ఒప్పంద పత్రంలో ఏముంది! | Sakshi
Sakshi News home page

ఒప్పంద పత్రంలో ఏముంది!

Published Sat, Aug 22 2015 12:29 AM

ఒప్పంద పత్రంలో ఏముంది!

సాక్షి, హైదరాబాద్ : మనకు నచ్చే ఫ్లాట్ దొరికేంత వరకూ నగరం నలుమూలలా తిరుగుతాం. రుణమెంత వస్తుందో ముందే బ్యాంకర్లతో చర్చించి, ఆర్థిక పరిమితులు దాటకుండా జాగ్రత్తపడతాం. కోరుకున్న ఫ్లాట్ దొరికితే చాలు.. అడ్వాన్సు అందజేసి బిల్డర్‌తో ఒప్పందం కుదుర్చుకుంటాం. మరి ఈ పత్రంలో ఏముందో.. ఏయే అంశాల్ని పేర్కొన్నారో తెలుసుకోవాలి. లేదంటే సొంతింటి ఆనందానికి దూరమైనట్లే.

► స్థిరాస్తుల కొనుగోలులో అతి కీలకమైన విషయం అమ్మకందారునితో కుదుర్చుకునే ఒప్పందమే.  జీవిత కాలపు కష్టార్జితానికి తోడు, బ్యాంకు నుంచి అప్పు తీసుకుని మరీ సొమ్ము చెల్లిస్తాం. తీరా కొనుగోలు చేశాక, న్యాయపరమైన చిక్కులున్నాయనో, ఇంటిపై అప్పు ఉందనో తేలితే.. ఎంత నష్టం? ఇలాంటి లొసుగుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అన్ని రకాలుగా పక్కాగా ఉందని తేలాకే కొనుగోలుపై ముందడుగు వేయాలి.
► ఇంటి విలువ ఎంతన్నది కేవలం భవనానికే పరిమితమైన అంశం కాదు. ఇందులో అనేక ఇతర ఖర్చులు కలుస్తాయి. విద్యుత్, మంచినీరు, పార్కింగ్, వివిధ రకాల పన్నులతో పాటు రిజిస్ట్రేషన్ వంటి ఖర్చులుంటాయి. ఇవన్నీ మొత్తం విలువలో ఉండేలా చూసుకోండి.
► ఇతర రుసుములు ఏమైనా ఉన్నాయేమో అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఒప్పంద పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఈ విషయంలో రియల్టీ లావాదేవీల్లో అనుభవం ఉన్న న్యాయవాదిని సంప్రదించాలి. అభ్యంతరాలుంటే.. బిల్డర్‌ను సంప్రదించడం ద్వారా ఆ విషయాల్ని సరిదిద్దుకోవచ్చు. వాస్తవ ప్లాన్‌కు భిన్నంగా మార్పులు చేయాల్సి వస్తే.. అదనపు రుసుములు చెల్లించారా? సంబంధిత ప్రభుత్వ శాఖల అనుమతి అవసరమా.. వంటి విషయాల్ని బిల్డర్‌తో చర్చించి ఒక నిర్ణయానికి రావాలి.
► నిర్మాణం పూర్తయ్యేదెప్పుడు, ఇంటిని అప్పగించేదెప్పుడు అనే విషయాలు ముందే స్పష్టంగా తెలుసుకోవాలి. ఇటీవల కాలంలో చాలా ప్రాజెక్టుల్లో నిర్మాణాలు ఆలస్యమయ్యాయి. ఇలా జరగడం వల్ల ఓవైపు ఈఎంఐలు కట్టలేక, మరోవైపు ఇంటి అద్దె చెల్లించలేక ఇబ్బందులపాలవుతాం.
► పనులు మొదలయ్యాక నిర్మాణ ప్రగతిని ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఆలస్యమవుతుంటే బిల్డర్‌ను కలిసి మాట్లాడండి. పనుల పురోగతికిది దోహదం చేయొచ్చు. అదే ప్రాజెక్టులో ఫ్లాట్లను కొనుగోలు చేసినవారితో ఓ సొసైటీని ఏర్పాటు చేయండి. ఫలితంగా బిల్డర్ వైపు నుంచి ఆలస్యం జరిగితే, గట్టిగా అడగడానికి వీలవుతుంది.

Advertisement
Advertisement