భూ స్కాంతో వాద్రా కోట్లు ఆర్జించారు

1 Dec, 2018 04:36 IST|Sakshi

బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ఆరోపణలు

జైపూర్‌: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సొంత బావ రాబర్ట్‌ వాద్రా భారీ భూ కుంభకోణానికి పాల్పడి, డబ్బు బాగా వెనకేశారని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా రాజస్థాన్‌లో ఎన్నికల ర్యాలీల్లో ఆరోపించారు. రాబర్ట్‌ వాద్రాకు చెందిందిగా భావిస్తున్న బికనీర్‌లోని స్కైలైట్‌ హాస్పిటాలిటీ భూములు కొనుగోలు చేసేందుకు అప్పులిచ్చిన ఒక సంస్థకు అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం భారీగా పన్ను రాయితీలు కల్పించిందంటూ వచ్చిన వార్తలను ఆయన ప్రస్తావించారు. ఈ వ్యవహారంలో నెహ్రూ–గాంధీ కుటుంబం అల్లుడు(వాద్రా) భారీగా కమీషన్లు పుచ్చుకున్నారని ఆరోపించారు. దీనిపై రాహుల్‌ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అక్రమ పద్ధతుల్లో ఇచ్చిన రుణాలే ఇప్పుడు నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏ)గా మారాయన్నారు. రాజస్తాన్‌లోని బీజేపీ ప్రభుత్వాన్ని ‘అంగదుని పాదం’ అని అభివర్ణించారు.   

రాబర్ట్‌ వాద్రాకు ఈడీ సమన్లు
న్యూఢిల్లీ: భూ కుంభకోణం కేసులో వాద్రాకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సమన్లు జారీ చేసింది. విచారణకు వచ్చే వారం హాజరు కావాల్సిందిగా కోరింది. నవంబర్‌లో జారీ చేసిన మొదటి సమన్లకు వాద్రా స్పందించలేదు. ప్రముఖ స్టీల్‌ కంపెనీ ఒకటి దేశ సరిహద్దుల్లోని సుమారు వందెకరాల స్థలం కొనుగోలు చేసేందుకు వాద్రా సంస్థలకు రుణం ఇవ్వడంపైనా ప్రశ్నించనుంది. వాద్రాకు చెందిన పలువురు వ్యక్తులపై గతంలో ఈడీ దాడులు కూడా చేపట్టింది.

మరిన్ని వార్తలు