‘మున్సిపాలిటీలు స్వతంత్రత కోల్పోతాయి’

24 Jul, 2019 20:07 IST|Sakshi

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శలు

సాక్షి, ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా తీసుకువచ్చిన మున్సిపల్‌ చట్టం రాజ్యాంగ విరుద్ధమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. మధిరలో బుధవారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒంటెద్దు పోకడలు పోతూ రాష్ట్రంలో నియంత పాలన సాగించాలని చూస్తున్నారని మండిపడ్డారు. కొత్త మున్సిపల్‌ చట్టంలో కలెక్టర్లకు విశేషాధికారాలు ఇవ్వటం వల్ల మున్సిపాలిటీలు స్వతంత్రత కోల్పోతాయన్నారు. తద్వారా అభివృద్ధి కుంటుపడుతుందని వివరించారు. తమ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిచ్చి.. వారి మీద నమ్మకం లేకనే కేసీఆర్‌ కలెక్టర్లకు అధికారాలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. కొత్త మున్సిపల్‌ చట్టాన్ని రాష్ట్ర ప్రజలందరూ, ప్రజా సంఘాలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు