'తప్పు చేస్తే సస్పెండ్‌ చేయకుండా సన్మానం చేస్తారా?'

14 Dec, 2019 17:54 IST|Sakshi

సాక్షి, అమరావతి : పరిశ్రమల శాఖ నివేదికతోనే ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌పై వేటు వేయడం జరిగిందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టం చేశారు. అవినీతి ఆరోపణలతోనే ఆయనను ప్రభుత్వం సస్పెండ్‌ చేసిందని పేర్కొన్నారు. అయితే దీనిని రాష్ట్ర, జాతీయ సమస్యగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎల్లోమీడియా తప్పుగా చిత్రీకరిస్తోందని మండిపడ్డారు. తప్పు చేసిన అధికారిని సస్పెండ్‌ చేయకుండా సన్మానం చేస్తారా అంటూ ధ్వజమెత్తారు.

శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కృష్ణ కిషోర్‌ సస్పెన్షన్‌పై చంద్రబాబు గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. గతంలో బాబు అధికారంలో ఉన్నప్పుడు కృష్ణ కిషోర్‌ తనకు అనుకూలంగా పనిచేయడం వల్లే ఇప్పుడు ఇలా పెడబొబ్బలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. తప్పు చేశారని ఆధారాలుంటే ఎంతటి అధికారులైనా సరే చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలో కాంగ్రెస్‌, చంద్రబాబు కుట్రతోనే వైఎస్‌ జగన్‌పై కేసులు పెట్టారని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సభలో అసెంబ్లీ ఛీఫ్‌ మార్షల్‌ను బహిరంగంగానే చంద్రబాబు, లోకేష్‌లు దూషించారని గుర్తు చేశారు. సభలో ఎదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. గతంలో ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా పని చేసినా చట్టానికి లోబడే పని చేయాలని అంబటి వెల్లడించారు.
(చదవండి : ఐఆర్‌ఎస్‌ అధికారి కృష్ణకిశోర్‌ సస్పెన్షన్‌) 

మరిన్ని వార్తలు