2జీ స్కామ్‌ తీర్పు.. హజారే ఆసక్తికర వ్యాఖ్యలు

21 Dec, 2017 14:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గాంధేయవాది, అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నాహజారే 2జీ స్పెక్ట్రమ్‌ కేసు తీర్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తీర్పుపై మీడియా ఆయన్ని సంప్రదించగా.. కోర్టు తీర్పు సరైందని ఆయన వ్యాఖ్యానించారు. 

తొలుత అంశంపై స్పందించేందుకు నిరాకరించిన ఆయన తర్వాత మీడియా ఒత్తిడి చేయటంతో మాట్లాడారు. ‘‘కోర్టు తీర్పులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేం. అవి ఖచ్ఛితంగా.. సహేతుకంగా ఉన్నాయనే భావిస్తున్నాం. న్యాయస్థానాలు కేవలం సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకుని.. విచారణ చేపట్టాకే తీర్పులు ప్రకటిస్తాయి. వారికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేకపోతే నిరపరాధిగానే తేలుస్తాయి. వాటిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. 

సుమారు ఏడేళ్ల తర్వాత సీబీఐ కోర్టు కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించటం తెలిసిందే. డీఎంకే నేతలు కనిమొళి, రాజాలు ఇందులో ప్రధాన సూత్రధారులుగా ఆరోపణలు ఎదుర్కున్నారు. యూపీఏ రెండో దఫా అధికారం చేపట్టాక సుమారు 1.76 లక్షల కోట్ల అవినీతి స్కాంగా 2జీ స్పెక్ట్రమ్‌ వార్తల్లో నిలిచింది.

మరిన్ని వార్తలు