పాతబస్తీలో జెండా ఎగరేస్తాం

5 Oct, 2018 10:23 IST|Sakshi

మజ్లిస్‌ కంచుకోటను బద్దలు కొడతాం  

మిత్రపక్షాలతో కలిసి క్లీన్‌స్వీప్‌ చేస్తాం  

టీఆర్‌ఎస్‌కు డిపాజిట్‌లు కూడా రావు  

ఎంఐఎం, బీజేపీ,టీఆర్‌ఎస్‌ మూడు మూడే..

కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ యాదవ్‌  

సాక్షి, సిటీబ్యూరో: ‘ముందస్తు’ ఎన్నికల్లో పాతబస్తీలో కాంగ్రెస్‌ జెండా ఎగరేస్తామని, మజ్లిస్‌ కంచుకోటను బద్దలు కొడతామని ఆ పార్టీ నగర అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ యాదవ్‌  ధీమా వ్యక్తం చేశారు. పాతబస్తీలో బలమైన అభ్యర్థులను బరిలో నిలుపుతామని చెప్పారు. పార్టీ సిటీ కార్యాలయంలో గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. పాతబస్తీ ఏదో ఒక్క పార్టీ సొత్తు కాదని... ఇప్పటి వరకు దానిపై సీరియస్‌గా దృష్టి సారించలేదని, ఈ ఎన్నికల్లో తాడోపేడో తెల్చుకుంటామన్నారు. మిత్రపక్షాలతో కలిసి నగరంలో క్లీన్‌స్వీప్‌ చేస్తామని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ ఒక్కటే సెక్యూలర్‌ పార్టీ అని... మజ్లిస్, టీఆర్‌ఎస్, బీజేపీ మూడూ ఒక్కటేనని ఆరోపించారు. మజ్లిస్‌ టీఆర్‌ఎస్‌కు సహకరిస్తోందని, టీఆర్‌ఎస్‌ బీజేపీకి సహకరిస్తోందని దుయ్యబట్టారు. ప్రధాని ఆమోదంతోనే కేసీఆర్‌ ముందుస్తు ఎన్నికలకు సిద్ధమయ్యాడని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌... బీజేపీతో జత కట్టడం ఖాయమని పేర్కొన్నారు. దీంతో మజ్లిస్, టీఆర్‌ఎస్‌లకు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనన్నారు.  

అక్కడందరూ తెలంగాణ ద్రోహులే...
టీఆర్‌ఎస్‌లో రాజ్యమేలుతోంది తెలంగాణ ద్రోహులేనని అంజన్‌కుమార్‌ యాదవ్‌ ఆరోపించారు. రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన మజ్లిస్‌... టీఆర్‌ఎస్‌కు మిత్రపక్షమైందన్నారు. తెలంగాణ ద్రోహులైన తుమ్మల, తలసాని తదితరులకు మంత్రి పదవులిచ్చి అందలం ఎక్కించిన ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కుతుందన్నారు. ఉద్యమంలో భాగస్వామలైన వారికి, అమరులకు ఎలాంటి గౌరవం లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం పార్లమెంట్‌లో గళం విప్పింది కాంగ్రెస్‌ ఎంపీలేనన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు 12సార్లు పార్లమెంట్‌ను అడ్డుకున్నామని గుర్తు చేశారు. ‘తెలంగాణ ఇచ్చింది... తెచ్చింది కాంగ్రెస్‌ పార్టీ అన్నారు. కేసీఆర్‌ ఒక్కడితోనే సాధ్యం కాలేదన్నారు. రాష్ట్రం ఏర్పాటు అనంతరం మాయమాటలతో అధికారంలో వచ్చిన టీఆర్‌ఎస్‌ ఉద్యమ ఆకాంక్షలను నేరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ముందస్తు ఎన్నికల్లో చీటింగ్‌ టీఆర్‌ఎస్‌కు డిపాజిట్‌లు కూడా రావన్నారు.  

అన్నింట్లో వైఫల్యం...  
నాలుగున్నరేళ్ల పాలనలో టీఆర్‌ఎస్‌ నగరాభివృద్ధికి చేసింది ఏమిటని ప్రశ్నించారు. వాగ్దానాల అమలుకు సంబంధించి కేసీఆర్‌ అన్నింటా వైఫల్యమయ్యారని అన్నారు. పాత నగరాన్ని ఇస్తాంబుల్‌ చేస్తామని మభ్య పెట్టాడన్నారు. మెట్రో, కృష్ణ జలాల ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని, పనులు పూర్తయిన తర్వాత ప్రారంభించడంలో గొప్పేమిటని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే పాత నగరానికి మెట్రోను విస్తరించాలన్నారు.  

కార్యకర్తలకు పెద్దపీట...  
రానున్న ప్రభుత్వం కాంగ్రెస్‌దేనని అంజన్‌కుమార్‌ యాదవ్‌ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ విజయం కోసం కష్టపడే వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. నగరంలోని 15 అసెంబ్లీ స్థానాల టికెట్‌ల కోసం సుమారు 100 మంది దరఖాస్తు చేసుకున్నారని, సర్వే ప్రకారం గెలుపు గుర్రాలకు అవకాశం రావడం ఖాయమన్నారు. ఎన్నికల్లో సమర్థులను బరిలో దింపుతామని, టికెట్‌ ఆశించి భంగపడ్డ వారు నిరాశ పడకుండా పార్టీ కోసం పని చేయాలని సూచించారు. కష్టకాలంలో పనిచేసిన వారిని పార్టీ మరవదని, అధికారంలోకి రాగానే తగిన గుర్తింపు ఇస్తామని భరోసా ఇచ్చారు. 

మరిన్ని వార్తలు