అమిత్‌ షా ‘టార్గెట్‌ బెంగాల్‌’

28 Jun, 2018 18:06 IST|Sakshi
బెంగాల్‌లోని పురూలియాలో ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతున్న బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో పట్టు కోసం బీజేపీ పావులు కదుపుతోంది. బెంగాల్‌లో ప్రాబల్యం పెంచుకునేందుకు ఆ పార్టీ చీఫ్‌ అమిత్‌ షా ప్రచార ర్యాలీలతో హోరెత్తించేందుకు సిద్దమయ్యారు. పురూలియా ర్యాలీతో తమ ప్రచార వ్యూహం ఎలా ఉండబోతోందో ఆయన చాటిచెప్పారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని పాలక తృణమూల్‌ కాంగ్రెస్‌ సర్కార్‌ హింసను ప్రేరేపిస్తోందని షా ఆరోపించారు.

హింస ద్వారానే బెంగాల్‌లో అధికారంలో కొనసాగాలని తృణమూల్‌ భావిస్తే తమ కార్యకర్తల త్యాగాలు వృధా కాబోవని, వారి సర్కార్‌ ఎక్కువ కాలం మనుగడ సాధించలేదని ఆయన సవాల్‌ విసిరారు. పురూలియాలో గురువారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి అమిత్‌ షా ప్రసంగిస్తూ తృణమూల్‌ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. గతంలో రవీంద్రుని బోధనలతో పునీతమైన బెంగాల్‌ ఇప్పుడు బాంబుల మోతతో దద్దరిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, బంకించంద్ర ఛటోపాధ్యాయ వంటి ఎందరో మహానుభావుల పురిటిగడ్డ అయిన బెంగాల్‌లో మమతా బెనర్జీ ఏం చేస్తున్నారో అందరూ చూస్తున్నారని ఎద్దేవా చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలు రాష్ట్రంలో మార్పునకు నాందిపలుకుతాయని, బెంగాల్‌లోని 22 లోక్‌సభ స్ధానాల్లో బీజేపీ గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పట్టు కోల్పోయిన మమతా బెనర్జీ మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా మహాకూటమికి ప్రయత్నిస్తోందని అన్నారు. కేంద్రం నుంచి అధిక నిధులు అందుతున్నా కేంద్ర పథకాలను మమతా సర్కార్‌ అమలు చేయడం లేదని ఆరోపించారు. 

మరిన్ని వార్తలు