అల్లాహ్‌ సాక్షిగా.. అంజద్‌కు డిప్యూటీ సీఎం

9 Jun, 2019 09:54 IST|Sakshi
ప్రమాణ స్వీకారం చేస్తున్న ఎస్‌బి అంజద్‌బాషా

కడప కార్పొరేషన్‌: కడప శాసన సభ్యులు షేక్‌ బేపారి అంజద్‌బాషాను ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది. జిల్లా చరిత్రలోనే మొట్ట మొదటి సారిగా ఈ  పదవి అందుకున్న నేతగా  అంజద్‌బాషా రికార్డు సృష్టించారు. గతంలో డా. ఖలీల్‌బాషా, హాజీ అహ్మదుల్లా మంత్రులుగా పనిచేసినా ఆపై పదవులు లభించలేదు. ప్రస్తుతం వైఎస్‌ కుటుంబానికి విధేయుడిగానేకాక సౌమ్యుడు, సహనశీలి, అయిన ఆయనను ముస్లిం సామాజిక వర్గం నుంచి డిప్యూటీ సీఎంగా నియమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల ముస్లిం మైనార్టీల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ముస్లిం సామాజిక వర్గం నుంచి నలుగురు ఎమ్మెల్యేలుగా విజయం సాధించినా అన్ని సమీకరణల్లోనూ అంజద్‌బాషా అగ్రస్థానంలో నిలిచి ఉప ముఖ్యమంత్రి పదవి చేజిక్కించుకున్నారు. కేబినెట్‌లో ఆయనకు మైనార్టీ సంక్షేమ శాఖ దక్కింది.

 2014లో మొదటి సారి ఎమ్మెల్యేగా 45వేల  మెజార్టీతో గెలుపొందిన ఆయన 2019లో రెండోసారి 54వేల పైచిలుకు మెజార్టీతో తన బలాన్ని పెంచుకున్నారే తప్ప తగ్గించుకోలేదు. వైఎస్‌ఆర్‌సీపీ మైనార్టీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవంతో రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనార్టీలను ఏకం చేసి వారిని వైఎస్‌ఆర్‌సీపీ వైపు మళ్లించేలా చేసిన కృషికి  ఇప్పుడు గౌరవం దక్కింది. ముఖ్యంగా వైఎస్‌ఆర్‌ కుటుంబానికి వీర విధేయుడిగా ఉంటూ జిల్లా కేంద్రమైన కడపలో పార్టీ పిలుపు మేరకు ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆర్థికంగా కష్టనష్టాలను ఎదుర్కొన్నారు. ఇదే ఆసరాగా తీసుకొని టీడీపీ ప్రభుత్వం ఆయనకు భారీ నజరానా ప్రకటించి, మంత్రి పదవి ఇస్తామని ఆశ చూపినా తృణప్రాయంగా వదిలేశారే తప్పా ఆవైపు మొగ్గు చూపలేదు. ఇవన్నీ ప్రస్తుతం సమీకరణాల్లో కలిసొచ్చినట్లు తెలుస్తోంది. శనివారం ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన అల్లాహ్‌ సాక్షిగా అంటూ ప్రమాణ స్వీకారం చేసి తనకున్న దైవ భక్తిని చాటుకున్నారు. 

మరిన్ని వార్తలు