ప్రాణం కోసం.. పన్నెండేళ్ల పోరాటం

5 Feb, 2018 17:19 IST|Sakshi
వడ్లూరి రాహుల్‌

 అచేతన స్థితిలో బాలుడు

 బ్రెయిన్‌ట్యూమర్‌తో నరకయాతన

 ఆదుకోవాలంటూ తల్లిదండ్రుల వేడుకోలు

జూలపల్లి(పెద్దపల్లి): వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులు తమ బిడ్డ ప్రాణాలను కాపాడతాయని 12 ఏళ్లుగా ఆ తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఆస్పత్రుల చుట్టూ తిరిగి చేతిలో ఉన్నకాడికి ఖర్చు చేసి వైద్యం చేయించారు. అయి నా తగ్గని వ్యాధి తమ కుమారుడిని ఎక్కడ పొట్టనపెట్టుకుంటుందోనని ఆ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జూలపల్లికి చెందిన వడ్లూరి చంద్రమౌళి– స్వరూపలకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రాహుల్‌(16)కు 12 ఏళ్ల క్రితం బ్రెయిన్‌ ట్యూమర్‌ వ్యాధి సోకింది. అప్పట్లో అప్పు లు తెచ్చి లక్ష రూపాయలు ఖర్చు చేసి ఆపరేషన్‌ చేయించారు. డాక్లర్లు 12 ఏళ్లపాటు మందులు వాడి తిరిగి పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. కొంత మేరకు దాతల సహకారం అందడంతో మందులు వాడుతూ వచ్చారు.

అప్పట్లో చేసిన అప్పులు నేటికి తీరకపోగా వారి వద్ద ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వ లేదు. వైద్య పరీక్షలకు వెళ్లక పోవడంతో నెల రోజుల నుంచి బాలుడు తీవ్ర అస్వస్థతకు గురై నడవలేని పరిస్థితికి వచ్చాడు. మలమూత్రాలు సైతం మంచంలోనే సాగుతున్నాయి. పరీక్షలకు కనీసం రూ.30 వేలు అవసరం ఉంటాయని, కూలీ చేసుకుని జీవనం సాగించే తమవద్ద ఆ డబ్బులు లేకపోవడంతో నిస్సహాయ స్థితిలో ఉన్నామని అతని తల్లిదండ్రులు దీనంగా చెప్పారు. బ్రెయిన్‌ ట్యూమర్‌ సోకిన తమ 16 ఏళ్ల కుమారుడికి వైద్యం చేయించుకోలేని స్థితితో ఆ నిరుపేద కుటుంబం ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తోంది. దాతలు స్పందించి తమ కుమారుని ప్రాణాలు కాపాడాలని వారు వేడుకుంటున్నారు. దాతలు సెల్‌: 7799816260కు సంప్రదించగలరు.

 

మరిన్ని వార్తలు