పారదర్శకతను పక్కన పెట్టిన ‘ఆప్‌’

18 Sep, 2018 15:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పలు ఉన్నత ఆశయాలతో ప్రజల ముందుకు వచ్చిన ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రస్తుత ఎన్నికల రాజకీయ రంగంలో వాటిని నిలబెట్టుకోలేక ఒక్కొక్కదాన్ని వదిలేస్తూ వస్తోంది. ఈ వైఖరి నచ్చక ఉన్నత ఆశయాలతో పార్టీలోకి వచ్చిన వారు ఒక్కొక్కరే పార్టీకి దూరం కూడా అవుతున్నారు. ముందుగా పార్టీ వెబ్‌సైట్‌లో పార్టీకి విరాళాలు ఇచ్చిన దాతల పేర్లను పెట్టిన ఆప్‌ ఆ తర్వాత వాటిని తొలగించింది. తమ పార్టీకి విరాళాలిచ్చిన భారతీయులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేధిస్తున్న కారణంగా వారి వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టకూడదని నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ నాయకుడు, ఢిల్లీ కార్మిక మంత్రి గోపాల్‌ రాయ్‌ మీడియాకు తెలిపారు.

ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కార్యదర్శి పంకజ్‌ గుప్తా ఇందుకు పూర్తి భిన్నంగా మాట్లాడారు. ‘ఈ విషయంలో బీజేపీ నుంచి వేధింపులు ఉన్నాయనడం అబద్ధం. వాస్తవానికి పార్టీతోపాటు దాతలు కూడా వారి పేర్లను వెబ్‌సైట్‌ ద్వారా వెల్లడించాలనే కోరుకుంటున్నారు. ఆ సమాచారాన్ని ప్రజలు నేరుగా వీక్షించేందుకు వీలుండాలిగానీ దుర్వినియోగం చేయడానికి వీలు ఉండకూడదు. అయితే అందుకు వెబ్‌సైట్‌ను మరింత అభివృద్ధి చేయాల్సి ఉంది. దానికి బ్రాండ్‌ విడ్త్‌ సరిపోవడంలేదు. మా సాంకేతిక బృందం సాంకేతిక పరిష్కారం కనుగొనే పనిలో ఉన్నారు. పార్టీ దాతల వివరాలను ఎలాగూ ఎన్నికల కమిషన్‌కు ఇస్తాం కదా!. 98 శాతం దాతలు తెల్సిన వారే’ అని ఆయన వ్యాఖ్యానించారు. అంటే వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేశాక దాతల వివరాలను మళ్లీ వెబ్‌సైట్‌లో పెడతామన్నట్లుగా ఆయన మాట్లాడారు. 2016 సంవత్సరంలో కూడా డోనర్ల పేర్లను ఆప్‌ వెబ్‌సైట్లో పెట్టి ఆ తర్వాత తొలగించింది. ఆ తర్వాత ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో మళ్లీ దాతల పేర్లను పెట్టింది. ఈసారి అలాంటి స్పందన ఉంటుందా అన్నది అనుమానమే!

2014–15 ఆర్థిక సంవత్సరానికి పార్టీకి అందిన వాస్తవ వివరాలకు, ఆదాయం పన్ను శాఖకు  సమర్పించిన వివరాలకు పొంతన కుదరడం లేదంటూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం ఇచ్చిన నివేదికను పురస్కరించుకొని ఎన్నికల కమిషన్‌ వారం క్రితం అంటే, సెప్టెంబర్‌ 11వ తేదీనే ఆప్‌ పార్టీకి నోటీసు ఇవ్వడం, 20 రోజుల్లోగా సమాధానం ఇవ్వాల్సిందిగా అందులో కోరడం గమనార్హం. వచ్చిన మొత్తం విరాళాల్లో 13 కోట్ల రూపాయలను ఆప్‌ తక్కువ చేసి చూపించిందన్నది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఆరోపణ. బోర్డే ఆదాయాన్ని లెక్కించడంలో తప్పు చేసిందని, తాము సమర్పించిన రిటర్న్స్‌లో అంకెలు సరిగ్గా ఉండగా, ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన నోటీసులోనే తప్పుడు అంకెలు ఉన్నాయంటూ ఆప్‌ పార్టీ అధికార పార్టీ ప్రతినిధులు సమర్థించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తమపై కక్షగట్టడం వల్లనే కేంద్ర ప్రభుత్వ సంస్థలు తమను వేధిస్తున్నాయని వారంటున్నారు.

ప్రాంతీయ పార్టీలకు వస్తున్న విరాళాలను, అవి ప్రభుత్వ విభాగాలకు సమర్పిస్తున్న రిటర్న్స్‌ను ‘ది అసోసియేషన్‌ ఆఫ్‌ ది డెమోక్రటిక్‌ రిఫామ్స్‌’ లాంటి స్వచ్ఛంద సంస్థలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాయి. కొన్ని పార్టీలు ఇప్పటికీ ఈ విషయంలో పారదర్శకతను పాటిస్తుండగా, ఎక్కువ పార్టీలు పాటించడం లేదని సంస్థ సహ వ్యవస్థాపకుడు, బెంగళూరులోని ఐఐఎం ప్రొఫెసర్‌ త్రిలోచన్‌ శాస్త్రి తెలిపారు. 2016–2017 సంవత్సరానికి ఆదాయం పన్ను శాఖ నివేదిక ప్రకారం ఆప్‌ పార్టీ ఆదాయం 30.8 కోట్ల రూపాయలు. కార్పొరేట్‌ సంస్థలు, వ్యక్తిగత విరాళాలు, పార్టీ కార్యకర్తల నుంచి వచ్చినట్లు ఆ పార్టీ చూపించిన విరాళాలు 24.7 కోట్ల రూపాయలు. రెండింటి మధ్య వ్యత్యాసం 6.1 కోట్ల రూపాయలు. వాటిలో వ్యక్తుల నుంచి వచ్చిన విరాళాల మొత్తం 20.8 కోట్ల రూపాయలు కాగా, కార్పొరేట్‌ సంస్థల నుంచి వచ్చిన విరాళాలు 3.8 కోట్ల రూపాయలు.

ప్రజాప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు 20 వేల రూపాయలకు మించి వచ్చిన విరాళాల వివరాలను విధిగా వెల్లడించాలి. కానీ ఈరోజుల్లో చాలా రాజకీయ పార్టీలు పారదర్శకంగా వ్యవహరించడం లేదని శాస్త్రి ఆరోపించారు. నేడు అన్ని రాజకీయ పార్టీలు విరాళాలు వచ్చిన సోర్స్‌ వెల్లడించకుండా దాచాలని కోరుకుంటున్నాయని, అంటే అందులో దాచాల్సిన అంశమేదో కచ్చితంగా ఉన్నట్లేనని, ఏదిఏమైనా పారదర్శకత అత్యవసరమని డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ సంస్థ వ్యవస్థాపకులు, అహ్మదాబాద్‌లోని ఐఐఎం మాజీ డీన్‌ జగధీప్‌ ఛోకర్‌ వ్యాఖ్యానించారు. అంటే, ఆప్‌ పార్టీ కూడా విరాళాల సోర్స్‌ను వెల్లడించకుండా ఏదో దాచేందుకు ప్రయత్నిస్తుందన్నది సుస్పష్టం.

మరిన్ని వార్తలు