణంలో ఆయన మహాశక్తివంతంగా శ్రోతలను ప్రభావితం చేయగల వక్త. ఒక్కసారి ఆయన తన శ్రోతలు ఎవరనే విష యాన్ని స్పష్టంగా అవగతం చేసుకుని, వారిని నియంత్రిత వాతావరణంలో ఉంచగలిగారంటే చాలు... ఇక ఆయన తప్ప వేదికపై మరెవరూ కనిపించరు. మన దేశంలో అలాంటి వక్తను మునుపెన్నడూ చూసి ఎరుగం. వాజపేయి కూడా గొప్పవక్తే, కానీ అది అప్పుడప్పుడూనే. పైగా ఆయన పెద్ద వేదికలను తన భావాలను లేదా భావజాలాన్ని వ్యాపింపజేయడానికి వాడుకోలేదు.
 బలమైన నేతల తీరే వేరు
 ఈ గుణాలు తనకున్నాయని గత వారంలో మోదీ రెండుసార్లు నిరూపిం చారు. ఒకటి, ఆయన స్వాతంత్య్రదినోత్సవ ప్రసంగంలో. రెండవది, దుబా య్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి చేసిన ఉపన్యాసంలో. ఢిల్లీ ఎర్రకోట నుంచి ఆయన ఈ ఏడాది చేసిన ప్రసంగంతో పోలిస్తే గత ఏడాది ప్రసంగం మరింత ఎక్కువ కదలించేదిగా ఉన్నమాట నిజమే. కానీ ఆయన ఉద్దేశపూర్వ కంగానే ఈ ఏడాది ప్రసంగానికి తక్కువ ప్రాధాన్యాన్నిచ్చారు. సుదీర్ఘ ప్రయా ణం సాగించే వానిలా నౌకను నియంత్రించడంలో కుదురుకుంటున్నట్టు ప్రవర్తించారు. ఈసారి ప్రసంగంలో కొత్త భావాలు ఏమీలేవు. అదీ బహుశా ఉద్దేశపూర్వకంగా చేసినదే కావాలి. ఇంతకుముందు ముందుకు తెచ్చిన ఆలో చనలు, ప్రత్యేకించి మరుగుదొడ్లు, స్వచ్ఛ భారత్ ఉదాసీన పురోగతిని చూపు తుండటం అందుకు కారణమై ఉండొచ్చు.

అయితే ఒత్తిడికి గురై ఆయన ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్ (ఓఆర్‌ఓపీ) సమస్యపై వెంటనే ఎలాంటి ప్రకటనా చేయ కుండా కొంత సాహసాన్ని ప్రదర్శించారు. బలమైన నేతలు ఘటనలకు విధానపరంగా ప్రతిస్పందించరు. సహజా నుసార వర్తనులైన నేతలు తమ నుంచి అంతా ఏమేమి ఆశిస్తే అది చేసే యరు. అందుకు బదులుగా వారు చేసేదేదో ఆశ్చర్యకరంగా చేసేస్తారు. ఓఆర్ ఓపీ సమస్యపై సాధారణమైన మాటలకు మించి మోదీ మరేమీ ప్రస్తావించ కపోవడం అందరికంటే ఎక్కువగా మీడియావాళ్లను ఆశ్చర్యచకితులను చేసిం ది. ప్రత్యేకించి జంతర్‌మంతర్ వద్ద మాజీ సైనికుల ప్రతినిధులను సమీకరిం చి, వారితో మాట్లాడించడానికి టీవీ సేనలను మోహరించిన చానళ్ల వారు నివ్వెరపోయేలా చేశారు. శక్తివంతమైన, సహజానుసార వర్తనులైన నేతలు పెద్ద వేదికలపై తమ మీదే ఉన్న కేంద్రీకరణను ఇతరులు వారిపైకి మరల్చు కోవడాన్ని అనుమతించరు.

ఒకవేళ మోదీ ఓఆర్‌ఓపీపై నిర్దిష్టంగా ఓ నాట కీయ ప్రకటనను చేశారనే అనుకున్నా, దానికి మాజీ సైనికులు పూర్తిగా సం తృప్తి చెందారని అనుకున్నా... అప్పుడు ఈ ఏడాది స్వాతంత్య్రదినోత్సవం మోదీదిగా గాక, వారిదిగా మారిపోయేది. ప్రభుత్వ పరిపాలనకు సంబంధిం చి తీసుకునే రోజువారీ నిర్ణయాలను అలాంటి ప్రతి సందర్భంలోనూ ఆయన ప్రకటిస్తారని ఆశించే చెడు సంప్రదాయాన్ని ఏర్పరచినట్టయ్యేది. అది, ఆయ నకున్న ఒక సువిశాల వేదికను సమస్యల పరిష్కార వేదిక స్థాయికి కుదించేసి ఉండేది.
 ప్రధాని కొత్త ఎజెండా
 అలాగే దుబాయ్ ప్రసంగం కూడా. ఒక ఇస్లామిక్ దేశంలో అదే మోదీ తొలి పర్యటన. అది కూడా మన దేశంతో సంబంధాలు గతుకులబాటలో ఉన్న దేశంలో పర్యటన. పైగా అది మన పన్ను ఎగవేతదార్లకు, స్మగ్లింగ్ సిండి కేట్లకు, మరీ ముఖ్యంగా దావూద్ ఇబ్రహీంకు కర్మభూమియైన దుబాయ్. ఈ వాస్తవాల స్పృహ ఉన్నా కూడా ఆయన హుందాతనంతో కూడిన దృఢ త్వంతో అందించాల్సిన సందేశాన్ని అందించారు. ఆయన ఉపన్యాసంలో పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఇస్తున్న మద్దతుపై ఫిర్యాదులుగానీ, అది దాని పద్ధతులను మార్చుకునేలా మీ పలుకుబడిని ఉపయోగించమని పాకిస్తాన్‌కు మిత్రులైన యూఏఈ షేక్‌లకు విజ్ఞప్తులు చేయడం గానీ లేవు. తెలివైన ఓ సున్నిత సందే శం మాత్రమే ఉంది. యుూరప్‌లాగే దక్షిణ ఆసియా కూడా ఐక్యమౌతోం ది.

తూర్పున అంతా దగ్గరకు చేరువవుతున్నారు. పశ్చిమాన పాకిస్తానీయులు ఈ క్రమాన్ని అడ్డుకోడాన్ని కొనసాగిస్తే, కప్పదాటు వేసి వారిని దాటుకొని యూఏఈని చేరుకోవడంతో ఈ ఐక్యతా వలయం పూర్తవుతుంది. కాబట్టి ఇం దులో చేరండి లేదా మిమ్మల్ని వదిలేసి పోయే ముప్పును ఎదుర్కోండి అనే సందేశాన్ని పాకిస్తాన్‌కు పంపారు. అదే సమయంలో సరిహద్దుల్లో కాల్పులు కొనసాగుతూనే ఉన్నా ఆయన దాన్ని దూషించడమో లేదా శాపనార్ధాలు పెట్ట డమో చేయలేదు. మోదీ ఒక కొత్త ఎజెండాను తయారు చేస్తుండటాన్ని మీరు చూడవచ్చు. పాకిస్తాన్‌తో చర్చలు తిరిగి కొనసాగాలని ఆయన కోరుకుంటు న్నారు. ఎవరూ ఆ క్రమానికి భంగం కలిగించడాన్ని ఆయన అనుమతించరు.
 ఒక్కసారి ఆయన దుబాయ్ ప్రసంగం టేప్‌ను మరోమారు చూడండి.

దుబాయ్ ‘‘యువరాజు’’ను కీర్తిస్తూ సభికుల చేత ఎన్నిసార్లు నినాదాలు చేయించారో లెక్కించండి. ఇప్పుడు ఆలోచించండి. ఒక భారత ప్రధాని భార తీయ సభికుల చేత... వారు విదేశీ భూభాగంలో పనిచేస్తున్నవారే అయినా... అక్కడి పాలకుని కీర్తిస్తూ నినాదాలు చేయించడం అలవాటుగా జరిగేదేనా? అందులోనూ సభికులు ప్రధానంగా హిందువులే అయినాగానీ ఒక ఇస్లామిక్ రాచరికాన్ని కీర్తింపజేయడం సైతం కాకతాళీయం. దూరదర్శన్ కెమెరాల వాళ్లు, మోదీ ఇమేజ్ మేనేజర్లు... సంప్రదాయక దుస్తుల్లోని బోరా ముస్లింలం దరినీ ఒకే చోట గుంపుగా కూర్చునేలా చేసి, పదే పదే వారిపైకే కెమెరాలను ఫోకస్ చేస్తూ ఈ అసాధారణ దృశ్యాన్ని కొంత చెడగొట్టారు.
 వ్యూహాత్మక ్రప్రారంభం
 నాకు గుర్తున్నంత వరకు, ఒక భారత నేత భారత సభికుల చేత ఒక విదేశీ నిరంకుశ నేతను ఇలా కీర్తించేలా చేసిన ఘటనలు రెండున్నాయి. మొద టిది, 1955లో నెహ్రూ, సోవియట్ యూనియన్ ప్రధాని కృశ్చెవ్, రక్షణమంత్రి బుల్గానిన్‌లను రామ్‌లీలా మైదాన్‌కు తీసుకెళ్లినప్పుడు. రెండవది, బాబ్రీ మసీదు విధ్వంసం, అల్లర్ల తదుపరి లక్నోలోని ఇమాంబారా వద్ద పీవీ నర సింహారావు, ఇరాన్ అధ్యక్షుడు రఫ్సంజానీ పెద్ద జనసమూహాన్ని ఉద్దేశిస్తూ ప్రసంగించినప్పుడు. అయినప్పటికీ ఒక తేడా ఉంది. నెహ్రూ సోషలిస్టు అలీన విధానం దశ తారస్థాయిలో ఉండగా కృశ్చెవ్ పర్యటన జరిగింది. కాబట్టి రెండు దేశాల మధ్య భావజాలపరమైన అనుబంధం ఉండేది. ఇక రఫ్సంజానీకి హర్షధ్వానాలు చేసినవారంతా ముస్లింలు, లేదా ఎక్కువగా షియాలు. ఆయన సభికులనుద్దేశించి ఏం మాట్లాడినా, నా పుస్తకంలో మాత్రం మన చరిత్రలోనే అది అత్యంత చతురతతో సాధించిన దౌత్య విజ యమని రాసుకున్నాను. అది భారత లౌకిక వ్యవస్థలో భారతీయ ముస్లింలు సురక్షితమనే సందేశాన్ని ప్రపంచానికి పంపింది. ఇరాన్‌పై ఆంక్షలు, పాకిస్తాన్ సమస్య, అప్పుడప్పుడు ఇరుదేశాల మధ్య తలెత్తే చికాకులు ఉన్నప్పటికీ... ఆ పర్యటన దానికదే ఇరాన్‌తో భారత్‌కున్న అతి ప్రత్యేక అనుబంధాన్ని నొక్కి చెప్పింది, సముచిత మైనదని స్పష్టం చేసింది.

 మోదీ ఇంతవరకు ఏ ఇస్లామిక్ దేశాన్ని సందర్శించలేదని ఆయన విమ ర్శకులు ఫిర్యాదు చేస్తూ వచ్చారు. బంగ్లాదేశ్, మధ్య ఆసియా రిపబ్లిక్కులకు వెళ్లారు, నిజమే. కానీ ఒక నిజమైన ఇస్లామిక్ దే శానికి వెళ్లలేదు. ఆ లోటును ఇప్పుడు పూడ్చుకుంటున్నారు. అదీ కూడా తన పర్యటనల ప్రపంచపటంలో మరో పిన్నును గుచ్చడంగా కాదు... ఒక వ్యూహాత్మక ప్రారంభంతో మొదలు పెట్టారు. తాను హిందూ ప్రధాన మంత్రినని నిస్సంకోచంగా విశ్వసించే వ్యక్తి 50,000 మంది స్వదేశీయులతో, వారిలో అత్యధికులు హిందువులే అయినా గానీ, ఒక విదేశంలోని వంశపారంపర్య ముస్లిం పాలకునికి హర్షధ్వానాలు చేయించారంటే అది ఆయనలోని సహజాతానుసార ప్రవర్తనను గురించి, దాని శక్తి, నైపుణ్యాల గురించి చెబుతుంది.

 ఏమిటీ పనితీరు?
 ఇన్ని గొప్ప సుగుణాలున్నా, ఆయన ప్రభుత్వం పనితీరు తలా తోకా లేకుం డా కాకున్నా, ఇప్పటికీ క్రమరాహిత్యంగా నడుస్తోందెందుకు? వివాదా స్పదమైనవి కాని గంగానది శుద్ధి, స్వచ్ఛభారత్‌ల నుంచి మేక్ ఇన్ ఇండియా వరకు ఆయన గొప్ప ఆలోచనలన్నీ ఎందుకు కొట్టుకుపోతున్నాయి? ఆర్థిక వృద్ధి ఎందుకు కోలుకోవడం లేదు? ప్రత్యేకించి కొన్ని ప్రమాణాలను మార్చి పౌరాణిక గాథల్లోలా అంకెలను అద్భుతంగా పెంచేసి చూపడంలో  ప్రదర్శిం చిన గణాంకశాస్త్ర సృజనాత్మకతను తీసేసి చూస్తే, ఆర్థికవృద్ధి ఇంకా కోలుకో వడం లేదనేది అవగతమవుతుంది. కేవలం రెండే రెండు స్క్వాడ్రన్‌ల రాపేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ప్రధాని స్థాయిలో ఒక ప్రత్యేకమైన, కచ్చిత మైన నిర్ణయం జరగాల్సి ఉన్నా... బేరసారాలు తదితర లాంఛనాల వద్ద అది ఎందుకు మూలనపడి ఉంది?

 ప్రధానికి బదులుగా గిరిరాజ్ సింగ్, సాక్షి మహరాజ్‌ల నుంచి గ జేంద్ర చౌహాన్ వరకు, అక్కడి నుంచి మ్యాగి వరకు నానారకాల తలతిక్క బాప తును పతాక శీర్షికలకు ఎందుకు ఎక్కనిస్తున్నట్టు? రాత్రికి రాత్రే ఓ ఆర్డినె న్స్‌తో కొత్త భూసేకరణ చట్టాన్ని తేవాలని ప్రయత్నించడం వంటి ఘోర వ్యూహాత్మక తప్పిదం ఆయన ఎలా చేశారు? యాకూబ్ మెమన్ ఉరిశిక్షపై ప్రసారం చేసిన వార్తా కథనాల (వాటిలో కొన్ని అసంబద్ధమైనవే అయినా) కారణంగా చానళ్లకు లాంఛనంగా నోటీసులను పంపి... మొత్తంగా వార్తా ప్రసార మాధ్యమంపైనే యుద్ధం ప్రకటించిందన్నట్టుగా ఆయన ప్రభుత్వం ఎందుకు కనిపిస్తున్నట్టు? సన్ గ్రూపు మీడియా లెసైన్సుల ఉపసంహరణకు ఆయన ప్రభుత్వ హోంమంత్రిత్వశాఖ ‘‘జాతీయ భద్రతకు ముప్పు’’ను అస్త్రాన్ని ప్రయోగించింది.

ఇక ఆయన సీబీఐ, తీస్తా సెతల్వాద్ అంటే దావూద్ ఇబ్రహీం ఇక్కడే వదిలి వెళ్లిన ప్రమాదకరమైన అతగాడి చుట్టమన్నట్టుగా ఆమెను ‘‘జాతీయ భద్రతకు ముప్పు’’ను చేసేసింది. మోదీ, ఆయ న ప్రభు త్వమూ చేసిన ఈ పోరాటాలన్నిటి వల్లా మహా అయితే వారికి నచ్చని వారె వరో ఒకర్ని జైలుకు పంపగలగడంలోనో లేదా ఒక మీడియా సంస్థ ప్రచురణ ను కొంతకాలంపాటూ బలవంతంగా నిలిచిపోయేలా చేయడంలోనో సఫ లమై ఉండొచ్చు. కానీ అవన్నీ వారు సారాంశంలో ఓటమికి గురికాక తప్ప నివే. తెలివివంతులు, సహజానుసార వర్తనులు, శక్తి వంతులు, ఆత్మ విశ్వాసం కలిగిన నేతలు, ప్రభావశీలురైన గొప్పవక్తలు... అలాంటి చిల్లర మల్లర విషయాల కోసం తమ శక్తులను, తమకున్న మంచి పేరును చెల్లా చెదు రుచేసి, వ్యర్థం చేసుకోరు.

 గొప్పదనాన్ని హరించే ‘అదే’ బలహీనత
 ఆయనలో ఇన్ని గొప్ప సుగుణాలున్నా, శక్తివంతులైన చాలామంది నేతలకు న్నట్టే ఆయనకూ ఓ బలహీనత ఉంది. దాని ఫలితంగా వారు ఎంత ప్రతి భాశాలురైనాగానీ నిజమైన గొప్పదనాన్ని సాధించే అవకాశాన్ని తమకు తామే దక్కకుండా చేసుకుంటారు. ప్రతిభ ఎక్కడవున్నా, అది తమ రాజకీయ సామీ ప్యపు పరిధికి లేదా భావజాలపరమైన సౌఖ్యతా పరిధికి వెలువల ఉన్నాగానీ ఆకర్షించగల, ఆహ్వానించ గల శక్తి కొరవడటం, అందుకు విముఖులై ఉండ టం, లేదా అంతటి వినయం లేకపోవడం అందుకు కారణం కావచ్చా? లేదం టే అధికారంలో ఉన్న వారికి అంతర్గతంగానే అయినా నిజాన్ని సూటిగా చెప్ప గలిగేపాటి వెన్నెముక గలిగిన తెలివైన వారిని తమ వ్యవస్థలోకి తీసుకురావ డమైనా చేయాలి. ఉదాహరణకు, ఫలానా సూటు ఆకర్షణీయంగా ఉన్నా, అలాంటి సూటు ధరించడం మంచి యోచన కాదని ఆయనకు చెప్పగలవారు ఎవరైనా కావాలి.

 ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు చాలా చికాకు పుట్టించేవిగా గడి చాయి నిజమే. కానీ లోక్‌సభలో అధికారపక్ష నాయకుడైన ప్రధాని సభలో ఉండి, ప్రతిపక్షాలు లేవనెత్తిన సమస్యలపై తనంతట తానుగానే ఒక ప్రకటన చేసి ఉంటే బావుండేది. అది వారిని ఒప్పించగలిగి ఉండేదేమీ కాదు. కానీ అలా చేయకపోవడం వల్ల ప్రధానిగా ఆయన తన నైతిక అధికారాన్ని ప్రయో గించే అవకాశాన్ని కోల్పోయారు. తప్పో, ఒప్పోగానీ మీడియా స్వేచ్ఛల విష యంలో ఆయన ప్రభుత్వాన్ని అనుమానంగా చూడటం అలవాటైంది కాబట్టి కనీసం ఆయన మీడియా స్వేచ్ఛ విషయంలో కొత్త యుద్ధరంగాలను తెరవ వద్దని తన హోం, సమాచార శాఖలను హెచ్చరించైనా ఉండాల్సింది. రామ్ విలాస్ పశ్వాన్ మ్యాగి విషయంలో నమ్మశక్యంకాని విధంగా క్లాస్ యాక్షన్ సూట్ (సమూహ ప్రాతినిధ్య వ్యాజ్యం) వేయడానికి ముందే ఆయన చేత ఓ ‘చిల్ పిల్’ (మానసిక ప్రశాంతత కోసం ఇచ్చే ఉత్తుత్తి మందు)ను మిం గించమని ప్రధాని చెవిలో జోరీగలా పోరే వారెవరైనా ఉండాల్సింది. మీది శక్తివంతమైన సర్వసత్తాక ప్రభుత్వం. మీ దేశ రిపబ్లిక్‌లోనే ఉన్న ఆహార రక్షణ భద్రత చట్టాలకు అనుగుణంగా మీరు ‘నెస్లే’ను నియంత్రించగలరు.

మీ స్వంత పరిశోధనా కేంద్రాల్లో నెస్లే ఉత్పత్తులన్నిటినీ పరీక్షింపజేయగలరు. ఏమైనా తప్పున్నట్టుగా లేదా నేరానికి పాల్పడ్డట్టుగా నిర్ధారించగలిగితే విచా రించి శిక్షించవచ్చు. అంతేగానీ క్లాస్ యాక్షన్ సూటా? అది బలాన్ని ప్రకటిం చేది కాదు, మూర్ఖత్వాన్ని వెల్లడించేది మాత్రమే.  ప్రధాని వీటిని పట్టించుకోలేనంతగా ఇంతకంటే ముఖ్యమైన ఇతర బాధ్యతలతో తలమునకలై ఉన్నారని మీరనొచ్చు. అయితే మాత్రం మీ ప్రభు త్వం ఇలా కుంటుతూ నడవడాన్ని ఎలా అనుమతిస్తారు? ఒకే ఒక్క యోధు నితో కూడిన అశ్వికసేన అనే అద్భుతమైన ఆలోచన ఆసక్తికరమైనదే. కానీ మిమ్మల్ని అనుసరించే నిజమైన సేనలను నిర్మించనిదే యుద్ధాలను గెలవలేరు.

(వ్యాసకర్త: శేఖర్ గుప్తా)

మరిన్ని వార్తలు